Pyre OTT: ఓటీటీలు రెజెక్ట్ చేశాయి, సినిమాలు తీయడమే మానేద్దామనుకున్నా: డైరెక్టర్ వినోద్ కామెంట్స్-ఇప్పటికీ రామాయణం దెబ్బ!

Vinod Kapri About OTTs Rejects Pyre: జాతీయ అవార్డు గ్రహీత వినోద్ కాప్రి తీసిన పైర్ ఓటీటీల తిరస్కరణ, తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమించి థియేటర్లలోకి వచ్చింది. రామాయణ వంటి భారీ చిత్రాల పోటీని తట్టుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న ఈ స్వతంత్ర చిత్రం వెనుక ఉన్న భావోద్వేగ ప్రయాణం ఇదీ.

Published on: Nov 9, 2026, 12:45:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Vinod Kapri About OTTs Rejects Pyre: సినిమా తీయడం ఒక ఎత్తైతే, దాన్ని ప్రేక్షకులకు చేర్చడం మరొక యుద్ధం. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొంది, 18 ప్రతిష్టాత్మక అవార్డులు సాధించిన ఒక మంచి చిత్రాన్ని ఓటీటీ సంస్థలు తిరస్కరిస్తే ఆ దర్శకుడి వేదన వర్ణనాతీతం.

ఓటీటీలు రెజెక్ట్ చేశాయి, సినిమాలు తీయడమే మానేద్దామనుకున్నా: డైరెక్టర్ వినోద్ కామెంట్స్-ఇప్పటికీ రామాయణం దెబ్బ!
ఓటీటీలు రెజెక్ట్ చేశాయి, సినిమాలు తీయడమే మానేద్దామనుకున్నా: డైరెక్టర్ వినోద్ కామెంట్స్-ఇప్పటికీ రామాయణం దెబ్బ!

జాతీయ అవార్డు గ్రహిత ఆవేదన

జాతీయ అవార్డు గ్రహీత వినోద్ కాప్రి సరిగ్గా ఇలాంటి తీవ్ర ఆవేదననే ఎదుర్కొన్నారు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీనే 'పైర్' (Pyre). ఆ సినిమా విడుదలకు థియేటర్లు, ఓటీటీల తలుపులు మూసుకుపోవడంతో ఒకానొక దశలో సినిమాలు తీయడమే మానేద్దామని ఆయన భావించారు. అన్ని ఆటంకాలనూ అధిగమించి థియేటర్లలోకి వచ్చిన పైర్ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.

ఉత్తరాఖండ్‌లోని కుమావున్ ప్రాంత నేపథ్యంలో సాగే ఈ కథ, గ్రామాల నుంచి పట్టణాలకు పిల్లలు వెళ్లిపోయాక ఒంటరితనంతో రగిలిపోయే ఒక వృద్ధ దంపతుల జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ చిత్రంలో 80 ఏళ్ల మాజీ సైనిక ఉద్యోగి పదమ్ సింగ్ కాప్రి, 70 ఏళ్ల హీరా దేవి ప్రధాన పాత్రల్లో నటించారు.

విచిత్రమేమిటంటే వీరికి నటనలో ఎలాంటి ముందస్తు అనుభవం లేదు. మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి తమ సహజ నటనతో ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నారు. పైర్ సినిమాను రూపొందించిన తర్వాత పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ వినోద్ కాప్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

జేబులో రూ. 7 వేలు.. పతాక స్థాయిలో తీవ్ర నిరాశ

"ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను సంప్రదించినా ఒక్కటి కూడా ఈ సినిమా కొనుగోలుకు ముందుకు రాలేదు. మానసికంగా, ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయాను. కెనడాలోని టొరంటోలో ప్రముఖ దర్శకురాలు దీపా మెహతా చేతుల మీదుగా అవార్డు అందుకున్న వేదికపైనే.. ఇకపై సినిమాలు తీయనంటూ నా రిటైర్మెంట్ ప్రకటించేశాను" అని వినోద్ కాప్రి తెలిపారు.

ఆ సమయంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అరింద్రా రాయ్ చౌదరి ఇచ్చిన ధైర్యంతో లండన్ వ్యాపారవేత్త సురేష్ జోషి ముందుకు వచ్చారు. "నా కంపెనీ బ్యాంకు ఖాతాలో కేవలం 7,000 రూపాయలు మాత్రమే మిగిలాయి. సినిమా ప్రచారానికి రూపాయి కూడా లేని స్థితిలో సురేష్ జోషి ఆర్థిక సాయం అందించి థియేటర్లలో విడుదలకు మార్గం సుగమం చేశారు" అని వినోద్ వెల్లడించారు.

ఓటీటీ సంస్థలు ఈ చిత్రాన్ని తిరస్కరించడమే ఒక రకంగా మేలైందని, లేకపోతే థియేటర్లలో ప్రేక్షకులు చూపిస్తున్న ఈ అపరిమితమైన ప్రేమ దక్కేది కాదని వినోద్ కాప్రి అభిప్రాయపడ్డారు.

వసూళ్ల జోరు.. థియేటర్లలో భావోద్వేగాల ప్రవాహం

అక్టోబర్ 30న హిందీతో పాటు మలయాళంలో విడుదలైన పైర్ చిత్రం స్వల్ప ఆరంభంతో ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదటి రోజు కేవలం 80 స్క్రీన్లలో 8 లక్షల రూపాయల వసూళ్లు సాధించిన 'పైర్', మౌత్ టాక్ (Word of Mouth) బలంతో ఐదో రోజు నాటికి 400 షోలకు విస్తరించింది. రోజువారీ వసూళ్లు రూ. 8 లక్షల నుంచి రూ. 27 లక్షలు, ఆపై రూ. 70 లక్షలకు పెరిగాయి.

ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కాన్పూర్, లక్నో వంటి నగరాల్లో దర్శకుడు వినోద్ కాప్రి, ప్రధాన నటులు థియేటర్లను సందర్శిస్తున్నారు. "సినిమా పూర్తయ్యాక థియేటర్లలోని ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పెద్ద వయసున్న మా నటులను కౌగిలించుకుంటూ, వారి పాదాలకు నమస్కరించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ ఆదరణ చూస్తుంటే నా మనసు నిండిపోతోంది" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

'రామాయణ' పోటీతో 70 శాతం షోలకు కోత

కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపు నిరంతరం సవాలే. తెలుగు నాట 'బలగం', 'కేరాఫ్ కంచరపాలెం' వంటి సినిమాలు విడుదలైనప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులనే 'పైర్' కూడా అనుభవిస్తోంది. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణ' పోటీ కారణంగా పైర్ షోలు ఒక్కసారిగా 70 శాతం తగ్గిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 90 షోలు మాత్రమే నడుస్తున్నాయి.

"థియేటర్ యాజమాన్యాలు కూడా ఈ సినిమాను ప్రదర్శించాలనుకుంటున్నా, పెద్ద చిత్రాల ఒత్తిడి వల్ల చేతులు కట్టేసినట్లయింది. అయితే మిగిలిన 90 షోలలో 80 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడం ఊరటనిచ్చే అంశం" అని డైరెక్టర్ వినోద్ కాప్రి పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More