Drishyam 3: దృశ్యం 3 ట్రైలర్.. మళ్లీ మొదలైన జార్జ్ కుట్టి మైండ్ గేమ్.. సస్పెన్స్ మామూలుగా లేదుగా!
Drishyam 3: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న 'దృశ్యం 3' ట్రైలర్ విడుదలైంది. గతం వెంటాడుతున్న వేళ, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి జార్జ్ కుట్టి చేసే పోరాటం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Drishyam 3: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దృశ్యం 3' చిత్ర ట్రైలర్ శనివారం (మే 9) విడుదలైంది. గత రెండు భాగాల్లో అద్భుతమైన సస్పెన్స్‌తో మెప్పించిన జార్జ్ కుట్టి (మోహన్‌లాల్) అండ్ ఫ్యామిలీ, ఈసారి కూడా పోలీసుల కళ్లు గప్పి తమను తాము ఎలా రక్షించుకున్నారనేది ఈ మూడో భాగం కథగా కనిపిస్తోంది.

దృశ్యం 3 ట్రైలర్
ఇండియాలోనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో దృశ్యం సినిమాలకు ఓ బ్రాండ్ ఉంది. ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు అదరగొట్టాయి. ఇప్పుడు దృశ్యం 3 అంతకుమించిన రేంజ్ లో మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ గా రెడీ అయిందని ట్రైలర్ తో స్పష్టమవుతోంది. ఇవాళ రిలీజైన ట్రైలర్ అదిరిపోయింది. గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదని, అది సరైన సమయం కోసం వేచి చూస్తుందని జార్జ్ కుట్టి పాత్ర ద్వారా అంచనాలు పెంచేశారు మేకర్స్.
ఈసారి మీడియా ఇన్వెస్టిగేషన్
దృశ్యం ఫస్ట్ రెండు భాగాల్లోనూ పోలీసుల దర్యాప్తు చుట్టూ కథ తిరిగింది. కానీ 'దృశ్యం 3'లో దర్శకుడు జీతూ జోసెఫ్ కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఈసారి ఇద్దరు యువ జర్నలిస్టులు వరుణ్ ప్రభాకర్ కేసుకు సంబంధించిన రహస్యాలను ఛేదించడానికి రంగంలోకి దిగుతారు.
మీడియా ఇన్వెస్టిగేషన్ ద్వారా చుట్టుముట్టే ప్రమాదం నుంచి జార్జ్ కుట్టి కుటుంబం ఎలా తప్పించుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. కుటుంబ రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే జార్జ్ కుట్టి పాత్రలో మోహన్‌లాల్ మరోసారి పరకాయ ప్రవేశం చేశారు.
భారీ తారాగణం
దృశ్యం 3 సినిమాలో మోహన్‌లాల్ తో పాటు మీనా, ఎస్తర్ అనిల్, అన్సిబ హసన్, ఆశా శరత్, సిద్ధార్థ్ వంటి ఫ్రాంచైజీ రెగ్యులర్ నటీనటులు కనిపిస్తున్నారు. వీరితో పాటు వీణా నందకుమార్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
రెండో భాగంలో కనిపించిన మురళీ గోపి, గణేష్ కుమార్, శాంతి మాయాదేవి కూడా ఈ మూడో భాగంలో భాగమయ్యారు. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ, వినాయక్ వి.ఎస్ ఎడిటింగ్, అనిల్ జాన్సన్ సంగీతం ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి.
విడుదల ఎప్పుడు?
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ ఈ దృశ్యం 3 చిత్రాన్ని నిర్మించారు. పెన్ స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ ఈ సినిమాకు భాగస్వాములుగా ఉన్నారు. మే 21న మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక హిందీ వెర్షన్ గురించి చెప్పాలంటే అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ 'దృశ్యం 3'ని అక్టోబర్ 2న (గాంధీ జయంతి సందర్భంగా) విడుదల చేయనున్నట్లు సమాచారం.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'దృశ్యం 3' విడుదల తేదీ ఎప్పుడు?
జవాబు: మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'దృశ్యం 3' మలయాళ వెర్షన్ మే 21, 2026న విడుదలవుతుంది.
ప్రశ్న: హిందీ 'దృశ్యం 3' ఎప్పుడు వస్తుంది?
జవాబు: అజయ్ దేవగన్ నటించే హిందీ రీమేక్ అక్టోబర్ 2, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ప్రశ్న: దృశ్యం 3 సినిమాలో జార్జ్ కుట్టిగా ఎవరు నటించారు?
జవాబు: దృశ్యం ఫ్రాంఛైజీ సినిమాలతో జార్జ్ కుట్టీగా అదరగొట్టిన మోహన్ లాల్ మరోసారి అదే క్యారెక్టర్ పోషించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


