డైరెక్ట‌ర్‌గా విష్వ‌క్ సేన్‌.. ప్రొడ్యూస‌ర్‌తో ల‌వ్‌.. ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఫంకీ.. న‌వ్విస్తున్న ట్రైల‌ర్‌

సక్సెస్ కోసం రూట్ మార్చాడు హీరో విష్వక్ సేన్. మాస్ క్యారెక్టర్లు పక్కకు పెట్టి ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఫంకీ మూవీ చేశాడు. ఈ మూవీ ట్రైలర్ ఈ రోజు రిలీజైంది. ఈ ట్రైలర్ కడుపుబ్బా నవ్విస్తోంది. 

Feb 7, 2026, 21:24:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒక్క హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు హీరో విష్వక్ సేన్. దాస్ కా దమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా.. ఇలా వరుసగా సినిమాలు చేసినా అనుకున్న హిట్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఓ హిట్ కోసం రూట్ మార్చి కామెడీ ఎంటర్ టైనర్ ‘ఫంకీ’ మూవీ చేశాడు విష్వక్. ఈ రోజు (ఫిబ్రవరి 7) రిలీజైన ఈ మూవీ ట్రైలర్ కడుపుబ్బా నవ్విస్తోంది.

ఫంకీ ట్రైలర్ రిలీజ్ (x/SitharaEnts)
ఫంకీ ట్రైలర్ రిలీజ్ (x/SitharaEnts)

ఫంకీ ట్రైలర్

జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించిన మూవీ ‘ఫంకీ’. ఇందులో విష్వక్ సేన్, కాయదు లోహర్ హీరో హీరోయిన్లు. ఈ సినిమా ట్రైలర్ ను శనివారం రిలీజ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పంచ్ లతో ట్రైలర్ అదిరిపోయింది. దీన్ని బట్టి చూస్తే సినిమాను మరోసారి అనుదీప్ తన స్టైల్లో కామెడీ మూవీగా రెడీ చేశాడని అర్థమవుతోంది.

పంచ్ లే పంచ్ లు

ఫంకీ ట్రైలర్ పేరుకు తగ్గట్లే ఫన్నీగా, పూర్తి పంచ్ లతో నిండిపోయింది. ‘మా అమ్మకు ఏమైంది’ అని ఓ కుర్రాడు వచ్చి అడుగుతాడు. ‘ఆపరేషన్ చేయాలి’ అని డాక్టర్ అంటే.. ‘నాకు ఆపరేషన్ చేయడం రాదు’ అని ఆ కుర్రాడు ఉంటాడు. ఇలా లాజిక్ లేని పంచ్ లతో స్టార్ట్ అయిన ట్రైలర్ పూర్తి కామెడీతో నిండిపోయింది.

సినిమా డైరెక్టర్

ఫంకీ మూవీలో సినిమా తీయాలనే లక్ష్యంతో ఉన్న డైరెక్టర్ గా విష్వక్ సేన్ నటిస్తున్నాడు. ఇంటలిజెంట్ డైరెక్టర్లు కావాలా? నేను కావాలా? అని హీరో కోమల్ క్యారెక్టర్లో విష్వక్ సేన్ అడగడం నవ్వు తెప్పిస్తోంది. ఈ ట్రైలర్ లో విష్వక్ సేన్ కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది. రూ.4 కోట్ల బడ్జెట్ అన్నాడమ్మా అది రూ.40 కోట్లు అయిందని సీనియర్ నటుడు నరేష్ వీకే అంటాడు.

ప్రొడ్యూసర్

ఫంకీ సినిమాలో హీరోయిన్ కాయదు లోహర్ ప్రొడ్యూసర్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది. రూ.1 కోటి రూపాయలతోనే కోమల్ తో సినిమా తీయిస్తానని ఆమె చెప్తుంది. ప్రొడ్యూసర్ ను లైన్ లో పెడదామని కోమల్ ట్రై చేస్తాడు. మధ్యలో చాయ్ బిస్కెట్ బ్యాచ్ చేసే కామెడీ నవ్విస్తుంది.

ట్రైలర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఇలాగే పంచ్ లతో సాగింది. ఫంకీ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. దీనికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్.