గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పెళ్లికి ముందే బిడ్డను కన్నావా అంటూ నిలదీసిన ప్రభావతి.. నిజం ఒప్పుకున్న రోహిణి
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జనవరి 21) ఎపిసోడ్ కీలక మలుపు తీసుకుంది. పెళ్లికి ముందే బిడ్డను కన్నావా అంటూ రోహిణిని ప్రభావతి నిలదీయడం, దానిని అవును అని ఆమె అంగీకరించడంతో సత్యం ఫ్యామిలీలో అలజడి నెలకొంటుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 602వ ఎపిసోడ్ లో శుభవార్త అంటూ ఇటు రోహిణి, అటు బాలు స్వీట్లు పంచుతారు. కానీ చివర్లో రోహిణి గురించి అసలు నిజం తెలిసిన ప్రభావతి ఆమెను నిలదీస్తుంది. దీంతో ఇంట్లో పెద్ద రచ్చే జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

రెండోసారి అంటూ పిచ్చిదానిలా మాట్లాడిన మీనా
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జనవరి 21) ఎపిసోడ్ బాలుతో మీనా పిచ్చిదానిలా ప్రవర్తించే సీన్ తో మొదలవుతుంది. మన ఇల్లు ఇదేనా.. ఇక్కడికి ఎప్పుడు మార్చారు.. రెండోసారి డెలివరీయా.. అయితే మొదటిసారి బిడ్డను కనే ఉంటుంది కదా అని ఏదేదో మాట్లాడటంతో బాలు కూడా టెన్షన్ పడతాడు. అయితే తనకు అర్జెంట్ గా ట్రిప్ వచ్చిందని, నొప్పులతో బాధపడుతున్న మహిళను హాస్పిటల్ కు తీసుకెళ్లాలని వెళ్లిపోతాడు.
ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రభావతితోనూ మీనా అలాగే ఉంటుంది. టీ పెట్టమంటే టీవీ పెడుతుంది. రెండోసారి రెండోసారి అంటూ హాస్పిటల్లో రోహిణిని చూసినప్పటి నుంచీ మీనా అంటూనే ఉంటుంది. అది అర్థం కాక ప్రభావతి కూడా తిడుతుంది. చివరికి టీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్తుంది.
శుభవార్త అంటూ స్వీట్లు తెచ్చిన రోహిణి, మనోజ్
అప్పుడే రోహిణి, మనోజ్ శుభవార్త అంటూ స్వీట్లు పట్టుకొని వస్తారు. అది కిచెన్ లో నుంచే విన్న మీనా కచ్చితంగా ఇది అదే అయి ఉంటుందని అనుకుంటుంది. ఇటు ప్రభావతి కూడా రోహిణి ప్రెగ్నెంట్ ఏమో అని సంతోషిస్తుంది. కానీ షాపులో సేల్స్ బాగా జరిగినందుకు తెచ్చానని చెప్పడంతో వాళ్లను తిడుతుంది.
తాను ఓ శుభవార్త కోసం ఎదురు చూస్తుంటే.. ఇలాంటి వాటికి స్వీట్లు తెస్తారా అని అంటుంది. అది కూడా త్వరలోనే వస్తుందని, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని మనోజ్ అనడంతో రోహిణి మరింత టెన్షన్ పడుతుంది. టీ తీసుకొచ్చిన మీనా.. రోహిణిని అలాగే చూస్తూ ఉండిపోవడంతో ఆమెలో ఆందోళన మరింత పెరుగుతుంది.
మెడలో దండతో స్వీట్లు తెచ్చిన బాలు
అప్పుడే రవి, శృతి ఇంటికి వస్తారు. బాలు అన్నయ్య ఏం చేశాడో తెలుసా అంటూ మీనాను అడుగుతాడు రవి. మళ్లీ ఏమైనా తప్పుడు పని చేశాడా అంటూ ప్రభావతి, మనోజ్ అడుగుతారు. అసలు ఏం చేశాడో చెప్పమని సత్యం అడుగుతుండగానే బాలు మెడలో దండ, స్వీటు బాక్సుతో వస్తాడు.
తాను నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను కారులో తీసుకెళ్లానని, ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో ఓ మార్కెట్లోకి తీసుకెళ్లినట్లు చెబుతాడు. అక్కడ ఓ పెద్దావిడ ఆమెకు రెండు నిమిషాల్లో ప్రసవం చేసిందని అంటాడు. తల్లి, పిల్లను కాపాడిన దేవుడివంటూ తనను అందరూ పొగిడి ఇలా దండ వేసి, స్వీట్లు కూడా ఇచ్చారని చెబుతాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ సంతోషిస్తారు.
బయట పిల్లలను ఎత్తుకోవడమే తప్ప ఇంట్లో పిల్లలను తీసుకొచ్చే ఉద్దేశం ఉందా లేదా అని ప్రభావతి నిష్టూరమాడుతుంది. దీంతో సత్యం జోక్యం చేసుకొని బాలు చేసిన మంచి పని మనకూ తిరిగి వస్తుందని, ఒకేసారి ముగ్గురూ పిల్లలను కన్నా ఆశ్చర్యం లేదని అంటాడు.
పెళ్లికి ముందే బిడ్డను కన్నానని ఒప్పుకున్న రోహిణి
ఆ తర్వాత రోహిణి గురించి బాలుకి మీనా చెప్పడం అలా మెల్లగా ఆ విషయం ప్రభావతి వరకు చేరడంతో ఆమె రోహిణిని అందరి ముందు నిలదీస్తుంది. గదిలో నుంచి రోహిణిని హాల్లోకి లాక్కొచ్చి మరీ కడిగేస్తుంది. పెళ్లికి ముందే తల్లయ్యావా? మనోజ్ ను రెండో పెళ్లి చేసుకున్నావా అని పదే పదే అడగడంతో రోహిణి కూడా అవును అంటూ నిజం ఒప్పుకుంటుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












