గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుని మోసం చేసిన రాజేష్.. ఇచ్చిన లక్షతో తాగి తందనాలు.. మనోజ్‌ను మోసం చేసిన విద్య
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 11) ఎపిసోడ్ లో తన ఫ్రెండ్ బాలుని రాజేష్ మోసం చేస్తాడు. తల్లిదండ్రుల షష్టిపూర్తి అని చెప్పి బాలు ఇచ్చిన లక్షతో తాగి తందనాలు ఆడతాడు. దీంతో బాలుకి మీనా చెప్పిన తత్వం బోధపడుతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 617వ ఎపిసోడ్ లో భార్య మీనా చెప్పినా వినకుండా ఫ్రెండ్ రాజేష్ కు సాయం చేసిన బాలుకి అసలు నిజం తెలిసి వస్తుంది. అటు బాలు, మీనా మధ్య గొడవ పెట్టి కడుపు నింపుకోవాలని చూసిన ప్రభావతికి కూడా షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

మనోజ్‌ను మోసం చేసిన రోహిణి, విద్య
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 11) ఎపిసోడ్ మనోజ్, రోహిణి దగ్గరికి విద్య వచ్చి కంటతడి పెట్టే సీన్ తో మొదలవుతుంది. ఏం జరిగిందని అడిగితే.. తన తల్లికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని, రూ.75 వేలు కావాలని చెబుతుంది. దీంతో మనోజ్ పెద్ద మనసుతో ఆ డబ్బు ఇవ్వాలని అనుకుంటాడు. కానీ దానికి కూడా వడ్డీ వసూలు చేద్దామని రోహిణితో అంటాడు.
బయటకు వెళ్లిన తర్వాత రోహిణి, విద్య నవ్వుకుంటారు. మనోజ్ ను భలే బురిడీ కొట్టించావ్.. నీ యాక్టింగ్ అదిరిపోయిందని విద్యను మెచ్చుకుంటుంది రోహిణి. ముందు ఇచ్చిన రూ.లక్ష రూమ్ అడ్వాన్స్ కు ఇవ్వమని, మనోజ్ పంపించే రూ.75 వేలతో చింటు స్కూలు ఫీజు కట్టమని విద్యకు చెబుతుంది.
బాలు డబ్బు ఇచ్చినా వద్దన్న రాజేష్
ఇటు రాజేష్ దగ్గరికి బాలు డబ్బుతో వస్తాడు. కానీ అతడు మాత్రం వద్దంటాడు. ఏం జరిగిందని అతన్ని నిలదీస్తాడు. దీంతో మీనా వచ్చిన విషయం రాజేష్ చెబుతాడు. ఈ డబ్బు ఇంట్లో నుంచి తీసుకురాలేదని, ఫైనాన్షియర్ నుంచి తెచ్చానని అంటాడు. బలవంతంగా అతనికి డబ్బు ఇస్తాడు. ఆ డబ్బుతో రాజేష్ ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకుంటాడు.
మీనాతో మళ్లీ గొడవ పడిన బాలు
ఇటు ఇంటికి వెళ్లిన తర్వాత మీనాను మేడ మీదికి లాక్కెళ్తాడు బాలు. రాజేష్ దగ్గరికి ఎందుకు వెళ్లావ్.. ఏం చెప్పావ్.. మా స్నేహం మధ్యలోకి రావడానికి నువ్వెవరు.. నిన్న కాక మొన్న నాకు భార్యగా వచ్చావ్.. నీకేం హక్కు ఉంది అంటూ గొడవ పడతాడు. తానేమీ చెప్పలేదని, అనవసర ఆడంబరాలతో ఖర్చు తప్ప ఒరిగేదేమీ లేదని, ఆ డబ్బు కోసం ఎంత కష్ట పడతామో చెప్పానని మీనా అంటుంది.
అయినా తాను మాత్రం ఫైనాన్షియర్ నుంచి రూ.లక్ష తెచ్చి రాజేష్ కు ఇచ్చినట్లు బాలు చెబుతాడు. అప్పు తెచ్చి అప్పు ఇచ్చావా అంటూ బాలుని మీనా నిలదీస్తుంది. నీ డబ్బు ఇవ్వలేదు కదా.. గది కోసం నువ్వే కదా శపథం చేసింది.. అందులో అంతా నీ డబ్బే కాదు కదా అని మీనాని బాలు నానా మాటలు అంటాడు.
మంట పెట్టాలని చూసిన మీనా
ఇదంతా చాటుగా వింటున్న ప్రభావతి రంగంలోకి దిగుతుంది. ఇద్దరి మధ్య మరింత చిచ్చు పెట్టాలని చూస్తుంది. వాడి డబ్బు వాడు ఎవరికో ఇచ్చుకుంటే నీకెందుకు అని మీనాను అంటుంది. అదే డబ్బు తన పుట్టింటి వారికి ఇస్తే మీరు ఇలాగే అంటారా అంటూ మీనా ఎదురు తిరుగుతుంది. డబ్బు విషయంలో మీ కొడుకు సపోర్ట్ చేసి మీరూమీరూ ఒక్కటయ్యారా.. డబ్బు ఇచ్చినందుకు మీరే ఫీలవుతారు.. ఏమైనా చేసుకోండి అని మీనా వెళ్లిపోతుంది. బాలు కూడా ప్రభావతిని నీ కడుపు ఇంకా నిండలేదా.. వెళ్లు అని అంటాడు.
షష్టిపూర్తికి బాలుతో కలిసి వెళ్లిన మీనా
షష్టిపూర్తికి వెళ్లడానికి బాలు రెడీ అవుతాడు. అటు మీనా కూడా అతని వెంటే వస్తుంది. రాజేష్ ఇంటికి వెళ్లిన తర్వాత తాను అతనికి ఎందుకు డబ్బు ఇచ్చానో నీకు అర్థమవుతుంది అని అంటాడు. అదీ చూద్దాం పద అని మీనా అతని వెంట వెళ్తుంది. తీరా రాజేష్ ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్లకు షాక్ తగులుతుంది.
తల్లిదండ్రులను ఇంటి ముందే రెండు కుర్చీలు వేసి తతంగం ముగిస్తాడు రాజేష్. వాళ్లు గదిలో ఓ మూలన ఉండటం చూసి బాలు షాక్ తింటాడు. అసలు రాజేష్ ఎక్కడ అని అడుగుతాడు. అతడు పెరట్లో ఫ్రెండ్స్ కు మందు పార్టీ ఇస్తుంటాడు. అందరూ తాగి తందనాలు ఆడుతుంటారు.
దీనికోసమే కదా నీ దగ్గర రూ.లక్ష తీసుకుంది అని బాలుతో రాజేష్ అంటాడు. దీంతో మీనా వైపు చూస్తాడు బాలు. ఇప్పుడు అర్థమైంది కదా అన్నట్లుగా మీనా అతన్ని జాలిగా చూస్తుంది. ఆ తర్వాత భోజనం విషయంలో అక్కడి తాగుబోతులతో బాలుకు గొడవ జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత భార్య వినకుండా తగిన శాస్తి అనుభవించావంటూ బాలు అంతరాత్మ అతనికి చెబుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


