Dhurandhar: ఇదో అసహ్యకరమైన సినిమా.. ద్వేషం తప్ప ఏమీ లేదన్న హాట్‌మెయిల్ కోఫౌండర్.. మరీ అంతగా దిగజారకంటున్న ఫ్యాన్స్

ధురంధర్  (Dhurandhar) మూవీపై హాట్‌మెయిల్ కో ఫౌండర్ సబీర్ భాటియా ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదో చెత్త మూవీ అని, క్రియేటివిటీ జీరో అని అన్నాడు. దీంతో కొందరు ఫ్యాన్స్ అతన్ని లక్ష్యంగా చేసుకుంటూ మరీ అంతగా దిగజారకు అని చురకలంటించారు.

Published on: Feb 24, 2026, 13:59:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ వేదికగా సంచలన విజయం సాధించిన రణ్‌వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ధురంధర్' (Dhurandhar). ఈ సినిమాపై తాజాగా హాట్‌మెయిల్ కో-ఫౌండర్ సబీర్ భాటియా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సినిమా కేవలం విద్వేషాన్ని రగులుస్తోందని, ఇందులో ఎలాంటి మేధోపరమైన అంశం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో రివ్యూ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Dhurandhar: ఇదో అసహ్యకరమైన సినిమా.. ద్వేషం తప్ప ఏమీ లేదన్న హాట్‌మెయిల్ కోఫౌండర్.. మరీ అంతగా దిగజారకంటున్న ఫ్యాన్స్
Dhurandhar: ఇదో అసహ్యకరమైన సినిమా.. ద్వేషం తప్ప ఏమీ లేదన్న హాట్‌మెయిల్ కోఫౌండర్.. మరీ అంతగా దిగజారకంటున్న ఫ్యాన్స్

సబీర్ భాటియా ధురంధర్ రివ్యూ

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్'. విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసి ఈ సినిమా రికార్డు సృష్టించింది. జనవరిలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత మరింత మంది ప్రేక్షకులకు చేరువై టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమాపై ప్రముఖ టెక్ దిగ్గజం సబీర్ భాటియా చేసిన విమర్శలు ఆసక్తికరంగా మారాయి.

సబీర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో 'ధురంధర్' సినిమాపై ఒక వీడియో రివ్యూను పోస్ట్ చేశారు. దానికి "నేటి సినిమాలు మిమ్మల్ని మానసికంగా బలోపేతం చేయడానికి తీయడం లేదు. మిమ్మల్ని రెచ్చగొట్టేలా ఇంజనీరింగ్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి!" అని క్యాప్షన్ ఇచ్చారు.

"అసహ్యంగా ఉంది.. సినిమాను బహిష్కరించండి"

వీడియోలో ఆయన ఏమన్నారంటే.. "నేను ఇప్పుడే ధురంధర్ సినిమా చూశాను. ఇందులో ఎమోషన్స్, సెన్సేషనలిజం, డ్రామా అన్నీ ఉన్నాయి. కానీ మేధోపరమైన అంశం ఎక్కడుంది? ఇది కేవలం ప్రతీకారం, ద్వేషాన్ని మాత్రమే వ్యాప్తి చేస్తోంది. ఇది చాలా అసహ్యంగా ఉంది." అని అన్నారు.

"మన పిల్లలు ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యే వారిలా ఉండకూడదు. నేటి యువత లాజికల్‌గా ఆలోచించేలా ఉండాలని మనం కోరుకుంటాం. ఈ సినిమాలో క్రియేటివిటీ జీరో. అర్థం పర్థం లేని హత్యలు, పగ తీర్చుకోవడం చూడటంలో నాకు ఎలాంటి వినోదం కనిపించడం లేదు. ఇది చాలా భయంకరమైన ఆలోచనా విధానాన్ని ప్రోత్సహిస్తోంది" అని సబీర్ స్పష్టం చేశారు.

దేశాలు కాదు, వ్యక్తులు మాత్రమే మంచి లేదా చెడుగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం దేశాలను ఒకే గాటన కట్టేయడం సరికాదని చెబుతూ.. "మీరంతా ఈ సినిమాను పూర్తిగా తిరస్కరిస్తారని ఆశిస్తున్నాను," అని వీడియోను ముగించారు.

నెటిజన్ల రియాక్షన్.. రెండు వర్గాలుగా ఫ్యాన్స్

సబీర్ భాటియా వీడియోపై ఇంటర్నెట్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆయనతో ఏకీభవిస్తుంటే, మరికొందరు తీవ్రంగా విభేదిస్తున్నారు.

"విద్వేషాన్ని, ప్రచారాన్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న ఈ వ్యవస్థ నుండి మీరు మేధోమథనాన్ని ఆశించడం అత్యాశే. దయ, ప్రేమ, మంచి కామెడీ అనేవి ఎప్పుడో చచ్చిపోయాయి" అని ఒకరు కామెంట్ చేశారు. "మేము కూడా ధురంధర్ 2 సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదని నిర్ణయించుకున్నాం" అని మరొకరు బదులిచ్చారు.

ఇక మరికొందరు ఆయనతో విభేదించారు. "నేను మీతో ఏకీభవించను. హాలీవుడ్ కూడా కొన్నిసార్లు అర్థం లేని, ఎలాంటి విలువలూ లేని సినిమాలు తీస్తుంది. సినిమాలు వినోదం కోసమే తీస్తారు. ప్రతి దాంట్లో జ్ఞానం వెతికితే కష్టం" అని ఒకరు వాదించారు.

"విండోస్ 95 కాలం నుంచి మిమ్మల్ని గౌరవిస్తున్నాను. కానీ సినిమాలో చూపించినవి నిజమైన సంఘటనల ఆధారంగా తీసినవి. దయచేసి ఆ స్థాయికి దిగజారకండి" అని మరొక నెటిజన్ కౌంటర్ ఇచ్చారు.

'ధురంధర్' నేపథ్యం.. సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే?

పాకిస్థాన్‌లోని కరాచీలో ఉండే లియారీలో ఉన్న ఒక బలోచ్ గ్యాంగ్‌లోకి చొరబడిన ఒక భారతీయ గూఢచారి కథే ఈ 'ధురంధర్'. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) మార్చి 19న థియేటర్లలోకి రానుంది. అదే రోజున యష్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' తో ఇది బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More