K Pop Weverse Con Festival In India: భారతీయ సంగీత ప్రియులకు, కే-పాప్ (K-pop) అభిమానులకు ఇది నిజంగా పెద్ద పండగ లాంటి వార్త. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూత్‌ను ఊపేస్తున్న కొరియన్ సంగీత దిగ్గజం 'హైబ్' (HYBE) చరిత్రలోనే తొలిసారిగా తన ప్రతిష్టాత్మక 'వీవర్స్ కాన్ ఫెస్టివల్' (Weverse Con Festival)ను భారత్‌కు తీసుకొస్తోంది.
దక్షిణ కొరియా సరిహద్దులు దాటి

2027 మార్చి 27, 28 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు ఈ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరగనుంది. దక్షిణ కొరియా సరిహద్దులు దాటి మరో దేశంలో ఈ ఫెస్టివల్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బీటీఎస్ (BTS), సెవెంటీన్ (SEVENTEEN), లెస్సెరాఫిమ్ (LE SSERAFIM) వంటి గ్లోబల్ బ్యాండ్లతో అంతర్జాతీయ సంగీత రంగాన్ని ఏలుతున్న 'హైబ్' సంస్థ, భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.
తెలుగు రాష్ట్రాల్లో సహా భారతదేశమంతటా కే-పాప్ డ్యాన్స్, మ్యూజిక్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో భారతీయ వేదికపై ఇటు ప్రముఖ కొరియన్ (కే-పాప్) స్టార్స్, అటు టాప్ ఇండియన్ ఆర్టిస్టులు ఒకే వేదికను పంచుకోబోతున్నారు.
కే-పాప్ ప్రేమికులకు పండగే.. లైవ్ షోల హంగామా!
సూపర్‌ఫ్యాన్ ప్లాట్‌ఫామ్ 'వీవర్స్' స్ఫూర్తితో రూపొందించిన ఈ ఫెస్టివల్ కేవలం స్టేజీ ప్రదర్శనలకే పరిమితం కాకుండా, అభిమానులకు సరికొత్త ఇంటరాక్టివ్ అనుభూతిని అందించనుంది. అభిమానులు నేరుగా తమకు ఇష్టమైన అంతర్జాతీయ, భారతీయ స్టార్లతో ముఖాముఖి కనెక్ట్ అయ్యేలా ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. విభిన్న సంస్కృతులను మేళవిస్తూ వినూత్న కొలాబరేషన్ ప్రదర్శనలు ప్లాన్ చేస్తున్నారు.
కొత్త అధ్యాయానికి నాంది
"వీవర్స్ కాన్ ఫెస్టివల్ ఇండియా మా 'మల్టీ-హోమ్, మల్టీ-జానర్' వ్యూహంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. భారత్‌ను గ్లోబల్ విస్తరణలో అత్యంత కీలకమైన మార్కెట్‌గా చూస్తున్నాం" అని హైబ్ సీఈఓ జేసన్ జైసాంగ్ లీ వెల్లడించారు.
{{/usCountry}}"వీవర్స్ కాన్ ఫెస్టివల్ ఇండియా మా 'మల్టీ-హోమ్, మల్టీ-జానర్' వ్యూహంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. భారత్‌ను గ్లోబల్ విస్తరణలో అత్యంత కీలకమైన మార్కెట్‌గా చూస్తున్నాం" అని హైబ్ సీఈఓ జేసన్ జైసాంగ్ లీ వెల్లడించారు.
{{/usCountry}}"ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహభరితమైన కే-పాప్ ఫ్యాన్ కమ్యూనిటీ ఉన్న భారతదేశానికి ఈ లైవ్ ఫెస్టివల్‌ను తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది" అని వీవర్స్ కంపెనీ ప్రెసిడెంట్ జూయిల్ యాంగ్ పేర్కొన్నారు.
టికెట్లు ఎక్కడ దొరుకుతాయి? భాగస్వాములు ఎవరు?
ఈ మెగా మ్యూజిక్ ఈవెంట్‌ను హైబ్, వీవర్స్‌లతో కలిసి 'బుక్‌మైషో లైవ్' (BookMyShow Live) సహ-నిర్మాణం చేస్తోంది. టికెట్లు కేవలం బుక్‌మైషో వేదికపై మాత్రమే లభిస్తాయి. కియా ఇండియా, మాస్టర్‌కార్డ్, ప్రాజెక్ట్ బి, శామ్‌సంగ్ ప్రెజెంటింగ్ పార్ట్‌నర్లుగా వ్యవహరిస్తుండగా, నాంగ్‌షిమ్ (NONGSHIM) అసోసియేట్ పార్ట్‌నర్‌గా నిలిచింది. మాస్టర్‌కార్డ్ వినియోగదారులకు టికెట్ల ప్రీ-సేల్‌లో ప్రత్యేక యాక్సెస్ లభిస్తుంది.
ముంబై కేంద్రంగా 'హైబ్ ఇండియా' విస్తరణ
కేవలం ఒక ఈవెంట్‌తో సరిపెట్టకుండా, భారతీయ సంగీత ప్రతిభను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు 'హైబ్ ఇండియా' ముంబైలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహిస్తూ, స్థానిక కళాకారులను ప్రోత్సహించడం, కొత్త కంటెంట్‌ను రూపొందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. తద్వారా రాబోయే రోజుల్లో భారతీయ కే-పాప్ ప్రేమికులకు మరింత వినోదాన్ని పంచడానికి హైబ్ బలమైన పునాది వేస్తోంది.