Kajal Aggarwal: ఇప్పటి హీరోయిన్ల పరిస్థితి చూస్తే జాలేస్తోంది, ఇంత క్రూరత్వం లేదు: కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

Kajal Aggarwal On Modern Beauty Standards For Heroines: సినిమా ఇండస్ట్రీలో మారుతున్న అందాల ప్రమాణాలు, విపరీతమైన ట్రోలింగ్‌పై సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో నేటి తరం హీరోయిన్లు ఎదుర్కొంటున్న క్రూరమైన పరిస్థితులపై కాజల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Published on: Jul 4, 2026, 11:30:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kajal Aggarwal On Modern Beauty Standards For Heroines: టాలీవుడ్ చందమామగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్ర నటిగా రాణిస్తున్న ఆమె, గ్లామర్ ప్రపంచంలో వస్తున్న మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటి హీరోయిన్ల పరిస్థితి చూస్తే జాలేస్తోంది, ఇంత క్రూరత్వం లేదు: కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్
ఇప్పటి హీరోయిన్ల పరిస్థితి చూస్తే జాలేస్తోంది, ఇంత క్రూరత్వం లేదు: కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియా హవా

సినిమా పరిశ్రమలో శారీరక రూపం, అందం చుట్టూ ముసురుకుంటున్న ఒత్తిడి రోజురోజుకూ ముదిరిపోతోందని కాజల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత హీరోయిన్ల రూపాన్ని విమర్శించే ధోరణి మరీ దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.

మన టాలీవుడ్‌లో కానీ, అటు బాలీవుడ్‌లో కానీ హీరోయిన్ల బరువు, గ్లామర్ గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కాజల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నేటి తరం యంగ్ హీరోయిన్లు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను చూస్తుంటే తనకు ఎంతో బాధేస్తోందని కాజల్ చెప్పుకొచ్చారు.

అప్పట్లో ఎయిర్‌పోర్ట్ లుక్స్ గొడవల్లేవు

జూమ్ ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ తన కెరీర్ ఆరంభ రోజులను గుర్తు చేసుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవని చెప్పారు. అప్పట్లో ప్రతి చిన్న విషయానికి జడ్జ్ చేసే సోషల్ మీడియా పిచ్చి లేదని అన్నారు.

"మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ సోషల్ మీడియా తలనొప్పులు లేవు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తే ఎలా తయారవ్వాలనే ఒత్తిడి అస్సలు ఉండేది కాదు. ప్రయాణాల్లో హాయిగా, మనకు నచ్చిన దుస్తుల్లో కంఫర్టబుల్‌గా వెళ్లేవాళ్లం. సుదీర్ఘ విమాన ప్రయాణాల్లోనూ మేకప్ వేసుకుని తిరగడం అంత తేలికైన విషయం కాదు. అదృష్టవశాత్తూ నా కెరీర్ మొదట్లో ఇలాంటి పిచ్చి పద్ధతులు లేవు" అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.

దర్శకుల ఒత్తిడి ఉన్నా.. ఇంత క్రూరత్వం లేదు

పాత రోజుల్లోనూ విమర్శలు ఉండేవని, కాకపోతే అవి కేవలం సినిమా మేకర్ల వరకే పరిమితమయ్యేవని కాజల్ స్పష్టం చేశారు. కొన్ని సినిమాల కోసం లావు అవ్వాలని, మరికొన్నింటి కోసం బరువు తగ్గాలని దర్శకులు అడిగేవారని గుర్తు చేసుకున్నారు. అయితే, అప్పటి విమర్శల్లో ఒక హద్దు ఉండేదని, ఇప్పటిలా సామాజిక మాధ్యమాల్లో జరిపే పర్సనల్ టార్గెట్, క్రూరత్వం అప్పట్లో లేవని తేల్చి చెప్పారు.

ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ హీరోయిన్లను చూస్తుంటే జాలేస్తోందని, వీరంతా ఈ నరకాన్ని ఎలా తట్టుకుంటున్నారోనని సానుభూతి ప్రకటించారు. వారు మానసికంగా బలంగా నిలబడాలని కాజల్ ఆకాంక్షించారు.

'నో' చెప్పడం అలవాటు చేసుకోవాలి

సినిమా ఆఫర్ల కోసం తానెప్పుడూ తన ఆత్మగౌరవాన్ని, సౌకర్యాన్ని పణంగా పెట్టలేదని కాజల్ స్పష్టం చేశారు. నచ్చని విషయాలకు నిర్మొహమాటంగా 'నో' చెప్పే ధైర్యం ఉండాలని యువ నటీమణులకు సూచించారు. ఏదైనా ప్రాజెక్ట్ కుదిరితే ఓకే, లేదంటే మరో పని చూసుకోవాలనే స్పష్టత తనకు మొదటి నుంచీ ఉందని వివరించారు. అవకాశాల కోసం ప్రతి దానికి తలూపాల్సిన అవసరం లేదని హితవు పలికారు.

త్వరలో 'ది ఇండియా స్టోరీ'తో రచ్చ

కాజల్ ప్రస్తుతం తను నటించిన 'ది ఇండియా స్టోరీ' సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. చేతన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రేయస్ తల్పాడే కీలక పాత్ర పోషించారు.

పురుగుమందుల వాడకం వల్ల వ్యవసాయ రంగం, సమాజం ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది, దాని వెనుక ఉన్న మాఫియాపై హీరో హీరోయిన్లు ఎలా పోరాడారనే సామాజికాంశంతో ఈ సినిమా రూపుదిట్టుకుంది. స్వాతి వినాయక్, అనితా జాదవ్ తో పాటు పలువురు నిర్మాతలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో సందడి చేయనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More