Kamal Haasan CEC Letter: ఓటు చోరీ వివాదం.. రాహుల్ ధర్నా.. సీఈసీకి కమల్ హాసన్ కీలక లేఖ!

Kamal Haasan Letter To CEC Over Vote Chori Protest: ఓటర్ల జాబితాల సవరణలో 'ఓటు చోరీ' జరుగుతోందంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై 'ఇండియా' కూటమి విరుచుకుపడింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయగా.. ఎంపీ కమల్ హాసన్ సీఈసీకి బహిరంగ లేఖ రాశారు. అందులో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 8, 2026, 12:05:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Kamal Haasan Letter To CEC Over Vote Chori Protest: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుపై ప్రతిపక్ష 'ఇండియా' కూటమి యుద్ధం ప్రకటించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, 'ఓటు చోరీ'కి పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష ఎంపీలు దిల్లీలోని అశోకా రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు.

ఓటు చోరీ వివాదం.. రాహుల్ ధర్నా.. సీఈసీకి కమల్ హాసన్ కీలక లేఖ!
ఓటు చోరీ వివాదం.. రాహుల్ ధర్నా.. సీఈసీకి కమల్ హాసన్ కీలక లేఖ!

ఓటర్ల హక్కు కాలరాస్తున్నారంటూ

ఓటర్ల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్రిక్తతల నడుమ మక్కల్ నీది మయ్యమ్ అధినేత, ఎంపీ, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఆసక్తికర లేఖ రాశారు.

ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతోందని

రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతోందని, పార్లమెంట్‌లోని సంవిధాన్ భవన్‌లో ప్రతిపక్ష ఎంపీలతో సీఈసీ సమావేశమై వారి సందేహాలను నివృత్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

వేలాది మంది ఓటర్ల పేరు గల్లంతయ్యే ప్రమాదం

"ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనది. ఆ హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘంపై ఈ మధ్య కాలంలో ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి" అని కమల్ హాసన్ తమ లేఖలో స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో హడావుడిగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అర్హులైన వేలాది మంది ఓటర్ల పేరు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కథలు కాదు, చర్చలు ముఖ్యం: సీఈసీకి కమల్ విజ్ఞప్తి

ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమో తాను ఈ లేఖ రాయడం లేదని, దేశ ప్రయోజనాలను కాపాడటమే తన ఉద్దేశమని కమల్ హాసన్ తెలిపారు. "మూసివేసిన తలుపుల వెనుక వాదనలు చేసుకోవడం కంటే, తెరిచిన తలుపులతో చర్చలకు ఆహ్వానించడమే ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం చేకూరుస్తుంది" అని కమల్ హాసన్ హితవు పలికారు. ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడేందుకు సీఈసీ వెంటనే స్పందించి, ప్రతిపక్ష నేతల భేటీకి అవకాశం ఇవ్వాలని కోరారు.

సీఈసీ రాజీనామా చేసేవరకు పోరాటం: రాహుల్ గాంధీ హెచ్చరిక

మరోవైపు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు రోడ్లపైకి వచ్చి పోరాడేందుకు, అరెస్టులయ్యేందుకు సైతం వెనుకాడబోవని ప్రకటించారు.

మా ఆందోళను ఆపేది లేదు

"జ్ఞానేష్ కుమార్ సీఈసీ పదవికి రాజీనామా చేసేవరకు మా ఆందోళనలు ఆపేది లేదు. దేశంలో అత్యంత పవిత్రమైన ఓటు హక్కును కాపాడుకునేందుకు ఇది మేము చేస్తున్న ధర్మపోరాటం. నరేంద్ర మోదీ, అమిత్ షా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు" అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

మరింత పారదర్శకంగా

ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా మార్చడానికే సవరణలు చేస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ, ఈ ప్రక్రియ ఆధారంగా ప్రతిపక్షాల మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారన్నది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ. రానున్న ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ ముసురుకున్న ఈ వివాదం జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More