Kamal Haasan To Trump: మీ పని మీరు చూసుకోండి, విదేశాల ఆదేశాలు పాటించే రోజులు పోయాయి- ట్రంప్‌కు కమల్ హాసన్ బహిరంగ లేఖ!
Kamal Haasan Open Letter To Donald Trump: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై అమెరికా ఇచ్చిన 30 రోజుల గడువుపై యూనివర్సల్ స్టార్, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. భారత్ ఒక స్వతంత్ర దేశమని, విదేశీ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని ట్రంప్‌కు బహిరంగ లేఖ రాశారు కమల్ హాసన్.
ప్రపంచ వ్యాప్తంగా రగులుతున్న యుద్ధ జ్వాలల మధ్య అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారతీయ రిఫైనరీలకు అమెరికా కేవలం 30 రోజుల పాటు మాత్రమే 'తాత్కాలిక' మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.

మక్కల్ నీది మయ్యమ్ అధినేత
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును ఎండగడుతూ యూనివర్సల్ స్టార్ (లోక నాయకుడు), మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ఒక బహిరంగ లేఖ రాశారు.
కమల్ హాసన్ కామెంట్స్
శనివారం (మార్చి 7) సాయంత్రం తన సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశించి కమల్ హాసన్ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో కమల్ హాసన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆదేశాలు పాటించే రోజులు పోయాయి
"గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు.. భారతీయులమైన మేము ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశానికి చెందిన వారం. సుదూర తీరాల (విదేశాల) నుంచి వచ్చే ఆదేశాలను పాటించే రోజులు ఎప్పుడో పోయాయి. దయచేసి మీ పని మీరు చూసుకోండి" అని కమల్ హాసన్ రాసుకొచ్చారు.
"రెండు సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవం ఉన్నప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది. మీ దేశానికి, ప్రజలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ కమల్ హాసన్ అత్యంత కటువుగా స్పందించారు. ఒక గర్వించదగ్గ భారత పౌరుడిగా ఈ లేఖ రాస్తున్నట్లు కమల్ హాసన్ పేర్కొన్నారు.
అసలు వివాదం ఏమిటి?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియా మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు జరిగే 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూతపడటంతో ముడి చమురు కొరత ఏర్పడింది.
ఈ తరుణంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పందిస్తూ.. రష్యా నుంచి భారత్ చమురు కొనడానికి 30 రోజుల తాత్కాలిక గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా భారత్ ఇకపై రష్యాను వదిలి అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భారత్ వైఖరిపై సందిగ్ధత
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని అమెరికా చెబుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా మాత్రం భారత్ తమతో వ్యాపారాన్ని తగ్గించుకుంటుందన్న వార్తలను కొట్టిపారేసింది.
హాట్ టాపిక్‌గా కమల్ లేఖ
"రష్యా నుంచి చమురు కొనడం వల్ల రెండు దేశాలకూ లాభమే. పైగా ఇది అంతర్జాతీయ ఇంధన మార్కెట్ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది" అని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో అమెరికా పెత్తనాన్ని ప్రశ్నిస్తూ కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


