2026 fifa world cup draw : ఫిఫా శాంతి పురస్కారం అందుకున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫిఫా తొలిసారిగా అందిస్తున్న శాంతి పురస్కారం ఆయనకు దక్కింది. ఈ మేరకు 2026 ఫిఫా వరల్డ్ కప్ డ్రా ఈవెంట్లో ట్రంప్‌కి పురస్కారాన్ని అందించారు.
తొలిసారిగా ప్రవేశపెట్టిన ఫిఫా 'శాంతి పురస్కారం' అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దక్కింది. వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో శుక్రవారం (డిసెంబర్ 5) జరిగిన 2026 ఫిఫా ప్రపంచకప్ డ్రా కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో ఈ వేడుకలో ట్రంప్‌కు ఈ బహుమతిని అందజేశారు. "ఇది మీ పురస్కారం, ఇది మీ శాంతి పురస్కారం," అని ఇన్‌ఫాంటినో ట్రంప్ చేసిన "శాంతి కోసం అసాధారణ చర్యలను" ప్రశంసించారు.
ఈ కొత్త అవార్డుతో “ప్రజలను ఏకం చేసే”, “ప్రపంచ శాంతిని పెంపొందించే” వ్యక్తులను సన్మానిస్తామని ఫిఫా తెలిపింది.
ఈ నేపథ్యంలో ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం దక్కాలని ఇన్‌ఫాంటినో బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఈ అవార్డుకు అమెరికా అధ్యక్షుడు "తప్పకుండా అర్హులు" అని ఆయన అన్నారు.
‘నా జీవితంలోని గొప్ప గౌరవాల్లో ఇది ఒకటి’
2026 ఫిఫా వరల్డ్ కప్ డ్రా సందర్భంగా తాను అందుకున్న ఫిఫా శాంతి పురస్కారం.. తన ప్రపంచ శాంతి ప్రయత్నాలను ధృవీకరించిందని ట్రంప్ అన్నారు.
"ఇది నిజంగా నా జీవితంలో పొందిన గొప్ప గౌరవాల్లో ఒకటి," అని ఆయన అన్నారు. "అవార్డుల సంగతి పక్కన పెడితే.. మేము లక్షల, కోట్లాది మంది ప్రాణాలను కాపాడాము. అనేక యుద్ధాలను ముగించగలిగాము, కొన్ని సందర్భాల్లో అవి ప్రారంభం కావడానికి ముందే నిలిపాము," అని తెలిపారు.
అంతేకాక, "నా కుటుంబాన్ని, నా గొప్ప ఫస్ట్ లేడీ (ట్రంప్ భార్య) మెలానియాను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను," అని ఆయన అన్నారు.
ట్రంప్ శాంతి పురస్కార ప్రయత్నాలకు ఇది ఊతం!
ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం గెలవకపోయినా, దాని కోసం ట్రంప్ నిరంతరం కృషి చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ ఫిఫా పురస్కారం లభించడం వార్తల్లో నిలిచింది.
ఫిఫా చారిత్రక నేపథ్యాన్ని చూస్తే, అది క్రీడలపైనే దృష్టి పెడుతుంది!అలాంటిది తొలిసారిగా భౌగోళిక రాజకీయాల అంశంలో జోక్యం చేసుకుంటూ ఈ అవార్డును ఇవ్వడం ఒక ముఖ్యమైన మార్పుగా పరిగణించాలి.
ఆతిథ్య దేశాల నాయకులు వేదికపై..
2026 ఫిఫా ప్రపంచకప్‌కు యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. శుక్రవారం జరిగిన డ్రా కార్యక్రమంలో ట్రంప్, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షైన్‌బామ్ వేదికపై పాల్గొన్నారు. ఆ ముగ్గురు నాయకులు వారి వారి దేశాల పేర్లను డ్రా బాక్సుల నుంచి స్వయంగా తీశారు.
2026 ఫిఫా వరల్డ్ కప్ డ్రా: పూర్తి గ్రూపుల జాబితా..
2026 ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్ జూన్ 11న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశమైన మెక్సికో, దక్షిణాఫ్రికాతో మెక్సికో నగరంలోని అజ్టెకా స్టేడియంలో తలపడుతుంది.
మొత్తం 48 జట్లను ఒక్కో గ్రూప్‌లో నాలుగు చొప్పున 12 గ్రూపులుగా విభజించారు. యూఈఎఫ్ఏ మినహా, ఒకే కాన్ఫెడరేషన్‌కు చెందిన రెండు జట్లను ఒకే గ్రూప్‌లో ఉంచలేదు.
గత ప్రపంచకప్ విజేత మెస్సీకి చెందిన అర్జెంటీనాను అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్‌తో పాటు గ్రూప్ ‘జే’లో ఉంచారు.
ఖతార్‌లో జరిగిన మునుపటి ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్‌ని సెనెగల్, నార్వే, ఫిఫా ప్లేఆఫ్ 2 విజేతతో పాటు గ్రూప్ 'ఐ'లో చేర్చారు.
ఐదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ తమ క్యాంపైన్ని మొరాకోతో గ్రూప్ 'సీ'లో ప్రారంభిస్తుంది. ఈ గ్రూప్‌లో హైతీ, స్కాట్లాండ్ కూడా ఉన్నాయి.
2010 ఛాంపియన్స్ అయిన స్పెయిన్‌ని ఉరుగ్వే, సౌదీ అరేబియా, కొత్తగా అరంగేట్రం చేస్తున్న కేప్ వెర్డ్‌తో పాటు గ్రూప్ 'హెచ్'లో కఠినమైన గ్రూప్‌లో ఉంచారు.
గ్రూప్ ఆఫ్ డెత్‌గా గ్రూప్ ‘ఎల్’ని పరిగణించవచ్చు. ఇందులో ఇంగ్లండ్, క్రొయేషియా, ఘనా, పనామా ఉన్నాయి.
బెల్జియం కూడా ఈజిప్ట్, ఇరాన్, న్యూజిలాండ్‌తో పాటు కఠినమైన గ్రూప్ ‘జీ’లో ఉంది.
ఇక, క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్‌తో పాటు కొత్తగా ప్రవేశిస్తున్న ఉజ్బెకిస్తాన్, కొలంబియా, కాంగో, న్యూ కాలెడోనియా, జమైకా మధ్య జరిగే ప్లే-ఆఫ్ విజేతతో పాటు గ్రూప్ 'కే'లో తలపడుతుంది.
ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అతి చిన్న దేశం అయిన కురాకో నాలుగుసార్లు ఛాంపియన్ అయిన జర్మనీతో గ్రూప్ 'ఈ'లో తమ క్యాంపైన్ని ప్రారంభిస్తుంది. ఈ గ్రూప్‌లో ఈక్వెడార్, ఐవరీ కోస్ట్ కూడా ఉన్నాయి.
మరో ఆతిథ్య దేశం యూఎస్ఏ పరాగ్వేతో తమ పిఫా వరల్డ్ కప్‌ని ప్రారంభిస్తుంది. గ్రూప్ డీలో వీరు ఆస్ట్రేలియా, యూఈఎఫ్ఏ ప్లే-ఆఫ్ సీ విజేతను కూడా ఎదుర్కొంటారు.
మూడో ఆతిథ్య దేశం అయిన కెనడా గ్రూప్ బీలో యూఈఎఫ్ఏ ప్లే-ఆఫ్ ఏ విజేత, ఖతార్, స్విట్జర్లాండ్‌తో తలపడుతుంది. గ్రూప్ ఏలో మెక్సికో, సౌతాఫ్రికా, కొరియ, ప్లే ఆఫ్ డీ జట్టు పోటీపడనున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


