Kareena Kapoor: డిగ్రీ చదవలేకపోయాననే వెలితి వెంటాడుతుంటుంది, అందుకే ఆ బాధ్యతలు తీసుకున్నా.. కరీనా కపూర్ కామెంట్స్

Kareena Kapoor Regrets To Leaving Studies: సినిమాల కోసం 11వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ వెల్లడించారు. తన పిల్లలు తైమూర్, జెహ్‌లు మాత్రం కచ్చితంగా చదువు పూర్తి చేసిన తర్వాతే తమకిష్టమైన రంగాన్ని ఎంచుకోవాలని ఆమె చెప్పారు.

Published on: Sep 3, 2026, 12:25:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kareena Kapoor Regrets To Leaving Studies: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించి స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా వెండితెరపై అగ్ర నాయికగా రాణిస్తున్న ఆమె మనసులో ఒక తీరని లోటు ఉండిపోయిందట.

డిగ్రీ చదవలేకపోయాననే వెలితి వెంటాడుతుంటుంది, అందుకే ఆ బాధ్యతలు తీసుకున్నా.. కరీనా కపూర్ కామెంట్స్
డిగ్రీ చదవలేకపోయాననే వెలితి వెంటాడుతుంటుంది, అందుకే ఆ బాధ్యతలు తీసుకున్నా.. కరీనా కపూర్ కామెంట్స్

టీనేజ్‌లోనే సినిమాల్లోకి రావడంతో

టీనేజ్‌లోనే సినిమాల్లోకి రావడంతో చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని, ఆ నిర్ణయం వల్ల తనకు కలిగిన ఆవేదనను కరీనా కపూర్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మనసు విప్పి పంచుకున్నారు. హనుమాన్ దాస్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కరీనా కపూర్ తన విద్యార్హతపై ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఆ నిర్ణయంపై ఇప్పటికీ పశ్చాత్తాపమే!

"నేను 11వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పాను. ఆ తర్వాత సినిమాల్లోకి రావడంతో ఉన్నత చదువులు చదవలేకపోయాను. చాలామంది దీనిపై జోకులు వేయవచ్చు లేదా ఏమైనా అనుకోవచ్చు. కానీ ఆ సమయంలో నటిగా నన్ను నేను నిరూపించుకోవాలనే బలమైన కోరికతో నా మనసు మాట విన్నాను" అని కరీనా కపూర్ పేర్కొన్నారు.

పిల్లలకు స్పష్టమైన సందేశం.. యూనిసెఫ్‌తో బంధం!

అయితే నటిగా స్థిరపడినప్పటికీ, డిగ్రీ పూర్తి చేయలేకపోయాననే వెలితి తనలో ఎప్పుడూ ఉండిపోయిందని కరీనా కపూర్ పశ్చాత్తాపం చెందారు. ఈ చదువు లోటే తన పిల్లల పెంపకంలో కీలక మార్గదర్శకంగా మారిందని కరీనా తెలిపారు. తన కుమారులు తైమూర్, జెహ్‌లు ముందుగా తమ విద్యను పూర్తిగా పూర్తి చేయాలని, ఆ తర్వాతే సొంత నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అందుకే కోరిన వెంటనే ఒప్పుకున్నా

"చదువు పూర్తి చేయలేకపోయాననే బాధ నాలో ఎప్పుడూ ఉండేది. అందుకే భారత్‌లో బాలికల విద్య కోసం కృషి చేయాలని యూనిసెఫ్ నన్ను కోరినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను" అని కరీనా కపూర్ వివరించారు.

యూనిసెఫ్ ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా

2014 నుంచి కరీనా కపూర్ యూనిసెఫ్ ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాలికల విద్య, లింగ సమానత్వం, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో ఆమె క్రమం తప్పకుండా ప్రచారం చేస్తున్నారు.

'రెఫ్యూజీ' నుంచి 'దాయిరా' వరకు సుదీర్ఘ ప్రయాణం

2000 జూన్ 30న జేపీ దత్తా దర్శకత్వంలో వచ్చిన 'రెఫ్యూజీ' చిత్రంతో కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి తెరంగేట్రం చేశారు. అప్పటికి కరీనా వయస్సు కేవలం 19 ఏళ్లు. కపూర్, బచ్చన్ కుటుంబాల వారసులుగా సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన వీరిద్దరూ, ఆ తర్వాత తమ సొంత ప్రతిభతో బాలీవుడ్‌లో తిరుగులేని నటులుగా ఎదిగారు.

విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్

ప్రస్తుతం కరీనా మేఘనా గుల్జార్ దర్శకత్వంలో 'దాయిరా' అనే విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో డీసీపీ అజూని కోహ్లీ పాత్రలో కరీనా, డీసీపీ రామన్‌ కుమార్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తారు.

ఒక్క పాట లేకుండా మూవీ

యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎలాంటి పాటలు ఉండవని ప్రముఖ రచయిత గుల్జార్ ధృవీకరించారు. జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న దాయిరా చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More