Kerala Story 2: కాంట్రవర్సీ మూవీకి షాక్- దారుణంగా కేరళ స్టోరీ 2 కలెక్షన్లు- 4 షోలకు 68 టికెట్లే-పోస్టర్లు చించేసి ఆందోళన
Kerala Story 2: థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే తీవ్ర వివాదాస్పదంగా మారిన కేరళ స్టోరీ 2 మూవీకి షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఓపెనింగ్ డే రోజు వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ఓ థియేటర్లో 4 షోలకు కలిపి కేవలం 68 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. కేరళలోని థియేటర్ల ముందు నిరసనకారులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ట్రైలర్ తోనే వివాదానికి ఆజ్యం పోసి, కోర్టు క్లియరెన్స్ తో థియేటర్లలోకి వచ్చిన కేరళ స్టోరీ 2 సినిమాకు షాకింగ్ ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రాన్ని చూసేవాళ్లే కరవయ్యారు. మరోవైపు కేరళలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ఆందోళనలు జరుగుతున్నాయి.

కేరళ స్టోరీ 2 మూవీ
కామఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదలైంది. దీనికి విపుల్ అమృత్ లాల్ షా ప్రొడ్యూసర్. ఈ సినిమాకు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీని జనాలు పట్టించుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కేరళ స్టోరీ 2 కలెక్షన్లు
కేరళ స్టోరీ 2 సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ డే రూ.3.5 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.60 కోట్లు వసూలు చేయాలి. 2023లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'ది కేరళ స్టోరీ'కి సీక్వెల్ గా కేరళ స్టోరీ 2 వచ్చింది. కేరళ స్టోరీ మూవీ రిలీజ్ అప్పుడు ఫస్ట్ డే రూ.8.03 కోట్ల వసూళ్లు సాధించింది.
ఆక్యుపెన్సీ అంతంతమాత్రమే
కేరళ స్టోరీ 2 సినిమా ఆక్యుపెన్సీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. దేశ వ్యాప్తంగా చాలా థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో 473 షోలలో 14% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. ముంబైలో 538 షోలతో 8.75% గా ఆక్యుపెన్సీ ఉంది. పూణె 11.25%, హైదరాబాద్ 11.75%, బెంగళూరు 6.75% ఆక్యుపెన్సీ నమోదు చేశాయి.
4 షోలకు 68 టికెట్లు
బుక్ మై షో డేటా ప్రకారం తిరువనంతపురంలోని లూలూ మాల్‌లోని పీవీఆర్ లో 4 షోలకు కలిపి కేవలం 68 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. మరోవైపు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) కార్యకర్తలు 'ది కేరళ స్టోరీ 2' ప్రదర్శిస్తున్న కేరళలోని థియేటర్ల ముందు నిరసనలు చేపట్టారు.
కేరళ రాష్ట్ర ప్రతిష్ఠను ఈ సినిమా దెబ్బతీస్తుందని వాళ్లు వాదిస్తున్నారు. సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పోస్టర్లు చింపేస్తున్నారు. దీంతో థియేటర్ల ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


