Kiku Chiranjeevi Review: కికు చిరంజీవి మూవీ రివ్యూ- గుండె స్థానం మారితే? ట్విస్టులతో సాగే సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Kiku Chiranjeevi Review And Rating In Telugu: కికూ యనమల, కశిష్ ఖాన్ జంటగా నటించిన తెలుగు సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ కిక చిరంజీవి. అరుదైన గుండె సమస్య నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందో నేటి కికు చిరంజీవి రివ్యూలో చూద్దాం.
Kiku Chiranjeevi Movie Review In Telugu And Rating:

టైటిల్: కికు చిరంజీవి
నటీనటులు: కికు యనమల, కశిష్ ఖాన్, ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా రాఘవ్, రామ్ జగన్, శ్రీరామ్ వెంకట్, రాజీవ్ రవిచంద్ర తదితరులు
దర్శకత్వం: శుభ సాయి వెంకట్
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్: పి. రామకృష్ణ
ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్
నిర్మాత: దీప్తి నడిమింటి
విడుదల తేది: ఆగస్టు 28, 2026
విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వచ్చే చిన్న సినిమాలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆదరణ ఉంటుంది. అరుదైన శారీరక సమస్య 'డెక్స్‌ట్రో కార్డియా' (గుండె కుడివైపు ఉండటం) నేపథ్యంతో రూపుదిద్దుకున్న సినిమా 'కికు చిరంజీవి'.
అయితే, ఈ సినిమాకు ముందు చిరంజీవిగా టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ, కొన్ని అభ్యంతరాలు రావడంతో కికు చిరంజీవిగా టైటిల్ మార్చారు. కికు యనమల, కశిష్ ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. అరుదైన సబ్జెక్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఇవాళ (ఆగస్టు 28) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి కికు చిరంజీవి రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
చిరంజీవి (కికు యానమల) అనాథ అయిన ఒక ఫోటోగ్రాఫర్. అతనికి గుండె కుడివైపు ఉండే అరుదైన సమస్య ఉంటుంది. మరోవైపు మను (కశిష్ ఖాన్) కూడా అనాథే. పిల్లలు వద్దనుకునే వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని మను తనను పెంచిన తండ్రికి కండిషన్ పెడుతుంది. కానీ, ఒకతను అందుకు ఒప్పుకుంటాడు. అతన్ని కలిసేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి మను టూర్ వెళ్తుంది. ఆ టూర్‌ను కవర్ చేయడానికి చిరంజీవి కూడా బస్సు ఎక్కుతాడు.
అనుకోని విధంగా మనును పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ప్రమాదంలో చనిపోతాడు. ఆ తర్వాత అందరూ ఒక అడవిలోకి వెళ్లడం, అక్కడ కొందరు దుండగులు వీరిని వెంటాడటంతో కథ మలుపు తిరుగుతుంది. పరుగుల వేటలో ఆక్సిజన్ అందక చిరంజీవి నీలంగా మారిపోతాడు. ఆ సమయంలోనే అతనికి గుండె కుడివైపు ఉందనే విషయం బయటపడుతుంది.
ఆ తర్వాత ఏమైంది? ఆ దుండగుల నుంచి చిరంజీవి బయటపడ్డాడా? అతన్ని కాపాడింది ఎవరు? మనును పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ తర్వాత చిరంజీవిలో వచ్చిన మార్పు ఏంటీ? చిరంజీవి గుండె స్థానం ఎలా మారింది? వంటి ఇంట్రెస్టింగ్ ట్విస్టులు తెలియాలంటే? కికు చిరంజీవిని చూడాల్సిందే.
విశ్లేషణ:
గుండె కుడివైపు ఉండటం అనే అంశంపై గతంలో కొద్ది సినిమాలు వచ్చినా, ఈ చిత్రంలో దర్శకుడు దానికి ఒక ఊహించని థ్రిల్లింగ్ ట్విస్ట్ జోడించే ప్రయత్నం చేశారు. చిరంజీవి అంటే మరణం లేనివారు, చచ్చిబతికిన వారిని పిలుస్తుంటారు. ఇందులో రెండో యాంగిల్ చూపించారు. సినిమాలో హీరోని చంపాలని విలన్లు కాలుస్తారు. కానీ అతను చనిపోడు. అది ఎలా జరిగిందనేది పెద్ద ట్విస్ట్. ఇందులో అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఫస్టాఫ్ పాత్రల పరిచయం, టూర్ సన్నివేశాలతో కొంత నెమ్మదిగా సాగుతుంది. కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువై సీరియల్ వాతావరణం కనిపిస్తుంది. అయితే బీచ్ దాడి సన్నివేశం, ఇంటర్వెల్ ముందు వచ్చే గుండె స్థానం మారే సీన్ సినిమాను సరికొత్త జోనర్‌లోకి తీసుకెళ్తాయి.
మాస్క్ మ్యాన్ మిస్టరీ
శోభనం పూర్తయ్యాక హీరోలో కనిపించే సైకో తరహా మార్పులు, సెకండాఫ్‌లోని సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తాయి. తనికళ్ల భరణి పాత్ర వెనుక ఉన్న అసలు నిజాలు, మాస్క్ మ్యాన్ మిస్టరీని ఒక్కొక్కటిగా విప్పుతూ కథను ముందుకు నడిపిన తీరు బాగుంది. క్లైమాక్స్ చాలా భావోద్వేగంగా ముగుస్తుంది.
రామకృష్ణ సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్‌గా ఉంది. విజువల్స్ చాలా బాగా చూపించారు. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం థ్రిల్లర్ సన్నివేశాలకు సరైన బలాన్నిచ్చింది. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ మొదటి భాగంలో ఇంకాస్త పదునుగా ఉంటే బాగుండేది. దీప్తి నడిమింటి నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
రెండు భిన్నమైన షేడ్స్‌లో
హీరోగా కికు యనమలకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ, రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా రాణించారు. కామెడీ, సీరియస్ సన్నివేశాల్లోనే కాకుండా ట్విస్ట్ రివీల్ అయ్యే సీన్‌లో ఆయన నటన అలరిస్తుంది. కశిష్ ఖాన్ తన పరిధి మేర నటించినా కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెషన్స్ కొద్దిగా అతిగా అనిపిస్తాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే?
ఈశ్వరీరావు, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, తనికళ్ల భరణి తమ అనుభవంతో పాత్రలకు న్యాయం చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా సాగినా, సెకండాఫ్‌లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం కికు చిరంజీవి సినిమాను కచ్చితంగా చూడొచ్చు.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


