...
...
Next Story

Kotha Malupu Review: కొత్త మలుపు రివ్యూ- కోనసీమ అందాలతో స్వచ్ఛమైన ప్రేమకథ- సింగర్ సునీత కొడుకు ఆకాష్ హిట్ కొట్టాడా?

Kotha Malupu Movie Review And Rating In Telugu: ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన కొత్త మలుపు సినిమా ఇవాళ (జూన్ 12) థియేటర్లలోకి వచ్చింది. కోనసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో నేటి కొత్త మలుపు రివ్యూలో చూద్దాం.

Published on: Jun 12, 2026, 22:40:26 IST
Advertisement

Kotha Malupu Movie Review In Telugu And Rating: టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత కుమారుడిగా ఆకాష్ గోపరాజు ఇప్పటికే వెండితెరకు పరిచయమయ్యారు. తాజాగా ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన రెండో చిత్రం 'కొత్త మలుపు'. తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించారు.

స్వచ్ఛమైన ప్రేమకథాంశంతో

కొత్త మలుపు రివ్యూ- కోనసీమ అందాలతో స్వచ్ఛమైన ప్రేమకథ- సింగర్ సునీత కొడుకు ఆకాష్ హిట్ కొట్టాడా?
కొత్త మలుపు రివ్యూ- కోనసీమ అందాలతో స్వచ్ఛమైన ప్రేమకథ- సింగర్ సునీత కొడుకు ఆకాష్ హిట్ కొట్టాడా?

కోనసీమ పల్లెటూరి వాతావరణం, స్వచ్ఛమైన ప్రేమకథాంశంతో తెరకెక్కిన కొత్త మలుపు సినిమా టీజర్లు, సాంగ్స్‌తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. తాజాగా ఇవాళ (జూన్ 12) కొత్త మలుపు సినిమా థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆకాష్ గోపరాజు హిట్ అందుకున్నాడా? వంటి విషయాలను నేటి కొత్త మలుపు రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్: కొత్త మలుపు

నటీనటులు: ఆకాష్ గోపరాజు, భైరవి ఆరాధ్య, రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి, సిద్ధు, మహేందర్, ఐశ్వర్య తదితరులు

దర్శకత్వం: శివ కేశనకుర్తి

సంగీతం: యశ్వంత్ నాగ్

సినిమాటోగ్రఫీ: సుమంత్ కచర్ల

నిర్మాత: తాటి బాలకృష్ణ

బ్యానర్: తథాస్తు క్రియేషన్స్

విడుదల తేది: జూన్ 12, 2026

కథ:

హైదరాబాద్‌లో స్నేహితులతో జులాయిగా తిరిగే కమల్ (ఆకాష్) జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక కుటుంబ వివాహ వేడుక కోసం కమల్ తన ఫ్యామిలీతో కలిసి తూర్పు గోదావరి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆరాధ్య) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అయితే, ఒక రాత్రి అనుకోని అవమానకర పరిస్థితిలో ఇరుక్కున్న కమల్‌ను ముఖం తెలియని ఒక అమ్మాయి కాపాడుతుంది. తనను ఆదుకున్న ఆ అపరిచిత యువతి కోసం కమల్ అన్వేషణ మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో వరలక్ష్మి అతనికి సహాయం చేస్తుంది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

కొత్త మలుపు సినిమా రూరర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం. దర్శకుడు శివ కేశనకుర్తి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా, దాన్ని కోనసీమ సంస్కృతి, పెళ్లి సందడితో ముడిపెట్టి తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమా మొదటి భాగం మొత్తం చాలా ఫ్రెష్‌గా సాగిపోతుంది.

కమల్ విలేజ్‌కు వెళ్లడం, అక్కడ పెళ్లి సందడి, వరలక్ష్మిని ఇష్టపడం, గుర్తు తెలియని అమ్మాయి కమల్‌ను కాపాడటం, ఆమెకోసం వెతుకులాడటం వంటి సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా సాగిపోతుంటాయి. ఈ క్రమంలో వచ్చే కామెడీ ట్రాక్ బాగుంటుంది.

గోదావరి జిల్లాలకే ప్రత్యేకమైన శైలీ హాస్యాన్ని రఘుబాబు, పృథ్వీ తమ డైలాగ్ టైమింగ్‌తో అద్భుతంగా పండించారు. వీరిద్దరి కామెడీ ట్రాక్ థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. పల్లెటూరి వాతావరణం, హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్ సీన్లు ప్రేక్షకుడికి ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తాయి.

యూత్‌కు కనెక్ట్ అయ్యే సందేశం

సినిమా ద్వితీయార్థంలో కథ కాస్త సీరియస్ ట్రాన్స్‌లోకి వెళ్తుంది. ప్రేమలో నమ్మకం ఎంత ముఖ్యం, భాగస్వామి గతాన్ని చూసి వర్తమానాన్ని ఎలా జడ్జ్ చేయకూడదు అనే పాయింట్‌ను దర్శకుడు చాలా హృద్యంగా ఆవిష్కరించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు, ఇచ్చే సందేశం నేటి తరం యువతకు కచ్చితంగా కనెక్ట్ అవుతాయి.

"ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. కానీ, జీవితంలోకి వచ్చిన వ్యక్తి వర్తమానాన్ని గౌరవించడం ముఖ్యం" అని వంటి డైలాగ్స్ క్లైమాక్స్‌లో చక్కగా పండాయి. అయితే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపించడం, డ్రామా కాస్త ఊహకందడం కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు.

ఇక సుమంత్ , కచర్ల కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. గోదావరి పచ్చదనాన్ని, అందాలను రిచ్‌గా, హాయిగొలిపేలా చూపించారు. యశ్వంత్ నాగ్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. తథాస్తు క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమాకు తగినట్లుగా ఉన్నాయి.

ఆకాష్ ఈజ్.. భైరవి నేచురల్ యాక్టింగ్

హీరోగా ఆకాష్ గోపరాజు తన రెండో సినిమాకు చాలా మెరుగయ్యాడని చెప్పుకోవచ్చు. కమల్ పాత్రలో ఎంతో ఈజ్‌తో నటించాడు. మొదటి భాగంలో అల్లరి కుర్రాడిగా, సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్లలో మంచి నటనతో అలరించాడు. హీరోయిన్ భైరవి ఆరాధ్య ఈ సినిమాకు పెద్ద అసెట్.

వరలక్ష్మి పాత్రలో పల్లెటూరి అమ్మాయికి ఉండాల్సిన అమాయకత్వాన్ని, క్లైమాక్స్‌లో బాధను చాలా సహజంగా పలికించింది. గోపి పాత్రలో సిద్ధు కథను మలుపు తిప్పే పాత్రలో మెప్పించాడు. మిగతా పాత్రలు పరిధి మేర మెప్పించారు.

ప్లస్ పాయింట్స్:

గోదావరి ప్రాంతం, కోనసీమ అందాలు, విజువల్స్

ఆకాష్ – భైరవి మధ్య కెమిస్ట్రీ

రఘుబాబు, పృథ్వీ కామెడీ

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం

క్లైమాక్స్ సందేశం

మైనస్ పాయింట్స్:

రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి

అపార్థాల చుట్టూ తిరిగే డ్రామా కొంతవరకు ఊహించేలా ఉంటుంది

ఫ్యామిలీతో కలిసి చూసేలా

ఫైనల్‌గా చెప్పాలంటే.. 'కొత్త మలుపు' అనేది ఎలాంటి అశ్లీలత లేని ఒక స్వచ్ఛమైన, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి థియేటర్లలో హాయిగా ఓసారి చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe