...
...
Next Story

Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే ఆరోగ్య పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

Asha Bhosle: వేల పాటలతో అభిమానుల మనసులు దోచుకున్న లెజండరీ సింగర్ ఆశా భోస్లే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆమెకు చికిత్స కొనసాగుతోందని మనవరాలు జానై భోస్లే పేర్కొంది. ప్రస్తుతం 92 ఏళ్ల ఆశా భోంస్లే పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Published on: Apr 12, 2026, 06:58:52 IST
Advertisement

Asha Bhosle: భారతీయ సంగీత శిఖరం, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే (92) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోస, గుండె సంబంధిత సమస్యల కారణంగా శనివారం (ఏప్రిల్ 11) సాయంత్రం ఆమెను ముంబైలోని ప్రముఖ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం.

ఐసీయూలో చికిత్స

మనవరాలితో ఆశా భోంస్లే
మనవరాలితో ఆశా భోంస్లే

శనివారం సాయంత్రం ఆశా భోంస్లేకు తీవ్రమైన శ్వాస ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రతను గమనించిన వైద్యులు ఆమెను ఐసీయూ (ICU) కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 92 ఏళ్ల ఆశా భోంస్లే ఆరోగ్యాన్ని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

మనవరాలు జానై భోంస్లే ప్రకటన

ఆశా భోంస్లే ఆసుపత్రిలో చేరిన వార్తను ఆమె మనవరాలు జానై భోంస్లే సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు.

"తీవ్రమైన అలసట, ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా నామ్మమ్మ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. అన్నీ సవ్యంగా జరుగుతాయని, ఆమె త్వరలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాం. ఈ సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరుతున్నాం. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తాం" అని జానై పేర్కొన్నారు.

ఎనిమిది దశాబ్దాల సంగీత ప్రస్థానం

భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఆశా భోంస్లే పేరు ఒక మారుమోగే అధ్యాయం. సుమారు ఎనిమిది దశాబ్దాలకు పైగా ఆమె తన గాత్రంతో కోట్లాది మందిని అలరించారు. 1943లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆశా.. వేల సంఖ్యలో పాటలు పాడారు. కేవలం హిందీలోనే కాకుండా దాదాపు అర డజనుకు పైగా భారతీయ భాషల్లో (తెలుగుతో సహా) ఆమె గొంతు వినిపించింది.

సంగీత ప్రపంచానికి ఆశా భోంస్లే చేసిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషణ్'తో గౌరవించింది. అలాగే భారత చలనచిత్ర రంగంలో అత్యున్నతమైన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డును కూడా ఆమె అందుకున్నారు. రెండుసార్లు జాతీయ అవార్డులు, ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డులు ఆశా భోంస్లేను వరించాయి.

ఆమె సోదరి, దివంగత గానకోకిల లతా మంగేష్కర్ తర్వాత భారతీయ సంగీత సామ్రాజ్యంలో ఆ స్థాయి గౌరవం పొందిన ఏకైక గాయని ఆశా భోంస్లే అనడంలో అతిశయోక్తి లేదు.

ఆశా భోంస్లే ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ సంగీత సరస్వతి త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది ప్రార్థనలు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks