Crime Thriller Web Series: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రియల్ లైఫ్ సైనైడ్ హత్యల బ్యాక్‌డ్రాప్‌లో.. ఏడు భాషల్లో..
Malayalam Crime Thriller Web Series: ఓటీటీలోకి మలయాళం నుంచి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. నిజ జీవితంలో జరిగిన సైనైడ్ హత్యల కేసు బ్యాక్‌డ్రాప్ లో వస్తున్న ఈ సిరీస్ ఏకంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
Malayalam Crime Thriller Web Series: కేరళను ఉలిక్కిపడేలా చేసిన సంచలనాత్మక 'కూడత్తాయి సైనైడ్ హత్యల' (Koodathayi Cyanide Murders) ఆధారంగా రూపొందిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'అనలి' (Anali) స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ఈ సిరీస్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. "ప్రతి చిరునవ్వు వెనుక ఒక అబద్ధం దాగి ఉంటుంది" అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. లీగల్ చిక్కులు క్లియర్
ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అడ్డుకోవాలని కేరళ హైకోర్టులో దాఖలైన లీగల్ పిటిషన్లను న్యాయస్థానం ఇటీవల కొట్టివేసింది. దీంతో 'అనలి' వెబ్ సిరీస్ డిజిటల్ రిలీజ్‌కు ఎదురైన అన్ని ఆటంకాలు తొలగిపోయాయి.
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మలయాళ డైరెక్టర్ మిథున్ మాన్యువల్ థామస్ ఈ ప్రాజెక్ట్‌తో ఓటీటీ స్పేస్‌లోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో 'అంజామ్ పాథిరా' (Anjaam Pathiraa), 'అబ్రహాం ఓజ్లర్' (Abraham Ozler) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన మిథున్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించడంతో పాటు జాన్ మంత్రికల్‌తో కలిసి కథను అందించారు.
14 ఏళ్లలో 6 మర్డర్స్.. షాకింగ్ సైకో థ్రిల్లర్
కేరళలోని కూడత్తాయి గ్రామంలో 2002 నుంచి 2016 మధ్య కాలంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆహారంలో సైనైడ్ కలిపి సొంత కుటుంబ సభ్యులనే మట్టుబెట్టిన జోలీ జోసెఫ్ అనే మహిళ రియల్ లైఫ్ హత్యాకాండ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ కథను రూపుదిద్దారు.
చాలా కట్టుదిట్టమైన వాతావరణంలో, క్రమ శిక్షణగా పెరిగిన ఒక సాధారణ మహిళ మనసులో ఉండే చీకటి కోణాలు, దాగి ఉన్న కోరికలు ఆమెను ఏ స్థాయి ప్రమాదకరమైన నేరస్తురాలిగా మార్చాయనేది ఇందులో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించనున్నారు. లీడ్ రోల్‌లో లియోనా లిషాయ్ 'మరియా' పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ నటి నిఖిలా విమల్, జిబిన్ గోపీనాథ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
తెలుగులోనూ విడుదల.. జియోహాట్‌స్టార్‌లో త్వరలోనే..
మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ ఇలా మొత్తంగా ఏడు భాషల్లో ఈ వెబ్ సిరీస్‌ను ఒకేసారి డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ డార్క్ థ్రిల్లర్ రిలీజ్ డేట్‌ను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.
కుటుంబ కలహాలు, సైనైడ్ మర్డర్స్ నేపథ్యంలో సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా ఓటీటీ లవర్స్‌ను, ముఖ్యంగా రియల్ క్రైమ్ జోనర్ ఇష్టపడే వారిని విశేషంగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


