Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటుడు మహేష్ దుర్మరణం- 1000 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన వాహనం- 8 మంది యువకులు మృతి
Actor Mahesh Pawar Died In Road Accident: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొలాడ్‌పూర్-మహాబలేశ్వర్ రహదారిపై ఉన్న అంబెనాలి ఘాట్ వద్ద ఓ వాహనం నియంత్రణ తప్పి వెయ్యి అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సీరియల్ నటుడు మహేష్ పవార్ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Serial Actor Mahesh Pawar Died In Road Accident: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వీకెండ్ ట్రిప్ కోసం వెళ్లిన ఎనిమిది మంది స్నేహితులు ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవ సమాధయ్యారు. ముంబైకి దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌గఢ్ జిల్లా పరిధిలోని అంబెనాలి ఘాట్ సెక్షన్‌లో ఈ దారుణం జరిగింది.

సీరియల్ నటుడు మహేష్
మృతుల్లో మరాఠీ బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే 'అప్పీ ఆమ్చీ కలెక్టర్' సీరియల్ నటుడు మహేష్ పవార్ (25) కూడా ఉండటంతో పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
అర్ధరాత్రి ప్రయాణం.. మిస్సింగ్ కేసుతో వెలుగులోకి
మృతులంతా 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న యువకులే. వీరంతా సతారా, రత్నగిరి జిల్లాలకు చెందిన స్నేహితులు. ఆదివారం (మే 24) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాపోలిలోని హర్నే నుంచి వీరు ఎస్‌యూవీ వాహనంలో ప్రయాణమయ్యారు. అయితే ఎంత సమయం గడిచినా వారు సతారా చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం నుంచి గాలించడం ప్రారంభించారు.
రంగంలోకి దిగిన పోలీసులు
వారి ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా, చివరి లొకేషన్ పొలాడ్‌పూర్ సమీపంలోని ఒక మొబైల్ టవర్ పరిధిలో చూపించింది.దీంతో అంబెనాలి ఘాట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు, స్థానిక రెస్క్యూ టీమ్‌లు విస్తృతంగా గాలించాయి.
సోమవారం (మే 25) ఉదయం ఘాట్ రోడ్డు పక్కన ఉన్న లోతైన లోయను పరిశీలించగా, ప్రమాదానికి గురైన ఎస్‌యూవీ వాహనం ఛిద్రమై కనిపించింది. కొండపై నుంచి దాదాపు వెయ్యి అడుగుల లోతులోకి వాహనం పడిపోవడంతో లోపల ఉన్నవారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతుల వివరాలు ఇవే..
ఈ ప్రమాదంలో మరణించిన వారిని సతారా నివాసితులైన రితేష్ లోఖండే (22), సుహాస్ లోఖండే (20), ఉత్కర్ష్ షింగ్తే (21), నిఖిల్ షింగ్తే (25), నటుడు మహేష్ పవార్ (25), ఆదిత్య సలుంఖే (21), రాజేష్ కాట్కర్ (35)తో పాటు రత్నగిరికి చెందిన అన్ష్ చాహ్వాన్(19)గా పోలీసులు గుర్తించారు. వీరంతా సరదాగా గడపడానికి వెళ్తూ ఇలా అనంత లోకాలకు తరలిపోవడం వారి కుటుంబాల్లో తీవ్ర గుండెకోతను మిగిల్చింది.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
ఈ ఘోర ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
"ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు వాహనం లోయలో పడిపోయింది. మృతదేహాలను వెలికితీసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం" అని ముఖ్యమంత్రి దేవేద్ర ఫడ్నవీస్ ఒక ప్రకటనలో తెలిపారు.
3 మృతదేహాల స్వాధీనం
లోయ చాలా లోతుగా ఉండటంతో మృతదేహాల వెలికితీత పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రస్తుతం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు, స్థానిక స్వచ్ఛంద సంస్థల సహాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. మహారాష్ట్రలో ఎస్‌యూవీ ప్రమాదం ఎక్కడ జరిగింది?
ముంబైకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌గఢ్ జిల్లా పరిధిలోని పొలాడ్‌పూర్-మహాబలేశ్వర్ రహదారిపై గల అంబెనాలి ఘాట్ సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది.
2. ఈ ప్రమాదంలో మరణించిన మరాఠీ నటుడు ఎవరు?
ప్రముఖ మరాఠీ టెలివిజన్ ధారావాహిక 'అప్పీ ఆమ్చీ కలెక్టర్'లో నటించిన 25 ఏళ్ల యువ నటుడు మహేష్ పవార్ ఈ ప్రమాదంలో కన్నుమూశారు.
3. ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు?
ఈ ఘోర ప్రమాదంలో నటుడు మహేష్ పవార్‌తో పాటు అతని ఏడుగురు స్నేహితులు (మొత్తం ఎనిమిది మంది) అక్కడికక్కడే మరణించారు.
4. సహాయక చర్యల్లో ఏయే బృందాలు పాల్గొంటున్నాయి?
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్థానిక జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లు, స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి లోయలో నుంచి మృతదేహాలను వెలికితీసే పనుల్లో పాల్గొంటున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


