వారి కడుపు కొట్టడం మంచి సంస్కృతి కాదు.. కోవా బన్ వలీకి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్!

కోవా బన్ను అమ్ముకునే వలీకి నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మద్దతు ఇచ్చారు. పొట్టకూటి కోసం కష్టపడే వారి కడుపు కొట్టడం సరికాదన్నారు.

Published on: Feb 15, 2026, 18:55:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవల కోవా బన్ వలీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వలీని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పరామర్శించారు. పొట్టకూటి కోసం రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యక్తుల మీద వ్యూస్ కోసం యూట్యూబ్ ఛానళ్లు ఇలా దాడి చేయడం సబబు కాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా అమాయకులపై దౌర్జన్యం సరైనది కాదని హితవు పలికారు.

కోవా బన్ వలీకి నాగబాబు సపోర్ట్ (Facebook)
కోవా బన్ వలీకి నాగబాబు సపోర్ట్ (Facebook)

'పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవా బన్ అమ్ముకుంటున్న వలీని కొందరు పనికట్టుకుని మరీ భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదు. మేడారం జాతరలో రూ.10కే కోవా బన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న సందర్భంలో కొందరు వ్యక్తుల అత్యుత్సాహం ఈరోజు ఆ కుటుంబాన్ని పస్తులు పడుకోబెడుతోంది. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీర్చుకోవడం చిరువ్యాపారుల లక్ష్యం. నచ్చితే, చేతనైతే వారి వ్యాపారానికి చేయుతనిద్దాం. అంతేకానీ ఆరోపణలతో వారి కడుపు కొట్టడం మంచి సంస్కృతి కాదు.' అని నాగబాబు అన్నారు.

మరోవైపు మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. చిన్న వ్యాపారుల మీద మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా ఎవరూ ప్రేరేపించినా సహించబోమని లోకేష్ వెల్లడించారు. త్వరలో కలుస్తానని, కోవా బన్ రుచి చూస్తానని చెప్పారు.

అసలు ఏం జరిగింది?

తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరలో కోవా బన్స్ అమ్ముతున్న కర్నూలుకు చెందిన వలీని ఓ యూట్యూబ్ ఛానల్ టార్గెట్ చేస్తూ మాట్లాడిన విడియో బాగా వైరల్ అయింది. 10 రోజులుగా జాతరలో కల్తీ కోవా బన్‌లను అమ్ముతున్నారని ఆరోపిస్తూ వరుస వీడియోలను ప్రచురించింది.

వీడియోలలో వలీని మాటలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అలా ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. అందులో ఏం కలుపుతున్నారని అడిగారు. నేను కూడా తింటాను మేడమ్ అంటూ వలీ చూసిన చూపులు చాలా మంది నెటిజన్లను బాధపెట్టాయి. అనేక మంది వలీకి మద్దతుగా నిలిచారు. వలీని మాత్రమే కాదు.. అదే కర్నూలు నుండి వెళ్లిన జావేద్ అనే చిరువ్యాపారిని కూడా ఆ యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించింది.

వలీని ప్రశ్నిస్తూ.. బన్స్ పై తయారీ తేదీ లేదా గడువు తేదీ ఎందుకు లేదని అడిగారు. ఆ తర్వాత కోవా సరైనది కాదని, అంత తక్కువ ధరకు అమ్మడం సాధ్యం కాదని యూట్యూబ్ ఛానల్‌లోని వ్యక్తి వాదించాడు. అయితే రెండు మూడు రూపాయలు మాత్రమే మిగులుతుందని, పొట్టకూటి కోసం ఇక్కడకు వచ్చానని చెప్పాడు వలీ. అయినప్పటికీ ఆ యూట్యూబ్ ఛానల్ యాంకర్లు వలీని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఓ మతాన్ని టార్గెట్ చేస్తున్నారని కామెంట్లు వచ్చాయి.

ఇప్పుడు వలీకి చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. మంత్రి నారా లోకేశ్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా మద్దతు ఇచ్చారు. అంతేకాదు.. తెలంగాణ నుంచి కూడా చాలామంది సామాజిక కార్యకర్తలు కర్నూలు వెళ్లి మరీ వలీని కలిశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More