Mohanlal: దృశ్యం 3 చూసి ఏడ్చేసిన మోహన్‌లాల్.. థియేటర్లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఎమోషనల్.. వీడియో వైరల్

Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' (Drishyam 3) మే 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదలైంది. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన మోహన్‌లాల్.. ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందన చూసి థియేటర్లోనే భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

Published on: May 22, 2026, 13:58:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mohanlal: దర్శకుడు జీతూ జోసెఫ్ – మోహన్‌లాల్ కాంబినేషన్‌లో వచ్చిన 'దృశ్యం' ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజీ సిరీస్‌లో వచ్చిన మూడో భాగం 'దృశ్యం 3' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. సినిమా విడుదలైన రోజే మోహన్‌లాల్ పుట్టినరోజు కూడా కావడం విశేషం.

Mohanlal: దృశ్యం 3 చూసి ఏడ్చేసిన మోహన్‌లాల్.. థియేటర్లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఎమోషనల్.. వీడియో వైరల్
Mohanlal: దృశ్యం 3 చూసి ఏడ్చేసిన మోహన్‌లాల్.. థియేటర్లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఎమోషనల్.. వీడియో వైరల్

ప్రేక్షకులను చూసి ఎమోషనల్ అయిన స్టార్

సినిమా రిలీజ్ రోజున మోహన్‌లాల్ థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమాను చూశారు. థియేటర్లో ప్రేక్షకులు సినిమాను చూస్తూ చప్పట్లతో, కేరింతలతో హోరెత్తించడంతో మోహన్‌లాల్ ఎమోషనల్ అయ్యారు.

చిత్ర బృందంతో కలిసి కూర్చున్న ఆయన.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఆనందంతో కళ్లు తుడుచుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. థియేటర్లోని ఓ అభిమానికి ఆయన చేతులు జోడించి కృతజ్ఞతలు కూడా తెలిపారు.

ఆ తర్వాత ఆయన ఎక్స్ వేదికగా అభిమానులకు భావోద్వేగ లేఖ రాశారు. "ఎంతో ప్రేమ, ప్యాషన్, కృతజ్ఞతలతో 'దృశ్యం 3' చిత్రాన్ని రూపొందించాం. దానికి మీ నుంచి వస్తున్న ప్రేమ, రెస్పాన్స్ చూస్తుంటే మనసు నిండిపోయింది. మీ రివ్యూలు, మీ మాటలు, మీరు వ్యక్తపరుస్తున్న భావోద్వేగాలు నాకు కలెక్షన్ల నంబర్ల కంటే చాలా చాలా ఎక్కువ. సినిమాను చూసి, ప్రతి క్షణాన్ని ఫీల్ అవుతూ, జార్జ్‌కుట్టి, అతని కుటుంబాన్ని మీ సొంత కుటుంబంగా భావించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని రాసుకొచ్చారు.

మే 21న మోహన్‌లాల్ పుట్టినరోజు కావడంతో, 'దృశ్యం 3' చిత్ర యూనిట్ ఆయనతో భారీ చాక్లెట్ కేక్ కట్ చేయించి బర్త్‌డే వేడుకలను కూడా థియేటర్ లోపలే ఘనంగా నిర్వహించింది.

'దృశ్యం 3' కథేంటంటే?

తొలి రెండు భాగాల తర్వాత ఈ మూడో భాగంలో జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్) తన కుటుంబంతో కలిసి కాస్త ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. అతను నిర్మించిన 'దృశ్యం' సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో, పెద్ద కూతురు అంజు (అన్సిబా హసన్)కు పెళ్లి చేసి లైఫ్‌లో సెటిల్ చేయాలనుకుంటాడు.

అంతా సజావుగా సాగుతూ జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అనుకునే సమయంలో.. ఒక జర్నలిస్ట్ మళ్లీ ఆ పాత మర్డర్ కేసుపై ఆసక్తి చూపడంతో జార్జ్‌కుట్టి నిర్మించుకున్న ప్రశాంతమైన సామ్రాజ్యం మళ్లీ ప్రమాదంలో పడుతుంది.

మిశ్రమ రివ్యూలు.. అయినా బాక్సాఫీస్ వసూళ్ల వేట

ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వసూళ్లలో మాత్రం దుమ్మురేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు రూ. 48.37 కోట్లు కావడం విశేషం. ఇక ఇండియా నెట్ వసూళ్లు రూ. 15.85 కోట్లుగా ఉన్నాయి. ఈ కలెక్షన్లలో అత్యధిక భాగం ఒరిజినల్ మలయాళ వెర్షన్ నుంచే వచ్చాయి.

ఈ మూవీకి హిందుస్థాన్ టైమ్స్ ఇచ్చిన రివ్యూ ప్రకారం.. "'దృశ్యం 3' ఫోకస్ ట్విస్టులు, మలుపులతో ప్రేక్షకులను థ్రిల్ చేయడం కంటే.. జార్జ్‌కుట్టి, అతని నిర్ణయాల వల్ల జరిగిన పరిణామాలపైనే ఎక్కువ ఉంది. జార్జ్‌కుట్టి హింసకు పాల్పడినప్పటికీ దర్శకుడు జీతూ ఎక్కడా అతని పాత్రను తప్పుబట్టకపోవడం వల్ల ఈ ఫ్రాంచైజీలోనే ఇది కాస్త తక్కువ ఆకట్టుకునే చిత్రంగా మిగిలింది. సినిమా ముగిసేసరికి అసలు ఈ గొడవంతా ఎందుకు మొదలైందో కూడా మనం మర్చిపోతాం" అని పేర్కొంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'దృశ్యం 3' సినిమా ఎప్పుడు విడుదలైంది?

ఈ చిత్రం మే 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇదే రోజు మోహన్‌లాల్ పుట్టినరోజు కూడా.

2. మొదటి రోజు 'దృశ్యం 3' ఎంత వసూలు చేసింది?

ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 48.37 కోట్ల గ్రాస్, ఇండియాలో రూ. 15.85 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

3. థియేటర్లో మోహన్‌లాల్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు?

ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన, చప్పట్లు చూసి మోహన్‌లాల్ ఆనందంతో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More