Yesha Nagula Lyrics Meaning: నాని ఏష నాగుల పాటకు తెగ వైబ్ అవుతున్నారు! మరి ఆ సాంగ్ లిరిక్స్‌కున్న అర్థమేంటో తెలుసా?

The Paradise Yesha Nagula Song Lyrics Meaning In Telugu: ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఏష నాగుల సాంగ్ తెగ వైరల్ అవుతోంది. నాని ది ప్యారడైజ్ నుంచి 3 రోజుల క్రితం విడుదలైన ఏష నాగుల సాంగ్ 44 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. మరి అలాంటి ఏష నాగుల సాంగ్ లిరిక్స్‌కు అర్థం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Sep 2, 2026, 05:01:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nani The Paradise Yesha Nagula Song Lyrics Meaning In Telugu: ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏష నాగుల సాంగ్ తెగ వైరల్ అవుతోంది. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా నుంచి ఏష నాగుల సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే.

నాని ఏష నాగుల పాటకు తెగ వైబ్ అవుతున్నారు! మరి ఆ సాంగ్ లిరిక్స్‌కున్న అర్థమేంటో తెలుసా?
నాని ఏష నాగుల పాటకు తెగ వైబ్ అవుతున్నారు! మరి ఆ సాంగ్ లిరిక్స్‌కున్న అర్థమేంటో తెలుసా?

44 మిలియన్ వ్యూస్

నాని, కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్ వేస్ అలరించిన ఏష నాగుల పాటకు యూట్యూబ్‌లో 3 రోజుల్లో 44కిపైగా మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే, ఏష నాగుల పాటకున్న అర్థం పెద్దగా తెలియకపోయిన ఆ సాంగ్ వింటూ ప్రతి ఒక్కరు వైబ్ అవుతున్నారు. మరి అలాంటి వారికోసం ఏష నాగుల సాంగ్ లిరిక్స్‌కు ఉన్న అర్థమేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఏష నాగుల కట్టమీద సాంగ్ లిరిక్స్‌కు అర్థం:

జిమ్మేదరి పటేలో జిమ్మేదారీ పటేల..

గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో..

జిమ్మేదరి పటేలో జిమ్మేదారీ పటేలా..

నీతోవల నా సూపులు కావలున్నయో..

ఓ బాధ్యత ఉన్న పటేలు (పెద్దమనిషి) గుమ్మం దగ్గర నీకోసం ముగ్గునై ఉన్నా. వచ్చే దారిలో నీకోసం నా చూపులు కాపు కాస్తున్నాయి.

అర్రల గుడ్డిదీపమయ్యిందిర పానం..

ఒర్రిన ఇంట లేదు ఏందీ పాపం..

బుడ్డపరకల కూర వండిన నీకోసం..

బుడమట్లబువ్వతోని తిని పో కొంచెం..

గదిలో గుడ్డి దీపం అయిందిరా నా ప్రాణం. ఎంత అరిచిన ఎవరు వినట్లేదు పాపం. చెరువులో దొరికే చిన్న చిన్న చేపల కూర వండాను.. బుడమ వడ్లు (కొంచెం చిన్నగా లావుగా ఉండే ఒకరకమైన బియ్యం)తో అన్నం వండాను.. వచ్చి భోజనం చేసి పోవయ్యా కొంచెం.

ఓ బుజ్జవ్వా మరి సద్దికట్టుకొని రారాదు..

ఎక్కడికో..

మరి భోజనం పట్టుకుని రావచ్చుగా..

ఏష నాగుల... ఏష నాగుల... ఏష నాగుల... ఏష ఏష ఏష

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

ఏష నాగుల కట్ట మీద.. ఏష నాగుల కట్ట మీద.. ఏష నాగుల కట్ట మీద.. ఒహో ఏష నాగుల కట్ట మీద..

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

ఊరి చివర ఏటి గట్టు దగ్గర ఉన్న గ్రామ దేవతలైన నాగుల విగ్రహాలు ఉండే చోటు. అక్కడ చెట్టుకు ఊయల కట్టుకుని ఎంచక్కా ఊగుదాం.

చరణం 1

మొన్న నువ్వు సెమటలు తుడుసుకున్న నా వాయిల్ చీర

సింగులే సెక్కంగ చిక్కున పడెరో...

నిన్న నీ వేలను తలుసుకొని నా జబ్బల రైక

ఉక్కులే ఉట్టుట్టిగ తెగిపోయినరో...

మొన్న నువ్వు చెమటలు తుడుచుకున్న నా చీర మడతలు చెక్కుకుంటుండగా సిగ్గుతో చిక్కులు పడుతుంది. నీ వేళ్లను తలుచుకుని నా జబ్బల రైక (స్లీవ్‌లెస్ బ్లౌజ్) ఊరికే తెగిపోయాయి.

మొన్న గుస గుస ముచ్చటంత గుర్తుకొస్తెరా

చెవి సత్తుకమ్మ నొప్పి జామ్మని మొత్తుకుందిరా...

నువ్వే దొర్లిపోయిన బొంతనింక సదురలేదురా..

ఇయ్యాల రాకపోతే పక్క మీద నేను సత్తరా...

మనం చెవిలో చెప్పుకున్న చిలిపి ముచ్చట్లు గుర్తుకొచ్చి నా చెవి కమ్మలు మత్తెక్కి గోల చేస్తున్నాయి. నువ్వు పడుకున్న దుప్పటి ఇంకా సర్దలేదు. నువ్వు ఈరోజు రాకుంటే దానిమీద పడి నేను చచ్చిపోతరా.

ఘుమ ఘుమ నీ వాసన మోసిన నా ఒళ్లు...

ఇనడం మర్చిపాయె ఎచ్చని నీళ్లు...

గున గున నువ్ తిరిగిన నా ఇరుకు ఇళ్లు

ఏరుకుంటాందిరా నీ ఎంగిలి పూలు

నీ ఒంటి వాసన మోసిన (లేదా నిండిపోయిన) నా శరీరం వేడెక్కి వేడి నీళ్లతో స్నానం చేయడమనేదే మర్చిపోయింది. నువ్వు అటు ఇటు తిరిగిన నా ఇరుకు ఇల్లు నాకు పెట్టిన ముద్దులను ఏరుకుంటుందిరా (నా ఇంట్లో ఎటు చూసిన నువ్వు ముద్దుపెట్టిన జ్ఞాపకాలే గుర్తుకు వస్తున్నాయి).

నీ రంది తీర్చనీకీ నా దగ్గర మందుందే బుజ్జవ్వా..

ఏందో అది...

నా బాధ (లేదా విరహవేదన) తీర్చేందుకు నా దగ్గర పరిష్కారం (లేదా ఉపాయం) ఉంది.

దొరల్ తాగే దొరల్ తాగే దొరల్ తాగే...

దొరల్.. దొరల్.. దొరల్.. దొరల్..

దొరల్ తాగే ఇప్పసారాయి తాగుదమే బాల... మనం ఊగుదమే బాల...

దొరల్ తాగే ఇప్పసారాయి తాగుదమే బాల... మనం ఊగుదమే బాల...

దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి

దొరలు తాగే ఇప్పసారాయి (ఇప్ప పువ్వుల నుంచి తయారు చేసే మద్యం. కొంచెం లగ్జరీ ఆల్కహాల్ అన్న అర్థం వస్తుంది) ఇద్దరం కలిసి తాగుదాం. తాగి మత్తుతో ఊగుదాం. (అంటే నేను వస్తానులే అని చెబుతున్నట్లుగా అర్థం వస్తుంది.)

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

ఏష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల...

దుంకి ఆడే బుజ్జవ్వా.. దుబ్బలేపే బుజ్జవ్వా..

నువ్వు ఎగిరి ఆడు.. దుమ్ములేపు.

ఇలా తెలంగాణ మాండలికంలో ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ రాసిన ఏష నాగుల పాటకు అర్థం వస్తుంది. ఇక పాటను ఫోక్ సింగర్స్ జంగిరెడ్డి, ప్రభ తమ అద్భుతమైన గాత్రంతో ఆలపించారు. అలాగే, మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పక్కా తెలంగాణ మాస్ బీట్స్‌తో ప్రాణం పోశాడు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More