Mithun Chakraborty: ఫ్రీ ఫుడ్ కోసం పార్టీల్లో డ్యాన్స్‌లు.. ఫుట్‌పాత్‌లపై పడుకున్నా: నేషనల్ అవార్డు గెలిచిన నటుడు మిథున్

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తి తన కెరీర్ తొలినాళ్ల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఫ్రీ ఫుడ్ కోసం పార్టీల్లో డ్యాన్స్ చేసిన సందర్భాలు, ఫుట్ పాత్ పై పడుకున్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఫరా ఖాన్ షోలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

Published on: Sep 28, 2026, 20:21:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Mithun Chakraborty: నేషనల్ అవార్డ్ విన్నర్, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత, బాలీవుడ్ 'మహాగురు' మిథున్ చక్రవర్తి కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆకలి తీర్చుకోవడానికి నైట్ పార్టీల్లో ఫ్రీగా డాన్స్ చేయడం నుంచి ఫుట్‌పాత్‌లపై నిద్రపోవడం వరకు ఆయన జీవితంలో ఎన్నో కన్నీటి ఘట్టాలు ఉన్నాయి.

Mithun Chakraborty: ఫ్రీ ఫుడ్ కోసం పార్టీల్లో డ్యాన్స్‌లు.. ఫుట్‌పాత్‌లపై పడుకున్నా: నేషనల్ అవార్డు గెలిచిన నటుడు మిథున్ (Rishi Ballabh)
Mithun Chakraborty: ఫ్రీ ఫుడ్ కోసం పార్టీల్లో డ్యాన్స్‌లు.. ఫుట్‌పాత్‌లపై పడుకున్నా: నేషనల్ అవార్డు గెలిచిన నటుడు మిథున్ (Rishi Ballabh)

జూనియర్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టి మెగాస్టార్‌గా ఎదిగిన ఈ దిగ్గజ నటుడి రియల్ స్ట్రగుల్ లైఫ్ గురించి ఫరా ఖాన్ వ్లాగ్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. సినిమా ఇండస్ట్రీలో ఏ అగ్ర హీరోకూ లేని అత్యంత కష్టతరమైన గతాన్ని దాటుకుని మిథున్ చక్రవర్తి ఈ స్థాయికి చేరుకున్నారు.

ఫ్రీ ఫుడ్ కోసం పార్టీల్లో డాన్స్

బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన యూట్యూబ్ ఛానెల్ లో మిథున్ చక్రవర్తితో మాట్లాడిన విశేషాలను పంచుకున్నారు. ఫరా ఖాన్ చిన్నతనంలో ఆమె బాబాయ్ కేకే శుక్లా అమితాబ్ బచ్చన్ సినిమాలకు రైటర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో మిథున్ చక్రవర్తి రాత్రి వేళల్లో భోజనం దొరుకుతుందనే ఒక్క కారణంతో కేకే శుక్లా నిర్వహించే పార్టీలకు వచ్చి ఉచితంగా డాన్స్ చేసేవారని ఫరా ఖాన్ గుర్తు చేసుకున్నారు.

ఎలాంటి రెమ్యునరేషన్ ఆశించకుండా కేవలం రాత్రి భోజనం కోసం మిథున్ అంత బాగా డాన్స్ చేయడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయేవారని ఫరా చెప్పారు. చాలామంది చాలా సులువుగా 'స్ట్రగుల్' అనే పదాన్ని వాడేస్తుంటారని, కానీ అసలైన స్ట్రగుల్ అంటే మిథున్ చక్రవర్తి జీవితమేనని ఆమె కొనియాడారు. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇండియన్ సినిమాలో మెగాస్టార్‌గా మారిన ఏకైక యాక్టర్ మిథున్ మాత్రమేనని ఫరా స్పష్టం చేశారు.

అలిసిపోయి ఫుట్‌పాత్‌పైనే నిద్రించేవాడిని

ఫరా ఖాన్ వ్యాఖ్యలపై మిథున్ చక్రవర్తి స్పందిస్తూ తన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "ఇది కేవలం కష్టం మాత్రమే కాదు, అంతకుమించిన నరకం. నేను ఎన్నో రాత్రులు రోడ్లపై, పార్కుల్లో, ఫుట్‌పాత్‌లపై పడుకున్నాను. రోజంతా అవకాశాల కోసం నడిచి నడిచి తీవ్ర అలసటతో ఫుట్‌పాత్‌పైనే పడిపోయేవాడిని. ఉదయం నిద్రలేచేసరికి ఫుట్‌పాత్‌పై ఉన్నానని గ్రహించేవాడిని" అంటూ మిథున్ కంటతడి పెట్టించే విషయాలను వెల్లడించారు.

'మృగయా' నుంచి 'డిస్కో డాన్సర్' వరకు క్రేజీ జర్నీ

1950 జూన్ 16న గౌరాంగ చక్రవర్తిగా జన్మించిన మిథున్.. ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయా' (1976) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నప్పటికీ ఆయనకు ఆఫర్లు అంత సులువుగా రాలేదు. 1979లో వచ్చిన స్పై థ్రిల్లర్ 'సురక్ష' సినిమాతో ఆయనకు బ్రేక్ లభించింది.

ఆ తర్వాత 1980ల కాలంలో మిథున్ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. 'డిస్కో డాన్సర్', 'డాన్స్ డాన్స్', 'ప్యార్ ఝుక్తా నహీ', 'కసమ్ పైదా కర్నేవాలేకీ', 'కమాండో' వంటి వరుస ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కేవలం ఆ ఒక్క దశాబ్దంలోనే ఆయన 100కు పైగా సినిమాల్లో నటిస్తూ, ఒకే రోజు నాలుగు సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డు సృష్టించారు.

350 సినిమాలు.. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

ఐదు దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ కెరీర్‌లో మిథున్ చక్రవర్తి హిందీ, బెంగాలీ, భోజ్‌పురి, తెలుగు, తమిళం, కన్నడ, ఒడియా, పంజాబీ భాషల్లో ఏకంగా 350కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో కూడా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ నటించిన 'గోపాల గోపాల' సినిమాలో స్వామీజీ పాత్రలో అలరించారు.

మూడు సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్న ఆయనను భారత ప్రభుత్వం 2024లో మూడో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మభూషణ్'తో గౌరవించింది. అలాగే భారతీయ సినిమాకు చేసిన అపారమైన సేవలకుగానూ అత్యున్నత 'దాదాసాహెబ్ ఫాల్కే' పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More