Nithya Menen Marriage: నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది- నిత్యా మీనన్ కామెంట్స్- బ్రేకప్‌ల వెనుక అసలు కారణం చెప్పిన హీరోయిన్

Nithya Menen About Marriage And Love Breakups: తాను పెళ్లికి వ్యతిరేకం కాదని, పెళ్లి చేసుకోవాలని ఉందని హీరోయిన్ నిత్యా మీనన్ స్పష్టం చేశారు. ఊపిరాడనివ్వని ప్రేమ బంధాల నుంచి బయటకు రావడం కష్టమైనా, ఆ నిర్ణయం తనకు ఎంతో స్వేచ్ఛనిచ్చిందని ఆమె ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మనసు విప్పారు.

Published on: Nov 24, 2026, 18:25:52 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Nithya Menen About Marriage And Love Breakups: 'అలా మొదలైంది' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ ఆ తర్వాత 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది- నిత్యా మీనన్ కామెంట్స్- బ్రేకప్‌ల వెనుక అసలు కారణం చెప్పిన హీరోయిన్
నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది- నిత్యా మీనన్ కామెంట్స్- బ్రేకప్‌ల వెనుక అసలు కారణం చెప్పిన హీరోయిన్

'తిరుచిత్రంబళం' చిత్రానికి జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న నిత్య మీనన్ ఎప్పుడూ తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెబుతుంటారు. తాజాగా ప్రముఖ వ్యాఖ్యాత గోపీనాథ్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నిత్య మీనన్, తన వ్యక్తిగత జీవితం, గత ప్రేమ బంధాలు, పెళ్లిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఊపిరాడని బంధాల నుంచి బయటకు వచ్చేశా

నిత్యా మీనన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తుంటాయి. అసలు ప్రేమ బంధాల నుంచి ఎందుకు బయటకు వచ్చారని గోపీనాథ్ అడిగిన ప్రశ్నకు ఆమె లోతైన సమాధానం ఇచ్చారు. తన వ్యక్తిత్వాన్ని అణచివేసే బంధాల్లో తాను ఎప్పటికీ ఉండలేనని తేల్చిచెప్పారు.

"మన ఆత్మను కట్టడి చేసే పరిస్థితులు ఎదురైనప్పుడు, ఎదుటివారి ప్రభావం వల్ల మనం ఎదగలేకపోతున్నామని, కనీసం ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నామని అనిపించినప్పుడు ఆ బంధం నుంచి బయటకు రావడమే మంచిది. ఆ నిర్ణయం తీసుకోవడం మొదట్లో చాలా కష్టమే అయినా, నేను ఎప్పుడూ అక్కడి నుంచి తప్పుకోవడానికే మొగ్గు చూపాను. ఇది భయంతో తీసుకున్న నిర్ణయం కాదు, నాకు కలిగిన ఒక స్పష్టమైన అవగాహన మాత్రమే" అని నిత్యా మీనన్ వివరించారు.

బలహీనంగా, చిన్నదానిలా మారిపోయిన భావన

గతంలో తాను ఉన్న కొన్ని రిలేషన్‌షిప్స్ తనను పూర్తిగా కట్టడి చేశాయని నిత్యా మీనన్ గుర్తుచేసుకున్నారు. ఆ బంధాల్లో ఉన్నప్పుడు తన ఆలోచనలకు, పనులకు అడ్డుకట్ట పడిందని, తాను చాలా బలహీనంగా, చిన్నదానిలా మారిపోయిన భావన కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటి ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం నుంచి బయటకు అడుగుపెట్టిన తర్వాతే తనకు నిజమైన ప్రశాంతత దొరికిందని, ఒక్కసారిగా కొత్త ప్రపంచం తెరుచుకున్నట్లు హాయిగా ఊపిరి పీల్చుకోగలిగానని నిత్య మీనన్ చెప్పుకొచ్చారు.

పెళ్లికి వ్యతిరేకం కాదు.. కానీ ఆ ఒక్క షరతు!

తాను ఒంటరిగా ఉండటాన్ని చూసి, అసలు పెళ్లి వ్యవస్థకే వ్యతిరేకమని చాలామంది అపోహ పడుతున్నారని నిత్యా మీనన్ పేర్కొన్నారు. తనకు వివాహ బంధంపై గౌరవం ఉందని, అయితే సరైన భాగస్వామి దొరకడం అన్నింటికంటే కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు.

"నేను పెళ్లి చేసుకోనని ఎప్పుడూ చెప్పలేదు. నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ కేవలం అందరూ చేసుకుంటున్నారనో, వయసు పెరుగుతోందనో మొక్కుబడిగా వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు కావాల్సింది కేవలం పెళ్లి కాదు, ఒక సరైన తోడు. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చే వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. అలాంటి వ్యక్తి దొరక్కపోతే ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను" అని నిత్యా మీనన్ తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టారు.

వరుస సినిమాలతో బిజీగా నిత్య

నేటి తరం యువత ఆలోచనలకు అద్దం పట్టేలా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వ్యక్తిగత జీవితంలో స్పష్టమైన ఆలోచనలతో సాగుతున్న నిత్యా మీనన్, కెరీర్ పరంగానూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. గతేడాది తమిళంలో వరుస సినిమాలతో అలరించారు.

కృతిగా ఉదయనిధి దర్శకత్వంలో రవి మోహన్ సరసన 'కాదలిక్క నేరమిల్లై', పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి 'తలైవన్ తలైవి', ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఇడ్లీ కడై' చిత్రాల్లో నటించి మెప్పించారు.

వివాహేతర సంబంధాలు, ఆర్థిక మోసాలు

ప్రస్తుతం ఈ ప్రతిభావంతురాలైన నటి బాలీవుడ్‌పై దృష్టి సారించారు. అంకుర్ పజ్ని, విశాల్ రంజన్ మిశ్రా సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న 'మిస్టర్ అండ్ మిసెస్ గ్రే' (Mr & Mrs Grey) అనే హిందీ చిత్రంలో నిత్యా మీనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా, వివాహేతర సంబంధం, ఆర్థిక మోసాల మధ్య చిక్కుకున్న ఓ వ్యక్తి కథతో ఆసక్తికరంగా సాగనుంది. ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.