Oscars 2026: ప్రేక్షకులకు బోర్ కొట్టిన ఆస్కార్స్? బాక్సాఫీస్ హిట్స్ ఉన్నా పడిపోయిన వ్యూయర్‌షిప్.. ఎంతమంది చూశారంటే?

Oscars 2026: మోస్ట్ పాపులర్ సినీ ఈవెంట్ ‘ఆస్కార్స్’కు ఈ సారి షాక్ తగిలింది. ఈ ఈవెంట్ చూసేవాళ్ల సంఖ్య తగ్గిపోయింది. వ్యూయర్ షిప్ పడిపోయింది. దీంతో ప్రేక్షకులకు ఆస్కార్స్ బోర్ కొట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

Published on: Mar 18, 2026, 06:26:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ ఆస్కార్ అవార్డుల ప్రసారానికి ఈసారి ప్రేక్షకాదరణ తగ్గింది. గత కొన్ని ఏళ్లుగా పెరుగుతూ వచ్చిన రేటింగ్స్, ఈ ఏడాది మళ్లీ తగ్గుముఖం పట్టడం గమనార్హం. ప్రముఖ హోస్ట్ కోనన్ ఓ'బ్రియన్ సారథ్యంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన గణాంకాలను వాల్ట్ డిస్నీ సంస్థ వెల్లడించింది.

ఆస్కార్స్ 2026 వ్యూయర్ షిప్
ఆస్కార్స్ 2026 వ్యూయర్ షిప్

9 శాతం తగ్గిన వ్యూయర్‌షిప్

గత ఆదివారం జరిగిన ఆస్కార్స్ 2026 వేడుకను ఏబీసీ (ABC), హులు (Hulu) ప్లాట్‌ఫామ్‌లలో కలిపి సుమారు 17.9 మిలియన్ల (ఒక కోటి 79 లక్షల) మంది వీక్షించారు. గత ఏడాది ‘అనోరా’ చిత్రం అవార్డు గెలుచుకున్నప్పుడు 19.7 మిలియన్ల మంది ఆ ఈవెంట్ ను చూశారు. ఈ సారి ఆ సంఖ్య 9 శాతం తగ్గింది.

యూత్ దూరం

ఆస్కార్స్ 2026 ఈవెంట్ కు ముఖ్యంగా యూత్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఈవెంట్ చూసిన వాళ్లలో 18 నుంచి 49 వయసు మధ్య ఉన్నవాళ్లలో 14 శాతం తగ్గుదల కనిపించింది.

వార్నర్ బ్రదర్స్ సినిమాల పోటీ

ఈ ఏడాది ఆస్కార్ రేసులో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన రెండు చిత్రాలు “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్”, "సిన్నర్స్" మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు లాంటి రెండు మెయిన్ అవార్డులను "వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్" కైవసం చేసుకుంది.

ఆస్కార్స్ చరిత్రలో అత్యధికంగా 16 నామినేషన్లు పొందిన చిత్రం “సిన్నర్స్” నుంచి మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.

సోషల్ మీడియాలో మాత్రం

టీవీ, ఓటీటీ రేటింగ్స్ తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో ఆస్కార్స్ ప్రభంజనం సృష్టించింది. సోషల్ ఇంప్రెషన్స్ గత ఏడాదితో పోలిస్తే 42 శాతం పెరిగాయి. అకాడమీ అధికారిక ప్లాట్‌ఫామ్‌లలో వీడియో వీక్షణలు 129 మిలియన్లు దాటడం విశేషం. 2025-2026 సీజన్‌లో ఇప్పటికీ నంబర్ 1 ప్రైమ్‌టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌గా ఆస్కార్స్ 2026 నిలిచింది.

గతంతో పోలిస్తే

ఒకప్పుడు 50 మిలియన్ల మందికి పైగా వీక్షించిన ఆస్కార్స్ వేడుక కాలక్రమేణా డిజిటల్ వైపు మళ్లుతోంది. 1998లో "టైటానిక్" విజయం సాధించినప్పుడు అత్యధికంగా 57.2 మిలియన్ల మంది ఈవెంట్ ను చూశారు. అయితే 2021 కోవిడ్ సమయంలో ఇది 10.4 మిలియన్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.

భవిష్యత్తు ప్రణాళిక

2029లో జరగబోయే 101వ ఆస్కార్ వేడుకలు పూర్తిస్థాయిలో యూట్యూబ్ కు మారనున్నాయి. ఆ సమయానికి టీవీ రేటింగ్స్‌తో సంబంధం లేకుండా డిజిటల్ వ్యూయర్‌షిప్ ప్రాతిపదికగా అవార్డుల విజయాన్ని అంచనా వేయనున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More