Oscars Gift Bag: ఆస్కార్ నామినీలకు రూ.3.2 కోట్ల విలువైన గిఫ్ట్ బ్యాగ్.. ఇంతకీ అందులో ఏముంటాయో తెలుసా?
Oscars Gift Bag: ఆస్కార్స్ లో అవార్డు గెలవకపోయినా నామినీలకు మాత్రం ఏకంగా రూ.3.2 కోట్ల విలువైన ఓ గిఫ్ట్ బ్యాగు ఇస్తారన్న విషయం తెలుసా? అవార్డు రాకపోయినా.. ఇంత ఖరీదైన గిఫ్ట్ బ్యాగు రావడం మాత్రం మామూలు విషయం కాదు.
సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ వేదికపై ‘అందరూ విజేతలే’ అనే మాట వినడానికి కాస్త పాతబడ్డ సామెతలా అనిపించవచ్చు. కానీ క్రియేటివ్ రంగంలో ఇది అక్షర సత్యం. ప్రతి ఏటా ఒకరు ఆస్కార్ గెలుచుకుంటే, మిగిలిన నామినీలు కూడా ఉత్తమ గుర్తింపుతో పాటు భారీ బహుమతులతో ఇంటికి వెళ్తారు.
ఆస్కార్ గిఫ్ట్ బ్యాగ్‌ను ఎవరు సిద్ధం చేస్తారు?
గత రెండు దశాబ్దాలుగా ఆస్కార్ నామినీలకు ఒక ఖరీదైన 'గిఫ్ట్ బ్యాగ్' అందించడం ఆనవాయితీగా వస్తోంది. గడిచిన 24 ఏళ్లుగా అగ్రశ్రేణి కేటగిరీల్లో నామినేట్ అయిన వారికి ఒక అమెరికన్ కంపెనీ ఈ విలాసవంతమైన కానుకలను అందిస్తోంది. ఈ ఏడాది ఆ గిఫ్ట్ బ్యాగ్ విలువ అక్షరాలా 3,50,000 డాలర్లు (సుమారు రూ. 3.20 కోట్లకు పైగా). మరి ఆ 'ఎవ్రీబడీ విన్స్' గిఫ్ట్ బ్యాగ్‌లో ఏమేం ఉన్నాయో ఓసారి చూద్దాం.
అమెరికాకు చెందిన 'డిస్టింక్టివ్ అసెట్స్' అనే మార్కెటింగ్ సంస్థ గత 24 ఏళ్లుగా ఆస్కార్‌లోని టాప్ యాక్టింగ్, డైరెక్షన్ కేటగిరీల నామినీలకు ఈ గిఫ్ట్ బ్యాగులను అందిస్తోంది. మార్కెటింగ్ నిపుణుడు లాష్ ఫారీ నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే దీనికి ఆస్కార్ అకాడమీకి నేరుగా ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థ స్వతంత్రంగా చేసే కార్యక్రమం. కాలక్రమేణా ఇది ఆస్కార్ సంప్రదాయంలో ఒక భాగంగా మారిపోయింది.
చిన్న బ్రాండ్లు, మహిళలు, మైనారిటీలు నడిపే కంపెనీలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని లాష్ ఫారీ చెబుతుంటారు. "అకాడమీతో సంబంధం లేకుండా మేము స్వతంత్రంగా ఈ పని చేస్తున్నాం. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడంతో పాటు, అవార్డు రాని వారికి ఆ బాధ తెలియకుండా సెలబ్రేట్ చేయడం మా ఉద్దేశం" అని ఆయన వివరించారు.
2026 ఆస్కార్ గిఫ్ట్ బ్యాగ్‌లో ఏముంది?
ఈ ఏడాది నామినీలకు ఇచ్చే గిఫ్ట్ బ్యాగ్ ఒక చిన్న సూట్‌కేస్ రూపంలో ఉంటుంది. ఇందులో హైడ్రేటింగ్ సిప్పర్స్ నుంచి ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, ఫుట్‌వేర్ వరకు ఎన్నో ఉన్నాయి. ఈ బ్యాగ్‌లో తమ ఉత్పత్తులను ఉంచడానికి వివిధ కంపెనీలు డిస్టింక్టివ్ అసెట్స్‌కు కొంత మొత్తం చెల్లిస్తాయి. తద్వారా ఆయా బ్రాండ్లకు ప్రపంచవ్యాప్త ప్రచారం లభిస్తుంది.
ఉదాహరణకు రెస్క్యూ స్పా వ్యవస్థాపకురాలు దనుటా మిలోచ్ ఈ ఏడాది ప్రతి బ్యాగ్‌లోనూ 450 డాలర్ల విలువైన ట్రీట్‌మెంట్స్, ఉత్పత్తులను ఉంచారు. "నేను 30 ఏళ్ల క్రితం పోలాండ్ నుంచి అమెరికా వచ్చాను. ఇప్పుడు నా బ్రాండ్ ఆస్కార్ వేదిక వరకు వెళ్లడం నాకు దక్కిన గౌరవం" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ప్రధాన ఆకర్షణలు ఇవే
ఫిన్లాండ్‌లోని మంచు కురిసే విల్లాలు, కోస్టారికా బీచ్‌లు, హాలీవుడ్ స్టార్లకు ఇష్టమైన ఇబిజా దీవులకు వెళ్లడానికి పూర్తిగా చెల్లించిన హాలిడే ప్యాకేజీలు ఇందులో ఉన్నాయి.
ఈ గిఫ్ట్ బ్యాగ్‌లోనే అత్యంత ఖరీదైనది 'హోమ్ ఇంటీరియర్ డిజైన్' ప్యాకేజీ. దీని విలువ దాదాపు ఒక లక్ష డాలర్లు (సుమారు రూ. 90 లక్షలు) పైమాటే. ఇంటిని పూర్తిగా కొత్తగా ముస్తాబు చేసే వెసులుబాటు ఇందులో ఉంటుంది.
ఇవే కాకుండా ఖరీదైన కాస్మెటిక్స్, ఆరోగ్యకరమైన స్నాక్స్, విలాసవంతమైన లైఫ్ స్టైల్ ఉత్పత్తులు ఈ సూట్‌కేస్‌లో ఉన్నాయి.
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో 98వ ఆస్కార్ వేడుకలు మార్చి 15న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరగనున్నాయి.

ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












