OTT: యాక్సిడెంట్ జరిగిన చోటికే పదేపదే తిరిగొచ్చే బైక్.. దేవుడంటూ పూజ చేసే ఊరు.. ఓటీటీలోకి రియల్ లైఫ్ మిస్టరీ థ్రిల్లర్
OTT: ఓటీటీలోకి ఓ డిఫరెంట్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓ లూనా, దానికి పూజ చేసే ఊరి జనం చుట్టూ తిరిగే స్టోరీతో వచ్చిన సినిమా ఇది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
OTT: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా సైలెంట్ గా ల్యాండైంది బాలీవుడ్ సెటైరికల్ కామెడీ థ్రిల్లర్ 'డుగ్ డుగ్' (Dug Dug). ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ కు మైండ్ బ్లాంక్ స్టోరీతో షాక్ ఇస్తోంది. డెబ్యూ డైరెక్టర్ రిత్విక్ పరీక్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ కు అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వానీ, విక్రమాదిత్య మోత్వానే, వాసన్ బాలా లాంటి ఇండియాస్ టాప్ మోస్ట్ కల్ట్ ఫిల్మ్ మేకర్స్ సపోర్ట్ తోడవడంతో ఇండస్ట్రీలో దీనిపై మంచి బజ్ క్రియేట్ అయింది. రాజస్థాన్ లోని ఫేమస్ 'బుల్లెట్ బాబా' రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ కథను చాలా విచిత్రంగా డిజైన్ చేశారు.

లూనా చుట్టూ పుట్టిన కొత్త దేవుడు
మే 8న థియేటర్లలో రిలీజైన ఈ డుగ్ డుగ్ మూవీని బుధవారం (జులై 8) నుంచి ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేస్తోంది. ఒక పాత లూనా మోపెడ్ బైక్ చుట్టూ జనాలు గుడ్డి నమ్మకాన్ని ఎలా పెంచుకున్నారు.. దాన్ని కొందరు బిజినెస్ గా ఎలా మార్చారు అనేదే ఈ డుగ్ డుగ్ మూవీ ప్రధానమైన కథ. ఠాకూర్ అనే లోకల్ వ్యక్తి పీకలదాకా తాగి హైవే మీద జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అతను నడిపిన పాత లూనా బైక్ ను పోలీసులు తీసుకెళ్లి స్టేషన్ లాకప్ లో పెడితే, అది అక్కడ నుంచి వింతగా మాయమైపోతుంది. కట్ చేస్తే.. మరుసటి రోజు ఉదయానికి ఆ బైక్ మళ్లీ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ కే చేరుకుంటుంది.
పోలీసులు ఎన్నిసార్లు దాన్ని లాక్ చేసినా, చైన్లతో కట్టేసినా కూడా ఆ బైక్ ప్రతిసారీ మాయమై అదే హైవే స్పాట్ లో ప్రత్యక్షమౌతుంది. ఈ విచిత్రమైన ఘటనను లోకల్ పూజారులు, రాజకీయ నాయకులు, కొందరు స్వార్థపరులు కలిసి ఒక పెద్ద అద్భుతంగా మార్చేస్తారు. ఆ పాత లూనా బైక్ కు శక్తులు ఉన్నాయంటూ రోడ్డు పక్కన దాన్ని ఒక దేవుడిగా ప్రతిష్టించి కొత్త కల్ట్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తారు.
మతం పేరుతో జరిగే కమర్షియల్ సర్కస్
సాధారణంగా దేవుడు, మతం అనగానే ఇండస్ట్రీలో చాలా సీరియస్ సినిమాలు తీస్తుంటారు. కానీ డైరెక్టర్ రిత్విక్ పరీక్ మాత్రం జనాల నమ్మకాలను ఆసరాగా చేసుకుని కొందరు ఎలా కోట్లు సంపాదిస్తున్నారో చాలా ఫన్నీగా ఈ సెటైరికల్ కామెడీ థ్రిల్లర్ మూవీ తీశాడు.
వెనుకబడిన ఊర్లలో, కష్టాల్లో ఉన్న మనుషులకు ఒక నమ్మకం, ఒక ఆశ ఎంత అవసరమో చెప్తూనే.. ఆ సెంటిమెంట్ తో ఎలాంటి దందా నడుస్తుందో ఒక సర్కస్ లా చూపించాడు.
విజువల్స్ పరంగా ఈ సినిమా మిమ్మల్ని ఒక విచిత్రమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నియాన్ లైటింగ్ తో కూడిన రాజస్థాన్ ఎడారి అందాలు, విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి. దీనికి తోడు 'సాల్వేజ్ ఆడియో కలెక్టివ్' అందించిన హిప్నాటిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా మూడ్ ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది.
డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే..
ఓటీటీలోకి రెగ్యులర్ గా థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. సీరియస్ గా సాగుతూ మంచి థ్రిల్లర్ పంచే మూవీస్ అవి. కానీ ఈ డుగ్ డుగ్ మాత్రం నవ్విస్తూనే ఓ సీరియస్ అంశాన్ని జనాల మెదళ్లలోకి ఎక్కించే సినిమా. ఈ వీకెండ్ లో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా ట్రై చేయాలని అనుకుంటే మాత్రం.. ఈ డుగ్ డుగ్ ను వెంటనే ప్రైమ్ వీడియోలో చూసేయండి.
డుగ్ డుగ్ మూవీ విశేషాలు
* సినిమా పేరు: డుగ్ డుగ్ (2026)
* జానర్: సెటైరికల్ కామెడీ మిస్టరీ
* ప్రేరణ: బుల్లెట్ బాబా కథ (రాజస్థాన్‌లో జరిగిన నిజ జీవిత ఘటన)
* డైరెక్టర్: రిత్విక్ పరీక్
* సమర్పకులు: అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వానీ, విక్రమాదిత్య మోత్వానే
* ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


