Peddi Movie Review: పెద్ది రివ్యూ- పుట్టుక హక్కుల కోసం పోరాడే ఆట కూలి-బాడీ లాంగ్వేజ్‌తోనే ఇరగదీసిన రామ్ చరణ్-ఎలా ఉందంటే?

Peddi Movie Review: రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీ కట్టిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం పెద్ది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రామ్ చరణ్ ఖాతాలో హిట్ పడిందా? అనేది నేటి పెద్ది రివ్యూలో తెలుసుకుందాం.

Jun 4, 2026, 06:49:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi Review And Rating In Telugu: 'ఆర్ఆర్ఆర్' (RRR)తో గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన తదుపరి చిత్రంగా కమర్షియల్ డైరెక్టర్లతో కాకుండా, ప్యూర్ కంటెంట్ నమ్ముకునే బుచ్చిబాబు సానతో జతకట్టిన సినిమా పెద్ది (Peddi).

పెద్ది రివ్యూ- పుట్టుక హక్కుల కోసం పోరాడే ఆట కూలి- బాడీ లాంగ్వేజ్‌తోనే ఇరగదీసిన రామ్ చరణ్-మూవీ ఎలా ఉందంటే?
పెద్ది రివ్యూ- పుట్టుక హక్కుల కోసం పోరాడే ఆట కూలి- బాడీ లాంగ్వేజ్‌తోనే ఇరగదీసిన రామ్ చరణ్-మూవీ ఎలా ఉందంటే?

పెద్ది రివ్యూ

పెద్ది సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్, సంగీతం ఏఆర్ రెహమాన్ అందించడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఇవేకాకుండా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమాన్ ఇరాన్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్ ఇందులో నటించడం అంచనాలతోపాటు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

మరి ఇంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో పెద్ది చిత్రం నేడు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? రామ్ చరణ్‌కు హిట్ పడిందా? అనే విశేషాలను నేటి పెద్ది రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్: పెద్ది

నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బొమాన్ ఇరానీ, రవి కిషన్ తదితరులు

కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సాన

సంగీతం: ఏఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు

ఎడిటింగ్: నవీన్ నూలి

నిర్మాతలు: వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సెనా

విడుదల తేది: 4 జూన్ 2026

కథ:

పెద్ది (రామ్ చరణ్) విజయనగరం జిల్లాలోని కొండ కింద ఊరిలో ఒక 'ఆట కూలీ'. డబ్బులు తీసుకుని అవతలి టీం తరఫున క్రికెట్ ఆడుతుంటాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్స్ కొట్టడంలో పెద్ది దిట్ట. అలాంటి పెద్ది ఉన్న ఊరికి ఎలాంటి గుర్తింపు ఉండదు. క్రికెట్‌లో రాటు దేలిన పెద్దిని కొనేందుకు విజయనగరం, బొబ్బిలి క్రికెట్ జట్లు వేలంలో పోటీపడుతుంటాయి.

ఆ తర్వాత ఏమైంది? క్రికెట్‌లో దిట్ట అయిన పెద్ది అది వదిలి కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాడు? కొండ కింద ఊరు, అక్కడి మనుషులతో పెద్ది చేసిన పోరాటం ఏంటీ? ఈ క్రమంలో పెద్ది ఏం కోల్పోయాడు? చివరకు పెద్ది ఏం సాధించాడు? పెద్ది ప్రయాణంపై అప్పలసూరి (జగపతి బాబు), గౌర్ నాయుడు (శివ రాజ్‌కుమార్), అచ్చియమ్మ (జాన్వీ కపూర్) పాత్రలు ఎలాంటి ప్రభావం చూపించాయి? వంటి విషయాలు తెలియాలంటే ఈ పెద్దిని చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు బుచ్చిబాబు సాన, తన గురువు సుకుమార్ బాటలోనే నడుస్తారని ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నారు. 'రంగస్థలం', 'పుష్ప' చిత్రాలలో హీరోల ఎలివేషన్లు, కమర్షియల్ హంగులు ఉన్నప్పటికీ.. వాటి వెనుక ఆత్మగౌరవం కోసం పోరాడే సామాన్యుల కథలుంటాయి.

'పెద్ది'లో బుచ్చిబాబు ఇంకాస్త లోతుకు వెళ్లారు. అసలు సమాజంలో గుర్తింపే లేని ఒక మనిషి, తన ఉనికి కోసం, తన వారి గౌరవం కోసం ఆటను ఆయుధంగా చేసుకుని ఎలా పోరాడాడనేదే ఈ చిత్ర కథాంశం.

అడ్డుపడిన కమర్షియల్ హంగులు

సినిమా ఫస్టాఫ్‌లో కథా గమనానికి అచ్చియమ్మ (జాన్వీ కపూర్) పాత్ర పెద్ద స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఆ ఊరి వాతావరణానికి, ఆ కథకు ఆమె ఎక్కడా కుదిరినట్లు అనిపించదు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే సినిమాలో, హీరోయిన్ పాత్రను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

దర్శకుడు చరణ్, జాన్వీల మధ్య సీన్లను, పాటలను మాస్ మసాలా కోసమే ఇరికించారు తప్ప, కథలో వాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. అలాగే విలన్ (దివ్యేందు)తో వచ్చే ఘర్షణ సీన్లు కూడా కేవలం ఫైట్ల కోసమే అన్నట్లు ఉన్నాయి తప్ప, బలమైన ఎమోషన్ లేదు. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపించి, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.

రామ్ చరణ్ వన్‌మ్యాన్ షో.. ప్లస్ పాయింట్లు

ఈ సినిమా కచ్చితంగా రామ్ చరణ్ భుజస్కంధాలపైనే నడిచింది. చరణ్ బాడీ లాంగ్వేజ్, ఆ రగ్గడ్ లుక్ సగం విజయాన్ని తెచ్చిపెట్టాయి. నటన పరంగా కూడా రామ్ చరణ్ బాగా మెప్పించారు. మాటల కంటే పెద్దిలోని పట్టుదలని శరీర భాషతోనే పలికించారు. సినిమాలో క్రికెట్ నేపథ్యం ఉన్నప్పటికీ, అసలు సిసలు మజా మాత్రం 'కుస్తీ' (Wrestling) పోరాటాల్లోనే ఉంది. ఈ పోర్షన్లు మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయి.

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ గౌర్ నాయుడు పాత్ర సినిమాకు పెద్ద ప్లస్. 'కరాటే కిడ్' తరహాలో చరణ్‌ను ట్రైన్ చేసే సీన్లు, వీరిద్దరి మధ్య బాండింగ్ అద్భుతంగా పండింది. అలాగే అప్పలసూరిగా జగపతి బాబు మరోసారి తన మార్క్ నటనతో పాత పగను, ఆవేశాన్ని పండించారు.

సినిమా కొంత మెలోడ్రామాగా అనిపించినా, పెద్ది పడే కష్టాలు, ఆ ఊరి పరిస్థితులు వాస్తవికతకు దగ్గరగా ఉంటూ ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచాయి. జాన్వీ కపూర్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తుంది.

పుట్టుకతో రావాల్సిన హక్కుల కోసం

దర్శకుడు బుచ్చిబాబు సాన ఒక సీరియస్ సామాజిక అంశాన్ని కమర్షియల్ ఫార్మాట్‌లో చెప్పడంలో చాలా వరకు విజయం సాధించారు. దేశంలో ఒక సామాన్యుడు తన పుట్టుకతో రావాల్సిన హక్కుల కోసం ఎంత కోల్పోవాలి, ఎంతలా తెగించాలనే ప్రశ్నలను ఈ సినిమా సంధిస్తుంది.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు పండాయి. పాతకాలపు మాస్ మసాలా సీన్లపై ఆధారపడకుండా ఉంటే సినిమా ఇంకా బెటర్‌గా ఉండేది. ఫైనల్‌గా చెప్పాలంటే, రామ్ చరణ్ నటన కోసం, బుచ్చిబాబు నిజాయితీ గల ప్రయత్నం కోసం పెద్దిని థియేటర్‌లో చూడవచ్చు.

రేటింగ్: 3.5/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More