Podarillu October 17 Episode: పొదరిల్లు.. జమునను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహా.. జమున బ్లాక్‌మెయిల్.. కన్నా పంచాయితీ

Podarillu Serial October 17th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 17 ఎపిసోడ్ లో జమున దొంగతనం చేస్తూ మహాకు అడ్డంగా దొరికిపోతుంది. అయితే కన్నాను అడ్డు పెట్టుకొని ఇంట్లో వాళ్లను జమున బ్లాక్‌మెయిల్ చేస్తుంది.

Published on: Oct 17, 2026, 06:53:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ రక్తి కట్టించింది. రెండో భర్తతో జమున నారాయణకు దొరికిపోవడం, అతన్ని చెప్పుతో కొట్టి తరిమేయడం, తర్వాత జమునను కొట్టబోతే కన్నా అడ్డుపడి గొడవకు దిగడం, తర్వాత డబ్బుతో ఉడాయించడానికి ప్లాన్ చేసి మహాకు జమున దొరికిపోయే సీన్లతో చాలా రసవత్తరంగా సాగింది.

పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 17 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 17 ఎపిసోడ్

శైలుకి గుడ్ న్యూస్ చెప్పిన కేశవ.. అలిగి వెళ్లిపోయిన శైలు

శైలుకి ఫోన్ చేసి ఆమె కోసం కేశవ ఎదురు చూసే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 17) ఎపిసోడ్ మొదలైంది. శైలు రాగానే గుడ్ న్యూస్ అంటూ ఆమెకు స్వీట్ తినిపించి ఈ షాపును కొనడానికి డబ్బు సర్దుబాటు అయిందని చెబుతాడు. అదో పెద్ద గుడ్ న్యూసా అన్నట్లు శైలు తీసి పారేస్తుంది. అదేంటని కేశవ అసిస్టెంట్ అడిగితే.. తనకు నేను ఈ పని చేయడమే ఇష్టం లేదు.. ఈ మెకానిక్ ను ప్రేమించింది కానీ షాపు మాత్రం వద్దట.. అలా అయితే ఏ ఐఏఎస్ నో పెళ్లి చేసుకోవచ్చు కదా అని కేశవ అంటాడు.

అది సరే కానీ అసలు డబ్బు ఎలా వచ్చింది అని శైలు అడుగుతుంది. తన ఇంట్లో వాళ్లే చేశారని కేశవ అంటాడు. ఎప్పుడూ తన్నుకుచస్తుంటారు.. మీ మధ్య అంత ప్రేమ ఉందా అని శైలు అంటుంది. మహా వల్లే ఇదంతా జరిగిందని, ఆమె రేయింబవళ్లు కష్టపడి రూ.1.5 లక్షలు ఇచ్చిందని, చివరికి తన నాన్న కూడా రూ.30 వేలు ఇచ్చాడని చెబుతాడు. అది విని అంటే నేను తప్ప నీ ఇంట్లో వాళ్లందరూ ఇచ్చారని దెప్పి పొడుస్తున్నావా అని గొడవ పడి, అలిగి వెళ్లిపోతుంది.

అన్న రమణయ్యతో నారాయణ గొడవ..

మరోవైపు నారాయణ అన్న రమణయ్య తన ఫ్రెండ్స్ తో కలిసి టీ తాగుతుంటాడు. మీ తమ్ముడి రెండో భార్య తిరిగి వచ్చిందటగా పార్టీ లేదా అని అడుగుతారు. నేనెందుకు ఇస్తాను.. వాడే వచ్చాడు అడగండి అని రమణయ్య అంటాడు. నారాయణను కూడా ఫ్రెండ్స్ అదే అడుగుతారు. మొదటి భార్యను చంపేశాడు.. రెండో భార్య వదిలేసి వెళ్లింది.. ఇప్పుడు వీడి దగ్గరికి వచ్చి ఏం సుఖ పడుతుంది.. ఆమె కర్మ అన్నట్లుగా రమణయ్య మాట్లాడతాడు. దీంతో అన్నతో నారాయణ గొడవ పడతాడు. కళ్లలోకి చూస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

డబ్బు కోసం జమున వెతుకులాట.. ఇంటికి వచ్చిన రెండో భర్త

మరోవైపు ఇంట్లో వాళ్లు దాచిన డబ్బు, కన్నా ఉంగరం కోసం జమున ఇంట్లో వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఆమె రెండో భర్త వచ్చి ఫోన్ చేస్తాడు. ఇంటి ముందే ఉన్నానని చెప్పడంతో ఆమె కంగారు పడుతూ బయటకు వస్తుంది. ఆ బండోడికి నువ్వు తెలుసు.. చూస్తే చంపేస్తాడు అని అంటుంది. ఏమైనా గిట్టుబాటు అయిందా అని అడిగితే.. అది అయితే నేనే తీసుకొని వస్తాను నువ్వు వెళ్లు అని అంటుంది. ఆ తాగుబోతోడు చూశాడంటే ఇక అంతే సంగతులు అని భయపడుతుంది.

చెప్పుతో కొట్టి తరిమేసిన నారాయణ

ఇంతలో నారాయణ వస్తాడు. దూరం నుంచే జమునను తన రెండో భర్తతో కలిసి చూస్తాడు. సైకిల్ పడేసి పరుగెత్తుకుంటూ వస్తాడు. అతన్ని చూసి జమున ఇంట్లోకి పారిపోగా.. ఆమె రెండో భర్త కూడా భయంతో ఇంట్లోకి దూరుతాడు. నారాయణ అతని వెంట పడతాడు. కానీ అతడు వెనుక దారి నుంచి వెళ్లిపోతాడు. బండి స్టార్ట్ చేసి వెళ్లిపోతుండగా.. నారాయణ తన చెప్పుతో అతన్ని కొడతాడు. మళ్లీ ఇక్కడ కనిపిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు.

జమునపై విరుచుకుపడిన నారాయణ

ఆ తర్వాత జమునపై నారాయణ విరుచుకుపడతాడు. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్లిపో.. లేదంటే నిన్ను శవంగా పంపిస్తానని బెదిరిస్తాడు. దీంతో జమున భయపడుతూ బయటకు వస్తుంది. తన కొడుకుకు చెప్పి వెళ్లిపోతానని అంటుంది. వాడు వద్దంటాడని తెలిసి నాటకాలా.. ఇంట్లో వాళ్లు రాకముందే వెళ్లిపో అని నారాయణ స్పష్టం చేస్తాడు. ఏడాది వయసున్నప్పుడే కన్నాను వదిలేసి వాడితో వెళ్లిపోయావు.. ఇప్పుడు మళ్లీ ఏం ముఖం పెట్టుకొని వచ్చావంటూ నిలదీస్తాడు. అసలు వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడని అడిగితే.. వాడు తాగుబోతోడు.. తాగడానికి డబ్బుల కోసం వచ్చి సతాయిస్తాడని అంటుంది. కానీ నారాయణ నమ్మడు.

తండ్రితో గొడవ పడిన కన్నా

జమున వెంట పడి కర్రతో కొట్టడానికి వెళ్తాడు. అతని నుంచి తప్పించుకొని జమున అటూఇటూ తిరుగుతుంది. ఇంతలో కన్నా ఇంటికి వస్తూ దూరం నుంచి చూసి పరుగెత్తుకుంటూ వెళ్తాడు. జమునకు అండగా నిలుస్తాడు. తండ్రితో గొడవ పడతాడు. నా కొడుకును వదిలి వెళ్లను.. ఇక నుంచి చావైనా బతుకైనా అతనితోనే అని కన్నా ముందు కావాలని జమున అంటుంది.

దీంతో నారాయణ మరింత ఆవేశంతో జమున గొంతు పట్టుకుంటాడు. కన్నా బలవంతంగా విడిపించి.. మా అమ్మ ఇక్కడే ఉంటుంది.. ఇష్టం లేకపోతే నువ్వే ఇల్లు వదిలేసి వెళ్లిపో.. అయినా ఈ తాగుబోతోడితో మనకెందుకు.. లోనికి వెళ్దాం అని తల్లిని తీసుకొని వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ నారాయణను ఓ కన్నింగ్ లుక్ తో చూస్తుంది జమున.

నారాయణకే మహా సపోర్ట్.. జమునను నిలదీసి..

ఇంట్లో వాళ్లందరూ వచ్చిన తర్వాత జరిగిన విషయం చెబుతారు కన్నా, జమున. చివరిగా మహా కూడా వస్తుంది. ఆమెకు కూడా జరిగింది చెప్పగా.. నారాయణకు మద్దతుగా మహా మాట్లాడుతుంది.

అందులో ఆయన తప్పేం లేదు.. మొదట నేను ఇంటికి వచ్చినప్పుడు భార్యను చంపాడని తెలిసి భయపడ్డాను.. కానీ ఇన్నాళ్లుగా చూస్తున్నాను.. ఆయన అలాంటి వ్యక్తి కాదు.. కొడుకులనే ఏమీ అనని వాడు మిమ్మల్ని మాత్రం ఎందుకు అంటున్నాడు.. మీరంటే ఎందుకంత కోపం.. అసలు మీరేం చేశారు.. ఇద్దరూ ఏదో దాస్తున్నారు.. అసలు నిజం చెప్పడం లేదు అని జమునను మహా నిలదీస్తుంది.

జమున బ్లాక్‌మెయిల్

కానీ ఈ తాగుబోతోడిని తట్టుకోలేకే తాను వెళ్లానని జమున చెబుతుంది. ఆయన పగటి పూట తాగడం మానేశాడని, అయినా తాగినా ఎవరినీ ఏమీ అనడని, కన్నాను ఒక్క మాట కూడా అనడం చూడలేదని మహా అంటుంది. దీంతో జమున బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతుంది. అనవసరంగా ఇంటికి వచ్చానని, అతడు ఏమీ మారలేదని, ఈసారి ఇంటి నుంచి వెళ్తే తన కొడుకును తీసుకొనే వెళ్తానని అనడంతో అందరూ షాక్ తింటారు.

మహాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన జమున

ఆ తర్వాత రాత్రి అందరూ పడుకున్న తర్వాత జమునకు రెండో భర్త ఫోన్ చేస్తాడు. డబ్బు చేతికి రాగానే ఉడాయిద్దామని ఆమె చెబుతుంది. తర్వాత మెల్లగా గదిలోకి వెళ్లి ఆ డబ్బు ఉన్న కవర్ తీస్తుంది. ఆమెను గమనిస్తూనే ఉన్న మహా.. వెంట వెళ్తుంది. బ్యాగులో డబ్బు చోరీ చేస్తుండగా చూస్తుంది. దీంతో జమునకు ముచ్చెమటలు పడతాయి. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More