నువ్వు నిజంగానే హీరో మెటీరియల్.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. ఐదు రోజుల్లో ఎంతంటే?
ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ కు చేరువైంది. నువ్వు అసలు హీరో మెటీరియలేనా అన్న ప్రశ్నకు ప్రదీప్ ఈ వసూళ్ల ద్వారానే సమాధానం చెబుతున్నట్లుగా ఉంది.
దీపావళి సందర్భంగా విడుదలైన మూవీ 'డ్యూడ్'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన ఈ మూవీ కేవలం 5 రోజుల్లోనే రూ.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిన ఈ వివరాలు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి.

డ్యూడ్ కలెక్షన్ల సునామీ
కీర్తిశ్వరన్ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ఈ 'డ్యూడ్' (Dude). దీంట్లో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది. అతి త్వరలోనే ఈ మూవీ రూ.100 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
'డ్యూడ్' సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తమ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్లు వసూలు చేసినట్లు వాళ్లు తెలిపారు. ప్రదీప్ రంగనాథన్ కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణాన్ని 'డ్యూడ్' కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో డ్యూడ్ రూ.95 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది" అని వెల్లడించారు.
నిర్మాణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.66 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత నాలుగో రోజుకు అంటే దీపావళి సెలవు దినం కావడంతో కలెక్షన్లకు బాగా కలిసొచ్చింది. దీంతో నాలుగో రోజు కలెక్షన్లు కలుపుకొని రూ.83 కోట్లకు చేరుకున్నాయి.
అయితే ట్రేడ్ వెబ్‌సైట్ sacnilk రిపోర్టు ప్రకారం 'డ్యూడ్' ఇండియాలో రూ.50.3 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మంగళవారం (అక్టోబర్ 21) కలెక్షన్లలో కొద్దిగా తగ్గుదల కనిపించింది.
'లవ్ టుడే', 'డ్రాగన్'ను దాటి..
కథనంపై విమర్శలు ఉన్నప్పటికీ 'డ్యూడ్' బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇస్తోంది. ఈ సినిమా 2022లో వచ్చిన 'లవ్ టుడే', 2025లో విడుదలైన 'డ్రాగన్' సినిమాల కలెక్షన్లను అధిగమించింది. 'లవ్ టుడే' ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.19.90 కోట్లు వసూలు చేసింది.
ఇక 'డ్రాగన్' అయితే ఐదు రోజుల్లో రూ.64.50 కోట్లు సాధించింది. ఈ సినిమాల పూర్తి లైఫ్ టైం కలెక్షన్లు చూస్తే 'లవ్ టుడే' రూ.83.55 కోట్లు, 'డ్రాగన్' రూ.150.52 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేశాయి. మరి 'డ్యూడ్' సినిమా 'డ్రాగన్' సినిమా వసూళ్లను అధిగమిస్తుందో లేదో చూడాలి.
'డ్యూడ్' కథ గురించి..
'డ్యూడ్' సినిమా కథ కజిన్స్ అయిన అగన్ (ప్రదీప్), కురల్ (మమితా) చుట్టూ తిరుగుతుంది. అగన్ తల్లి పార్వతి (రోహిణి), కురల్ తండ్రి మంత్రి అథియామాన్ అళగప్పన్ (శరత్‌కుమార్) మధ్య గొడవలు ఉన్నప్పటికీ.. అగన్, కురల్ కలిసి పెరుగుతారు. కురల్ పెళ్లి కోసం అగన్‌ను అడిగినప్పుడు పాత కుటుంబ రహస్యాలు బయటకు వస్తాయి.
వాళ్ల నిజ స్వరూపాలు బయటపడతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ల పెళ్లి జరిగిందా లేదా అన్నది ఈ డ్యూడ్ మూవీలో చూడొచ్చు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా దూసుకెళ్తుండటం విశేషం. మూవీ రిలీజ్ కు ముందే అసలు మీరు హీరో మెటీరియలేనా అనే ప్రశ్నలకు ప్రదీప్ రంగనాథన్ తన వసూళ్ల ద్వారానే సమాధానం చెబుతున్నట్లుగా ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


