ప్రకాష్ రాజ్ వర్సెస్ ది కేరళ స్టోరీ 2 డైరెక్టర్: మాటకు మాట.. బీఫ్, పోర్క్ విషయంలో యుద్ధం
ది కేరళ స్టోరీ మూవీ విషయంలో డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ సింగ్, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. మూవీ టీజర్ లో ఓ అమ్మాయికి బీఫ్ ను బలవంతంగా తినిపిస్తున్న సీన్ పై ఈ ఇద్దరూ మాటా మాటా అనుకుంటున్నారు.
'ది కేరళ స్టోరీ 2' మూవీ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ సినిమాలో ఒక హిందూ యువతితో ముస్లిం కుటుంబం బలవంతంగా బీఫ్ (గొడ్డు మాంసం) తినిపించే సీన్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన నటుడు ప్రకాష్ రాజ్ ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా, చిత్ర దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ ఆయనను 'మేధోపరమైన దివాలాకోరు' అని తీవ్రంగా విమర్శించాడు. తాజాగా దర్శకుడి వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ పరోక్షంగా, తనదైన శైలిలో చురకలు అంటించాడు.

ప్రకాష్ రాజ్ తాజా పోస్ట్
హిందీ మూవీ 'ది కేరళ స్టోరీ 2' ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఒక సీన్ లో ఓ అమ్మాయి చేత బలవంతంగా బీఫ్ (Beef) తినిపించే సీన్ ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. ఈ వివాదం ఇప్పుడు సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
సోమవారం (ఫిబ్రవరి 23) నాడు ప్రకాష్ రాజ్ తన 'ఎక్స్' ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను పంచుకున్నాడు. అందులో శాకాహారులు, మాంసాహారుల ఆహార ప్రాధాన్యతలకు సంబంధించిన ఒక జాబితాను అతడు షేర్ చేశాడు.
ఈ జాబితాలో వీగన్స్ (Vegans), వెజిటేరియన్స్, ఎగటేరియన్స్ (గుడ్లు మాత్రమే తినేవారు), పంది మాంసం తినని మాంసాహారులు, బీఫ్ తినని మాంసాహారులు, అన్ని రకాల మాంసం తినేవారు, కేవలం చేపలు మాత్రమే తినే మాంసాహారులు.. ఇలా రకరకాల ఆహారపు అలవాట్లు ఉన్న వ్యక్తుల గురించి ప్రస్తావించాడు.
"మనమంతా ఒకే సమాజంలో కలిసిమెలిసి సామరస్యంగా జీవించడం కొనసాగిద్దాం" అని ఆ నోట్‌లో రాసి ఉంది. ఆ ఫోటోను షేర్ చేస్తూ.. "ఇంత సింపుల్‌గా ఉన్న విషయాన్ని ఎందుకంత కాంప్లికేట్ (సంక్లిష్టం) చేయడం?" అని రెడ్ హార్ట్ ఎమోజీలను జోడించి క్యాప్షన్ ఇచ్చాడు.
దీనికి ముందు చేసిన మరో పోస్ట్‌లో ప్రకాష్ రాజ్.. పంది మాంసం, బీఫ్, చేపల వంటకాల ఫొటోలను షేర్ చేస్తూ.. "పంది మాంసం, బీఫ్, చేపలు.. ఇలా అన్నీ కూడా పక్కా శాకాహార వంటకాలతో పాటు కలిసిమెలిసి ఉండేదే అసలైన కేరళ స్టోరీ. దయచేసి ఆస్వాదించండి, హ్యాపీ సండే" అని రాసుకొచ్చాడు.
దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ విమర్శలు
ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై చిత్ర దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
"ప్రకాష్ రాజ్ గారు చాలా గొప్ప స్థాయి నటుడని నేను అనుకునేవాడిని. కానీ ఒక మనిషిగా ఆయన అంతే దిగజారిపోయారని ఇప్పుడు నాకు అనిపిస్తోంది" అని అతడు ఘాటుగా విమర్శించాడు.
"ఆయన ఏం తింటారో నాకు తెలియదు. అది నాకు అనవసరం కూడా. కానీ ఆయన మాటలు ఆయన ఏమి తింటున్నారో ప్రతిబింబిస్తున్నాయి. అయితే నాకు చెప్పండి.. మన ఆడబిడ్డల చేత బలవంతంగా బీఫ్ తినిపించి, మత మార్పిడి చేస్తున్నారన్నది నిజమా కాదా? అది నిజమైతే ప్రకాష్ రాజ్ గారి మనస్సాక్షిని నేను ప్రశ్నిస్తున్నాను. దీన్ని ఎప్పటికీ అంగీకరించలేము. మతం మార్చడం కోసం ఒకరితో బలవంతంగా బీఫ్ తినిపించడాన్ని భారతదేశంలోని నాగరిక సమాజం ఎప్పటికీ అంగీకరించదు. ఆయన మేధోపరంగా దివాలా తీశారు" అని సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ది కేరళ స్టోరీ 2 విశేషాలు
బలవంతపు మత మార్పిడి ముఠాల వలలో చిక్కుకున్న యువతుల కథాంశంతో వస్తున్న 'ది కేరళ స్టోరీ 2' సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి 'U/A' సర్టిఫికేట్ లభించింది. భారత న్యాయవ్యవస్థలోని నిజమైన కేసుల ఆధారంగానే తాము ఈ సినిమాను తెరకెక్కించామని మేకర్స్ చెబుతున్నారు. ఈ వివాదాస్పద చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


