ఈ సినిమాలో ఏదైనా తప్పుగా చూపించినట్లు నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేస్తా.. ఇక సినిమాలు చేయను: ది కేరళ స్టోరీ 2 డైరెక్టర్
ది కేరళ స్టోరీ 2 మూవీపై వస్తున్న విమర్శలపై డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. ఒకవేళ ఈ మూవీలో ఏదైనా తప్పు చూపించినట్లు నిరూపిస్తే తాను మొత్తం సినిమాలనే వదిలేస్తానని సవాలు విసిరాడు.
బలవంతపు మత మార్పిడుల నేపథ్యంలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ 2' మూవీ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాలో తప్పుడు విషయాలు చూపించారని, ఇదొక ప్రాపగాండా మూవీ అని వస్తున్న విమర్శలపై దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. డాక్యుమెంటరీలు తీసిన అనుభవంతో, లోతైన పరిశోధన తర్వాతే ఈ సినిమా తీశానని.. ఇందులో ఏమైనా తప్పు ఉందని నిరూపిస్తే తాను సినిమాలు తీయడం మానేస్తానని ఆయన సవాల్ విసిరాడు.

విమర్శలకు బదులిచ్చిన జాతీయ అవార్డు గ్రహీత..
కేరళలో జరిగిన బలవంతపు మత మార్పిడులు, చిత్రహింసలకు గురైన ముగ్గురు యువతుల కథతో వస్తున్న బాలీవుడ్ మూవీ ‘ది కేరళ స్టోరీ 2’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇందులో చూపించిన అంశాలు అతిశయోక్తిగా ఉన్నాయని, ఇదొక ప్రాపగాండా అని పలువురు రాజకీయ నాయకులు, ఇతర సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు.
ఈ విమర్శలపై జాతీయ అవార్డు గ్రహీత, ఈ చిత్ర దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ (Kamakhya Narayan Singh) నేరుగా స్పందించాడు. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో అతడు మాట్లాడాడు.
"నేను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌ను. నేను ఎప్పుడూ సమాజంలోని సామాజిక రుగ్మతలు, సమస్యలను ఎత్తిచూపే డాక్యుమెంటరీలు, సినిమాలనే రూపొందించాను. నా సినిమాలు ఎప్పుడూ ప్రశ్నలు లేవనెత్తుతాయి. చుట్టూ ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించేలా చేస్తాయి. అందుకే ఏదైనా సినిమా లేదా డాక్యుమెంటరీని విడుదల చేయడానికి ముందు, ఆ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నేను ఎంతో లోతైన పరిశోధన చేస్తాను. ఈ సినిమాకు కూడా అంతే స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేశాను," అని వివరించాడు.
"తప్పుంటే సినిమాలు మానేస్తాను.."
ఈ సినిమాలో చూపించిన విషయాల పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని దర్శకుడు కామాఖ్య నారాయణ్ స్పష్టం చేశాడు. "నన్ను నమ్మండి, నేను నా పనిని పూర్తి చిత్తశుద్ధితో, నిజాయితీగా చేశాను. ఈ సినిమాలో మేము ఏమైనా తప్పుగా చూపించామని నిరూపిస్తే.. నేను ఇకపై సినిమాలు తీయడమే మానేస్తాను" అని ఆయన బల్లగుద్ది మరీ చెప్పాడు.
కేరళ సీఎం విమర్శలు
మరోవైపు ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ సినిమా లౌకికవాదానికి ముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే చిత్ర నిర్మాతలు మాత్రం తమ సినిమా ఏ రాష్ట్రానికీ వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు.
నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా గతంలో మాట్లాడుతూ.. "మేము కేరళను టార్గెట్ చేయడం లేదు. కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ. ఆ రాష్ట్రంలో ఉన్న ఈ మత మార్పిడులనే దుష్టశక్తి వీలైనంత త్వరగా అంతం కావాలన్నదే మా కోరిక" అని స్పష్టం చేశాడు.
'ది కేరళ స్టోరీ 2' విశేషాలు..
ఈ సినిమా నిజమైన కోర్టు కేసుల ఆధారంగా రూపొందిందని మేకర్స్ చెబుతున్నారు. హిందుస్థాన్ టైమ్స్ కి ఇచ్చిన ఒక ప్రకటనలో నిర్మాత విపుల్ షా మాట్లాడుతూ.. "ప్రజల్లో అవగాహన పెంచడం, వాస్తవాలను తెలియజేయడం, యువత అప్రమత్తంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకునేలా వారిని సాధికారపరచడమే మా ప్రధాన లక్ష్యం" అని వివరించాడు.
మత మార్పిడి, బలవంతపు పరిస్థితుల ఇతివృత్తంగా 'ది కేరళ స్టోరీ 2' తెరకెక్కింది. దీని కథ కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాకుండా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నేపథ్యంలో కూడా సాగనుంది. ఇందులో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


