IPL 2026: కోచ్ పై ప్రీతి జింటా సీరియస్.. చేతులు కట్టుకుని, తల వంచుకుని రికీ పాంటింగ్.. ఫొటోలు వైరల్

IPL 2026: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ వరుస ఓటములు ఆ జట్టులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ధర్మశాల వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్ అనంతరం ఫ్రాంఛైజీ ఓనర్ ప్రీతి జింటా, కోచ్ రికీ పాంటింగ్ మధ్య జరిగిన చర్చ వైరల్ గా మారింది.

Updated on: May 15, 2026, 08:37:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి చూస్తుంటే 'మొదటి సగం అద్భుతం.. రెండో సగం అగాధం' అన్నట్లుగా ఉంది. సీజన్ తొలి అర్ధభాగంలో ఆరు విజయాలతో అజేయంగా దూసుకుపోయిన పంజాబ్, ఒక్కసారిగా కుప్పకూలింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు ఇప్పుడు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా, కోచ్ రికీ పాంటింగ్ ఫొటోలు వైరల్ గా మారింది.

ప్రీతి జింటా, రికీ పాంటింగ్
ప్రీతి జింటా, రికీ పాంటింగ్

హాట్ టాపిక్ గా

సాధారణంగా ఏదైనా జట్టు వరుసగా ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు మైదానంలో ఉండే ఆటగాళ్ల కంటే, వెనుక ఉండి వ్యూహాలు రచించే కోచ్‌లు, మేనేజ్‌మెంట్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ధర్మశాలలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఐదో ఓటమిని చవిచూసిన తర్వాత ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైదానంలో విఫలమవగా, డగౌట్‌లో టీమ్ ఓనర్ ప్రీతి జింటా, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మధ్య వీడియో , ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రీతి జింటా సీరియస్

మ్యాచ్ ముగిసిన తర్వాత బ్రాడ్‌కాస్ట్ కెమెరాలు ఒక ఆసక్తికర దృశ్యాన్ని బంధించాయి. గంభీరమైన ముఖంతో ఉన్న ప్రీతి జింటా, కోచ్ రికీ పాంటింగ్‌తో ఏదో సీరియస్ చర్చలో నిమగ్నమై కనిపించారు. పాంటింగ్ కూడా నీరసంగా తలదించుకుని, చేతులు కట్టుకుని ఆమె మాటలను వినడం చూస్తుంటే, జట్టు వైఫల్యంపై యజమాని గట్టిగానే నిలదీసినట్లు అర్థమవుతోంది.

వీరి మధ్య ఏం సంభాషణ జరిగిందనేది అధికారికంగా తెలియకపోయినా.. "జట్టు ఎక్కడ తప్పు చేస్తోంది? అసలు ప్లాన్ ఏంటి?" అనే అంశాలపైనే చర్చ జరిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పెరిగిన ఒత్తిడి

నిజానికి ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు, స్టాఫ్‌తో ప్రీతి జింటాకు చాలా మంచి అనుబంధం ఉంది. 2025లో పాంటింగ్ కోచింగ్, శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈ జట్టు ఫైనల్ చేరినప్పుడు వాతావరణం అంతా ఉత్సాహంగా ఉండేది. కానీ, ఇప్పుడు వరుస ఓటములు ఆ సంతోషాన్ని ఆవిరి చేశాయి.

గతంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, కేఎల్ రాహుల్‌ను మైదానంలోనే మందలించిన ఘటన మనకు తెలిసిందే. ప్రీతి జింటా అంత కఠినంగా వ్యవహరించకపోయినా, తాజా ఓటమి ఆమెను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు స్పష్టమవుతోంది.

చేజారిన విజయాలు

హిమాలయాల చెంతన ఉన్న ధర్మశాలలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ పరాజయం పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 210 పరుగులు, ముంబైపై 200 పరుగులు చేసినప్పటికీ బౌలర్లు ఆ లక్ష్యాలను కాపాడుకోలేకపోయారు. ఢిల్లీతో మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ విరుచుకుపడగా.. ముంబైతో జరిగిన పోరులో తిలక్ వర్మ, విల్ జాక్స్ ఆఖర్లో విధ్వంసం సృష్టించారు. గెలవాల్సిన మ్యాచ్‌లను ఆఖరి ఓవర్లలో చేజార్చుకోవడం పంజాబ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తమ తప్పులను సరిదిద్దుకుని మళ్ళీ గెలుపు బాట పట్టకపోతే, ఈ సీజన్ పంజాబ్ ఆశలు ఆవిరి కావడం ఖాయంగా కనిపిస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

జవాబు: పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. సీజన్ ప్రారంభంలో ఆరు విజయాలు సాధించినప్పటికీ, ప్రస్తుతం 13 పాయింట్ల వద్దే నిలిచిపోయింది.

ప్రశ్న: ప్రీతి జింటా, రికీ పాంటింగ్ మధ్య చర్చ ఎందుకు జరిగింది?

జవాబు: జట్టు వరుస ఓటములపై అసంతృప్తితో ఉన్న యజమాని ప్రీతి జింటా, జట్టు వైఫల్యాలకు గల కారణాలను కోచ్ పాంటింగ్‌ను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రశ్న: ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఎంత స్కోరు చేసింది?

జవాబు: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 200 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ ఓటమిని తప్పించుకోలేకపోయింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More