50 ఏళ్ల సినీ కెరీర్.. ఫ్యామిలీతో రజనీకాంత్ ఫొటో.. స్పెషల్ అట్రాక్షన్ గా ధనుష్ కొడుకులు.. యాత్ర, లింగాను చూశారా?
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్ఫి) ఈవెంట్ లో రజనీకాంత్ ను ఘనంగా సన్మానించారు. ఈ ఈవెంట్ కు ముందు తన ఫ్యామిలీతో రజనీకాంత్ దిగిన ఫొటో వైరల్ గా మారింది. ఇందులో ధనుష్ కొడుకులను మీరు చూశారా?
భారతీయ సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ను 56వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం (IFFI) ఘనంగా సన్మానించింది. అభిమానులు ‘తలైవర్’ అని ముద్దుగా పిలుచుకునే 74 ఏళ్ల రజనీకాంత్‌కు.. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, సమాచార, ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, నటుడు రణ్‌బీర్ సింగ్ సమక్షంలో శాలువా, జ్ఞాపికను అందజేశారు.

రజనీకాంత్ గానే
ఈ సత్కారానికి కేంద్ర ప్రభుత్వానికి రజనీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తన కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా, నటన అంటే తనకు ఎంతో ఇష్టమని రజనీకాంత్ చెప్పారు. 50 ఏళ్ల ప్రస్థానం తనకు 10-15 ఏళ్లుగా అనిపిస్తుందని రజనీకాంత్ అన్నారు. "వంద జన్మలెత్తినా రజనీకాంత్‌గానే పుట్టాలని కోరుకుంటా" అని ఆయన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఫ్యామిలీ ఫొటో
ఇఫ్ఫి ముగింపు వేడుకలకు ముందు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో కుటుంబ ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో రజనీకాంత్, ఆయన భార్య లత, ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య కనిపిస్తున్నారు. ముదురు నీలం రంగు షర్ట్, బూడిద రంగు ప్యాంట్‌లో ప్రతిష్టాత్మక వేడుక కోసం రజనీకాంత్ రెడీ అయ్యారు.
ధనుష్ కొడుకులు
సౌందర్య రజనీకాంత్ పోస్ట్ చేసిన రజనీకాంత్ ఫ్యామిలీ పిక్ లో ధనుష్ కొడుకులు కూడా ఉన్నారు. రజనీకాంత్ మనవళ్లు కూడా అయిన యాత్ర రాజా, లింగా ఈ ఫొటోలో స్పెషల్ గా నిలిచారు. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, ధనుష్ ల పెళ్లి 2004లో జరిగింది. 2006లో వీళ్లకు యాత్ర రాజా, 2010లో లింగ రాజా పుట్టారు. 2022లో విడిపోతున్నట్లు ధనుష్, ఐశ్వర్య ప్రకటించారు.
50 ఏళ్ల కెరీర్
బస్ కండక్టర్ నుంచి కోట్లాది అభిమానుల ఆరాధ్య హీరోగా మారారు రజనీకాంత్. ఆయన నట ప్రయాణం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇఫ్ఫి ముగింపు వేడుకల్లో భాగంగా ఈ సన్మానం జరిగింది. రజనీకాంత్ తన అసమానమైన కృషికి గాను కేవలం తమిళ చిత్రాలకే కాకుండా హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలకు కూడా గుర్తింపు పొందారు.
గత ఐదు దశాబ్దాలలో 170కి పైగా చిత్రాలలో నటించిన రజనీకాంత్.. దాదాసాహెబ్ ఫాల్కే (2020), పద్మ భూషణ్ (2000), పద్మ విభూషణ్ (2016) వంటి అనేక అవార్డులు అందుకున్నారు. చివరగా ఈ ఏడాది వచ్చిన కూలీ సినిమాలో తన స్టైలిష్ యాక్టింగ్ తో అదరగొట్టారు. ఇప్పుడు జైలర్ 2లో నటిస్తున్నారు. ఇది ఆయన సూపర్ హిట్ మూవీ జైలర్ కు సీక్వెల్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


