Ram Charan: చివరి శ్వాస వరకూ అలరిస్తుంటా..పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ స్పీచ్ వైరల్..ఈ మూవీ అంత స్పెషల్ ఎందుకు?
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చరణ్ స్పీచ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లను కూడా రామ్ చరణ్ ప్రస్తావించాడు. ఈ మూవీ రామ్ చరణ్ కు ఎందుకంత స్పెషలో ఇక్కడ చూసేయండి.
Ram Charan: గత కొన్ని రోజులుగా దేశాన్ని ‘పెద్ది’ మూవీ మేనియా ఓ తుపానులా తాకుతోంది. ఎక్కడ చూసినా పెద్ది పేరు మాత్రమే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఇదే ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ జోష్ ను మరింత పెంచేలా సోమవారం (జూన్ 1) రాత్రి పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ స్పీచ్ వైరల్ గా మారింది.

రామ్ చరణ్ స్పీచ్
పెద్ది రోర్ పేరుతో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ చాలా కాన్పిడెంట్ గా మాట్లాడాడు. విజయవాడలో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్ కు తరలివచ్చిన జనసందోహాన్ని, వారి ఉత్సాహాన్ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు. "ఇది సినిమా రిలీజ్‌కు ముందు జరుగుతున్న వేడుకలా లేదు, సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత జరుపుకునే సక్సెస్ మీట్‌లా కనిపిస్తోంది" అని చరణ్ పేర్కొన్నాడు.
విజయవాడ సిటీతో
ఈ సందర్భంగా విజయవాడ నగరంతో తన కుటుంబానికి ఉన్న ఎమోషనల్ అనుబంధాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గుర్తు చేసుకున్నాడు. "మా కుటుంబానికి విజయవాడ ఎంతో అదృష్టాన్ని తెచ్చిన నగరం. నాన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల విజయోత్సవాలు ఇక్కడే జరిగాయి. ఆ సెంటిమెంట్‌ను, అదృష్టాన్ని ముందుకు తీసుకెళ్లడానికే మేము ఇక్కడికి వచ్చాం" అని చరణ్ తెలిపాడు.
దశాబ్దానికి ఒకే ఒక్క కథ
తన సినీ ప్రస్థానంలో ‘పెద్ది’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశాడు. "ఒక నటుడిగా నేను ఎన్నో కథలు వింటుంటాను. కానీ 'పెద్ది' నా హృదయాన్ని బలంగా తాకింది. ఇది దశాబ్దానికి ఒకసారి మాత్రమే వచ్చే అద్భుతమైన కథ. ఈ ప్రాజెక్ట్‌ను నా ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సాన గురువు సుకుమార్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా. నా సినీ ప్రస్థానంలో ఈ సినిమా ఒక శాశ్వత ఆస్తిలా మిగిలిపోతుంది" అని చరణ్ వివరించాడు.
ఆ సినిమాల తర్వాత
కేవలం ఒక వ్యక్తి ఎదుగుదల మాత్రమే కాకుండా, కిందపడిపోయిన ఒక మనిషి తిరిగి ఎలా పోరాడి తన కాళ్లపై నిలబడ్డాడు అనేదే పెద్ది చిత్ర ప్రధాన కథాంశమని రామ్ చరణ్ హింట్ ఇచ్చాడు. మగధీర, రంగస్థలం, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల తర్వాత, ప్రతిరోజూ షూటింగ్‌కు వెళ్లాలనే కొత్త ఉత్సాహాన్ని, ఆసక్తిని కలిగించిన ఏకైక సినిమా ‘పెద్ది’ మాత్రమేనని చరణ్ స్పష్టం చేశాడు.
బుచ్చిబాబు విజన్
దర్శకుడు బుచ్చిబాబు సాన ప్రతిభను చరణ్ ఆకాశానికి ఎత్తేశాడు. "నా మాటలు గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో బుచ్చిబాబు భారతదేశంలోని టాప్ 3 లేదా 4 దర్శకులలో ఒకరిగా ఖచ్చితంగా నిలుస్తాడు" అని చరణ్ మరోసారి చెప్పాడు. ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను బుచ్చిబాబు తెరకెక్కించిన విధానం అద్భుతమని కొనియాడాడు.
అలాగే అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, చిత్ర హీరోయిన్ జాన్వీ కపూర్‌పై చరణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. "జాన్వీని చూస్తుంటే నా పక్కన చందమామ ముక్క కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఆమెను చూసి శ్రీదేవి ఎక్కడున్నా ఎంతో గర్విస్తారు. జాన్వీ తన తల్లి కంటే పెద్ద స్టార్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చరణ్ చెప్పాడు.
చివరి శ్వాస వరకు
అభిమానుల పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంటూ చరణ్ ఒక పవర్‌ఫుల్ వాగ్దానం చేశాడు. "నేను సినిమాలు చేసేదే మీ కోసం. మిమ్మల్ని అలరించడానికి అవసరమైతే నా రక్తాన్ని ధారపోయడానికైనా సిద్ధం. చిరంజీవి కొడుకుగా, కల్యాణ్ బాబాయ్ అబ్బాయిగా పుట్టిన నాకు సినిమా తప్ప మరేమీ తెలియదు. నా చివరి శ్వాస వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను" అని చరణ్ భావోద్వేగంతో ముగించాడు.
పెద్ది రోర్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి తమ అభినందనలు తెలిపారు. ఎండ, వేడిని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి వేచి ఉన్న అభిమానులకు చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. పెద్ది జూన్ 4న రిలీజ్ కానుంది.
ఎందుకంత స్పెషల్?
పెద్ది సినిమాను మొదటి నుంచి తన భుజాలపై మోస్తున్నాడు రామ్ చరణ్. ఈ మూవీ స్పెషల్ అంటూ ప్రమోషన్లలో పదే పదే చెప్తున్నాడు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ కాన్ఫిడెంట్ గా స్పీచ్ ఇచ్చాడు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు చరణ్ బాగా కనెక్ట్ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం చెర్రీ మామూలుగా కష్టపడలేదు.
మూడు రకాల క్రీడల్లో పాల్గొనే ఆటగాడిగా తన బాడీని మార్చుకున్నాడు చరణ్. అందుకే ఈ సినిమా కోసం అతను ప్రాణాలు పెట్టాడు. ఇక గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తో నిరాశలో ఉన్న అభిమానులకు పెద్ది మూవీతో డబుల్ ట్రీట్ ఇవ్వాలని చరణ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈ మూవీ అతనికి చాలా ఎమోషనల్ గా మారిందని చెప్పొచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'పెద్ది' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది?
సమాధానం: ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో జరిగింది.
ప్రశ్న: 'పెద్ది' సినిమా దర్శకుడు ఎవరు?
సమాధానం: ఈ చిత్రానికి 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించాడు.
ప్రశ్న: ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కథానాయికగా ఎవరు నటించారు?
సమాధానం: దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


