Ramani Kalyanam Review: రమణి కళ్యాణం రివ్యూ- వీల్ చైర్ హీరో, చూపులేని హీరోయిన్- ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

Ramani Kalyanam Movie Review In Telugu: సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వినూత్న ప్రేమకథ రమణి కళ్యాణం నేడు (మే 22) థియేటర్లలోకి వచ్చింది. వైకల్యాన్ని జయించే ప్రేమికుల కథగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో నేటి రమణి కళ్యాణం రివ్యూలో తెలుసుకుందాం.

Published on: May 22, 2026, 09:35:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ramani Kalyanam Review And Rating: సున్నితమైన, హృదయానికి హత్తుకునే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ 'రమణి కళ్యాణం'. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ హీరో హీరోయిన్‌గా నటించారు. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమెడియన్ శ్రీనివాస రెడ్డి కీలక పాత్ర పోషించారు.

రమణి కళ్యాణం రివ్యూ- వీల్ చైర్ హీరో, చూపులేని హీరోయిన్- ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
రమణి కళ్యాణం రివ్యూ- వీల్ చైర్ హీరో, చూపులేని హీరోయిన్- ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

రమణి కళ్యాణం రివ్యూ

నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ బంధాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ప్రయత్నమే రమణి కళ్యాణం. ట్రైలర్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇవాళ (మే 22) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి రమణి కళ్యాణం రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్‌: రమణి కళ్యాణం

నటీనటులు: సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్, శ్రీనివాస రెడ్డి, కిర్రాక్ సీత, యాంకర్ శ్యామల తదితరులు

కథ, దర్శకత్వం: విజయ్ ఆదిరెడ్డి

సంగీతం : సూరజ్ ఎస్ కురుప్

సినిమాటోగ్రఫీ : అరవింద్ తిరుకోవెల

ఎడిటింగ్ : రవితేజ గిరజాల

డైలాగ్స్ : రామ్ జగదీశ్

నిర్మాతలు: విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల

నిర్మాణ సంస్థ: కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్

విడుదల తేది: మే 22, 2026

కథ:

సంజన (దీప్షిక చంద్రన్) చిన్నతనంలోనే ఒక ప్రమాదంలో కంటిచూపు కోల్పోతుంది. అయినా సరే అధైర్యపడకుండా, తన పనులు తనే చేసుకుంటూ ఒక పబ్‌లో సింగర్‌గా జీవనం సాగిస్తూ ఉంటుంది. నలుగురు అనాథ పిల్లలు, ఒక బామ్మే ఆమె ప్రపంచం. అదే పబ్ ఓనర్ కిషోర్ (శ్రీనివాస రెడ్డి) స్నేహితుడైన రాజ్ (సూర్య వశిష్ట) పక్షవాతం కారణంగా వీల్ చైర్‌కే పరిమితమవుతాడు. తన గతాన్ని తలుచుకుంటూ నిరంతరం బాధపడే రాజ్‌కు సంజనతో పరిచయం ఏర్పడుతుంది.

ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ఆపై ప్రేమగా మారుతుంది. సంజన సాన్నిహిత్యంతో రాజ్ తన బాధను మర్చిపోయి సంతోషంగా జీవించడం మొదలుపెడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తరుణంలో కిషోర్‌కు రాజ్‌కు సంబంధించిన ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అసలు రాజ్ గతం ఏంటి? సంజనతో ఉన్న ఆ పిల్లలు ఎవరు? కిషోర్‌కు తెలిసిన ఆ నిజం వీరి పెళ్లిని ఎలా ప్రభావితం చేసింది? మరి రాజ్, సంజన ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? అనేది తెలియాలంటే రమణి కళ్యాణం చూడాల్సందే.

విశ్లేషణ:

శారీరకలోపాలు ఉన్నంత మాత్రాన జీవితంలో ముందుకు సాగడానికి ఏదీ అడ్డంకి కాకూడదనే ఒక మంచి పాయింట్‌తో దర్శకుడు ఈ కథను రాసుకున్నారు. మొదటి భాగం అంతా హీరో హీరోయిన్ల పాత్రల పరిచయం, వారి మధ్య సాగే సున్నితమైన సన్నివేశాలతో సాగిపోతుంది. ఇంటర్వెల్ కార్డు పడే సమయానికి వచ్చే ఎమోషనల్ సీన్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.

ద్వితీయార్థంలో భావోద్వేగాల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. హీరోయిన్ పాత్రను డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. చూపు లేకపోయినా ఆమె చూపించే ధైర్యం, కారు ఎక్కడానికి ఆమెకు ఉన్న ఒక రకమైన భయం (ట్రామా) చుట్టూ అల్లిన సీన్స్ ఆకట్టుకుంటాయి. రాజ్ తాలూకు గతానికి సంబంధించిన సీన్స్ బాగానే రాసుకున్నారు. అలాగే, ఇంటర్వెల్ ట్విస్ట్ థ్రిల్ ఇస్తుంది.

వైకల్యం అనేది శరీరానికే

"వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు అనే సందేశాన్ని ఒక అందమైన ప్రేమకథ ద్వారా చెప్పాలనుకున్నాం" అని దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అందుకు తగినట్లుగానే సినిమాలో సీన్స్, డైలాగ్స్ ఉంటాయి. అవి ప్రభావితం కూడా చేస్తాయి. అక్కడక్కడ కామెడీ ఉంది. అది కొంతమేర వరకే సక్సెస్ అయింది.

హీరోయిన్ ఆర్జేగా మారే ఎపిసోడ్స్ బాగున్నాయి. వీల్ చైర్‌లో ఉన్న హీరో, చూపులేని హీరోయిన్‌తో డ్రీమ్ సాంగ్స్ ప్లాన్ చేయడం కథా ప్రవాహాన్ని కాస్తా దెబ్బతీసిన ఫీలింగ్ కలుగుతుంది. సన్నివేశాలకు అనుగుణంగా వచ్చే కొన్ని సాంగ్స్ మెప్పిస్తాయి. ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ ఏమాత్రం ఊహించని విధంగా ఉండి ఆశ్చర్యపరుస్తుంది. అయితే, క్లైమాక్స్ ఎమోషనల్ టచ్‌తో ముగుస్తుంది.

నటీనటుల సత్తా.. సాంకేతికత ఎలా ఉందంటే?

చూపులేని అమ్మాయిగా దీప్షిక చంద్రన్ అద్భుతమైన నటన కనబరిచింది. కళ్లతోనే హావభావాలను పలికిస్తూ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హీరో సూర్య వశిష్ట కూడా వీల్ చైర్‌కే పరిమితమైన యువకుడిగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన పాత్రతో ఇంటెన్సిటీ పెంచాడు. తెలుగులో స్టార్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీనివాస రెడ్డి ఈసారి ఎమోషనల్ పాత్రతో మెప్పించాడు. యాంకర్ శ్యామల, కిర్రాక్ సీత, లోహిత్ కుమార్, ప్రభావతి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక పరంగా అరవింద్ తిరుకోవెల సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ఫీల్ గుడ్‌గా ఉన్నాయి. సూరజ్ ఎస్ కురుప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది. అయితే పాటలు అంతగా గుర్తుండవు. ఎడిటర్ రవితేజ గిరజాల అనవసరపు ల్యాగ్ సీన్లను, ఆ డ్రీమ్ సాంగ్‌ను కట్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్పీగా ఉంటే బాగుండేది. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా బాగున్నాయి.

మోటివేషనల్ మెసేజ్

దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి ఎంచుకున్న పాయింట్, ఇవ్వాలనుకున్న మోటివేషనల్ మెసేజ్ బాగున్నప్పటికీ, దానికి ఇంకాస్త బలమైన స్క్రీన్‌ప్లే, ఎమోషన్ తోడై ఉంటే 'రమణి కళ్యాణం' రేంజ్ మరోలా ఉండేది. కేవలం ఒక సున్నితమైన ప్రేమకథను చూడాలనుకునే వారికి ఈ వారాంతంలో ఇది బెస్ట్ ఛాయిస్.

రేటింగ్: 3/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More