Purushaha Review: పురుషః రివ్యూ- నవ్వులు పూయించే మొగుళ్ల కష్టాలు-పవన్ కల్యాణ్, సప్తగిరి ఫ్యామిలీ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Purushaha Review And Rating: పెళ్లయిన మగవారి ఇబ్బందులను, భార్యాభర్తల మధ్య వచ్చే ఈగో క్లాషెస్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించిన సినిమా పురుషః. పవన్ కల్యాణ్, సప్తగిరి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా మే 22న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉందో నేటి పురుషః రివ్యూలో చూద్దాం.
Purushaha Movie Review In Telugu: టాలీవుడ్‌లో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నచిన్న గొడవలు, పెళ్లయిన మగవారి కష్టాల నేపథ్యంలో వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. గతంలో వచ్చిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెళ్లాం ఊరెళితే వంటి చిత్రాల పంథాలోనే సరికొత్త హాస్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘పురుషః’.

పురుషః రివ్యూ
పవన్ కల్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో కల్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన పురుషః సినిమా మే 22న థియేటర్లలో విడుదలవుతోంది. అయితే, ఒక రోజు ముందే పురుషః స్పెషల్ ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి పురుషః రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
గోవింద్ (పవన్ కల్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్ కుమార్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరినొకరు వదిలి ఉండలేనంత క్లోజ్. అయితే వీరి జీవితాల్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. వీరి భార్యలు కమల (రాయంచ), లక్ష్మి (హాసిని), గీత (విషిక) విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కుతారు. కానీ కేసు విచారణకు మాత్రం రారు. దీంతో జడ్జి విసుగు చెంది అసలు గొడవ ఏంటో చెప్పమని భర్తలను అడుగుతాడు.
ఈ ముగ్గురు స్నేహితులు కలిసి తమ చిన్ననాటి దోస్త్ కిస్సు (వెన్నెల కిషోర్) పెళ్లికి వెళ్తారు. అక్కడ కిస్సు రాసుకున్న పాత డైరీలో వీరి చిన్ననాటి చిలిపి పనులు, పాత ప్రేమకథలు చూసి భార్యలు అనుమానంతో గొడవపడతారు. ఆ పెళ్లికి వచ్చిన దేవిక (అనైరా గుప్తా) అనే అమ్మాయితో కూడా తమ భర్తలు గడిపారని భార్యలు నమ్ముతారు.
మరోవైపు హీరో గోవింద్ గతాన్ని తవ్వితే రోజీ (గ్యాబి రాక్) అనే మరో అమ్మాయి కథ బయటపడుతుంది. చివరకు ఈ ముగ్గురి భార్యలకు ఎలాంటి నిజాలు తెలిశాయి? వారు అనుమానించింది నిజమా? కాదా ? ఈ ముగ్గురు భార్యలు కోర్టుకు వచ్చారా? భర్తలను అర్థం చేసుకున్నారా? చివరికి ఏం జరిగింది? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
పురుషః ఒక ఫ్యామిలీ కామెడీ సస్పెన్స్ డ్రామా చిత్రం. సమాజంలో మగవాళ్లు పడే కష్టాలను ఎప్పుడూ హాస్య పూరితంగానే చూస్తుంటారు. డైరెక్టర్ వీరు వులవల కూడా అదే పంథాను ఎంచుకుని సినిమా అంతటా వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు. ప్రథమార్ధం అంతా భార్యాభర్తల ఇగోలు, కోర్టు సీన్లు, స్నేహితుల మధ్య వచ్చే కామెడీ ట్రాక్‌లతో చకచకా సాగిపోతుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్‌లో కిస్సు పెళ్లిలో అసలు నిజాలు బయటపడే సీన్ సెకండాప్‌పై ఆసక్తిని పెంచుతుంది. "సినిమాలో పమ్మి సాయి పాత్ర చెప్పే డైలాగులు నవ్విస్తూనే సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ఆలోచింపజేసేలా ఉన్నాయి. ద్వితీయార్థంలో గోవింద్ పాత ప్రేమకథ, భార్యాభర్తల మధ్య వచ్చే ఈగో క్లాషెస్‌తో కథ నడుస్తుంది.
అయితే కేవలం చిన్ననాటి చిలిపి పనులకే విడాకుల దాకా వెళ్తారా అనే పాయింట్‌ను దర్శకుడు అంత బలంగా చూపించలేకపోయారు. కొన్ని చోట్ల ఎమోషన్స్ బాగానే పండింది. కానీ, హీరోలు సూపర్ హీరోలుగా మారి భార్యలతో ఫైట్ చేసే పారడీ సీన్లు అంతగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో వచ్చే ఐటెమ్ సాంగ్ పర్వాలేదనిపిస్తుంది. కొన్ని సీన్లు సూడో ఫెమినిస్టుల భావాలను నొప్పించేలా ఉన్నా, సాధారణ ప్రేక్షకుడికి మాత్రం నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఆకట్టుకుంటుంది.
నటీనటుల సత్తా.. సాంకేతిక పనితీరు
కొత్త నటుడైనప్పటికీ పవన్ కల్యాణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. డ్యాన్స్, ఎమోషనల్ సీన్లలో మంచి ఈజ్ చూపించాడు. కసిరెడ్డి రాజ్ కుమార్, వెన్నెల కిషోర్ తమదైన టైమింగ్‌తో థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించారు. సప్తగిరి, విటివి గణేష్ ఉన్నంతలో బాగానే నవ్వించారు. హీరోయిన్ రాయంచ హోమ్లీగా కనిపిస్తూనే ఎమోషన్స్ బాగా పండించింది. బ్రెజిల్ నటి గ్యాబి రాక్ క్యూట్ నటనతో మెప్పిస్తుంది.
టెక్నికల్ పరంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. పాటలు వినడానికి బాగున్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు. ఎడిటింగ్ విషయంలో కాస్తా కేర్ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ టేకింగ్ చాలా బాగుంది. పెళ్లయిన మగాళ్ల కష్టాలను చాలా కామెడీగా ఆలోచింపజేసేలా బాగా చూపించారు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
అయితే, కొన్ని పాయింట్స్‌ను ఇంకాస్తా బలంగా చూపించాల్సింది. ఓవరాల్‌గా దర్శకుడికి మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే కొంత ల్యాగ్ పక్కన పెడితే వీకెండ్‌లో సరదాగా నవ్వుకోవడానికి పురుషః సినిమాను ఎంచక్కా ట్రై చేయొచ్చు.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


