Ramya Krishnan: పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసుంటే బాగుండేది, ఆయన మాట నేనే వినలేదు- భర్తతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ

Ramya Krishnan About Marriage With Krishna Vamsi: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ విడిపోయారంటూ కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో వేర్వేరుగా ఉంటుండటమే ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. తాజాగా ఈ వార్తలు,పెళ్లిపై రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published on: Nov 16, 2026, 17:44:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramya Krishnan About Marriage With Krishna Vamsi: టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ కపుల్స్ అనగానే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, అగ్ర నటి రమ్యకృష్ణ పేర్లు గుర్తొస్తాయి. అయితే కొన్నేళ్లుగా వీరిద్దరూ విడిపోయారంటూ ఫిలింనగర్ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసుంటే బాగుండేది, ఆయన మాట నేనే వినలేదు- భర్తతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ
పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసుంటే బాగుండేది, ఆయన మాట నేనే వినలేదు- భర్తతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ

వేర్వేరు నగరాల్లో

కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటుంటే, రమ్యకృష్ణ చెన్నైలో నివసిస్తుండటం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. ఎట్టకేలకు ఈ ఊహాగానాలపై రమ్యకృష్ణ పూర్తి స్పష్టత ఇచ్చారు. తాము వంద శాతం కలిసే ఉన్నామని తేల్చిచెప్పారు.

తాజాగా 'రా టాక్స్ విత్ వీకే' (Raw Talks with VK) పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రమ్యకృష్ణ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటేనే బంధం నిలబడుతుందన్న పాత ఆలోచనలను పక్కన పెట్టి, తమ సౌలభ్యం కోసం రెండు వేర్వేరు నగరాల్లో ఎంతో సంతోషంగా ఉంటున్నామని వివరించారు.

వేరుగా ఉండటానికి తెలంగాణ ఉద్యమమే కారణం!

హైదరాబాద్, చెన్నై నగరాల మధ్య తాము ఎందుకు విడివిడిగా ఉండాల్సి వచ్చిందో రమ్యకృష్ణ పూసగుచ్చినట్లు చెప్పారు. "మేము వంద శాతం భార్యాభర్తలుగానే ఉన్నాం. కానీ మా సౌకర్యం కోసం రెండు వేర్వేరు నగరాల్లో ఆనందంగా జీవిస్తున్నాం" అని రమ్యకృష్ణ తెలిపారు.

"గతంలో నేను ఓ టీవీ షో షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మా అబ్బాయి రుత్విక్ ఎదుగుతున్న వయసులో ఉన్నాడు. అప్పట్లో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెన్నై వెళ్లి వస్తుండేదాన్ని. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. బంద్‌లు, సమ్మెల వల్ల తరచూ స్కూళ్లకు సెలవులు ఇచ్చేవారు. ఆ పరిస్థితులు నాకు, నా కొడుకుకు ఎంతో ఇబ్బందిగా మారాయి" అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

"నేను షూటింగ్ కోసం ఊరు దాటి వెళ్లిన ప్రతిసారీ వాడు అనారోగ్యానికి గురయ్యేవాడు. అందుకే వాడి భవిష్యత్తు కోసం చెన్నైలోని స్కూల్లో చేర్పించాలని నిర్ణయించుకున్నాను" అని రమ్యకృష్ణ నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

పెళ్లి అనేది ఓవర్‌రేటెడ్ ప్రాసెస్.. లివ్-ఇన్ బెటర్!

వైవాహిక వ్యవస్థపై రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. అసలు పెళ్లి చేసుకోకుండా కృష్ణవంశీతో కలిసి సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) చేసి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

"నా దృష్టిలో రిలేషన్‌షిప్‌లో పెళ్లి అనేది ఒక ఓవర్‌రేటెడ్ ప్రాసెస్. చాలా అవసరం అనుకున్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. నిజానికి అప్పట్లో వంశీ కూడా పెళ్లి ఎందుకు? హాయిగా కలిసి ఉందాం అని పదే పదే చెప్పేవారు. బహుశా నేను అప్పుడే ఆయన మాటకు సరే అని ఉండాల్సింది" అని రమ్యకృష్ణ పేర్కొన్నారు.

"పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు, చుట్టూ ఉండే ఎంతోమంది వ్యక్తులు మధ్యలోకి వస్తారు. మన భాగస్వామి కంటే చుట్టూ ఉన్న ఆ బంధాలకు, సమాజానికే మనం ఎక్కువ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ వ్యక్తిగతంగా నాకు, వంశీకి మధ్య ఉన్న బంధం మాత్రం ఎప్పటికీ పరిపూర్ణంగానే ఉంటుంది" అని ఆమె మనసులో మాట బయటపెట్టారు.

వేర్వేరుగా ఉంటున్నాం కాబట్టే

కృష్ణవంశీ, రమ్యకృష్ణల పరిచయం తెలుగు సినిమా సెట్స్‌పైనే మొదలైంది. 'గులాబి', 'నిన్నే పెళ్లాడతా', 'సింధూరం' వంటి క్లాసిక్ చిత్రాల సమయంలో వీరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత 2003లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2005లో కుమారుడు రుత్విక్ వంశీ జన్మించారు.

పెళ్లికి ముందు 'చంద్రలేఖ' (1998), పెళ్లి తర్వాత 'శ్రీ ఆంజనేయం' (2004), అనంతరం 'రంగమార్తాండ' (2023) చిత్రాలకు వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఈ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ తన భర్తతో ఉండే సరదా గొడవల గురించి కూడా నవ్వుతూ ప్రస్తావించారు.

తాము వేర్వేరుగా ఉంటున్నాం కాబట్టే ఇప్పటికీ భార్యాభర్తలుగా కొనసాగుతున్నామంటూ చమత్కరించారు. ప్రతిరోజూ గొడవలు పడేకంటే, ఇప్పుడు తామిద్దరం మంచి స్నేహితులుగా మారిపోయామని చెప్పారు. కృష్ణవంశీకి నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సినిమాయే ప్రపంచమని పేర్కొన్నారు.

'శ్రీ ఆంజనేయం' తర్వాత కథలు చెప్పడం మానేశారు!

ఏళ్ల క్రితం 'శ్రీ ఆంజనేయం' సినిమా సెకండాఫ్ బాగోలేదని తాను విమర్శించినప్పటి నుంచి, వంశీ తన సినిమాల కథలను తనతో పంచుకోవడం మానేశారని రమ్యకృష్ణ సరదాగా వెల్లడించారు. ఎవరి పని వారు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నామని తెలిపారు.

కెరీర్ పరంగా రమ్యకృష్ణ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రంలో మెరిసిన రమ్యకృష్ణ ప్రస్తుతం 'రాకా', 'శ్రీ శ్రీ', 'పాకెట్ నావెల్', 'తేరా యార్ హూన్ మై' వంటి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే 'బిగ్ బాస్ 10 తమిళ్' షోకు గెస్ట్ హోస్ట్‌గానూ వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More