Secret Soldier Review: సీక్రెట్ సోల్జర్ రివ్యూ- రొటీన్ హంగులు లేని దేశభక్తి చిత్రం- నిహాల్, సూర్య హీరోలుగా మెప్పించారా?
Secret Soldier Review And Rating In Telugu: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సీక్రెట్ సోల్జర్'. వాస్తవిక ఘటనల ఆధారంగా సాగే ఈ దేశభక్తి థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో నేటి సీక్రెట్ సోల్జర్ రివ్యూలో చూద్దాం.
Secret Soldier Review And Rating In Telugu: సాధారణంగా 'స్పై థ్రిల్లర్' కథలు అనగానే విదేశీ లోకేషన్లు, అసాధ్యమైన యాక్షన్ సీక్వెన్సులు, కమర్షియల్ హంగామా గుర్తుకొస్తాయి. వీటన్నింటికీ భిన్నంగా, రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగు స్పై యాక్షన్ డ్రామా చిత్రం 'సీక్రెట్ సోల్జర్'.

సెన్సార్ బోర్డ్ దగ్గరే 8 నెలలు
విడుదలకు ముందే పలు రక్షణ శాఖల క్లియరెన్స్‌లు దాటుకుని రావడంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. సెన్సార్ బోర్డ్ దగ్గరే 8 నెలల టైమ్ తీసుకున్న సీక్రెట్ సోల్జర్ సినిమాకు అక్కి విశ్వనాథరెడ్డి దర్శకత్వం వహించారు.
నెల్లూరు నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించగా.. కమల్ కామరాజు, హర్షిత రావు, శ్రీష నూలు ఇతర పాత్రలు పోషించారు. మంచి అంచనాలతో ఇవాళ (సెప్టెంబర్ 18) థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. మరి ఈ సస్పెన్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో నేటి సీక్రెట్ సోల్జర్ రివ్యూలో తెలుసుకుందాం.
అసలు కథేంటంటే?
నెల్లూరుకు చెందిన వాలి (నిహాల్ కోదాటి), పృథ్వీ (సూర్య శ్రీనివాస్) ప్రాణస్నేహితులు. దేశానికి సేవ చేయాలనే తపనతో వాలి ఆర్మీలో చేరాలనుకుంటాడు. అక్కడ అవకాశం రాకపోవడంతో దేశ రక్షణ పరిశోధన సంస్థ 'రా' (RAW) వైపు అడుగులు వేస్తాడు. ఈ క్రమంలో అనుకోని ఒక ఘటన కారణంగా వాలి జైలు పాలవుతాడు. వాలిపై దేశద్రోహి అనే ముద్ర పడుతుంది.
సరిగ్గా అదే సమయంలో రక్షణ శాఖకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారం (డిఫెన్స్ లీక్) బయటకు పొక్కుతుంది. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన ఈ కుట్ర వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? వాలి, పృథ్వి ఈ నెట్‌వర్క్‌లో ఎలా చిక్కుకున్నారు? చివరికి తమ నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుని దేశాన్ని కాపాడుకున్నారు అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే?
వాణిజ్య అంశాల జోలికి పోకుండా, ఒక రియలిస్టిక్ సస్పెన్స్ స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని మలచడంలో దర్శకుడు అక్కి విశ్వనాథరెడ్డి సఫలమయ్యారు. రక్షణ సమాచార లీకేజీ, దేశభక్తి, స్నేహం అనే అంశాలను జోడించిన తీరు ఆకట్టుకుంటుంది. వ్యవస్థను అవినీతిమయంగా చూపించకుండా, పటిష్టమైన భద్రతా కోణాన్ని ఆవిష్కరించడం కథకు బలాన్నిచ్చింది.
రెండు భాగాల కథనంలో సెకండ్ హాఫ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ట్విస్టులు, పరిశోధన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రథమార్థంలో కథ కొంత మందకొడిగా సాగడం ఇబ్బంది పెడుతుంది. డిఫెన్స్ లీక్, కుట్రకు సంబంధించిన వివరాలను ఇంకాస్త స్పష్టంగా చూపిస్తే సినిమా గ్రాఫ్ మరో స్థాయిలో ఉండేది.
నటీనటులు, సాంకేతిక వర్గం
వాలి పాత్రలో నిహాల్ కోదాటి యాక్షన్, ఎమోషనల్ సీన్లలో ఒదిగిపోయాడు. తన నటనతో మెప్పించాడు. పృథ్వీగా సూర్య శ్రీనివాస్ సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఇంప్రెస్ చేశాడు. వీరిద్దరి మధ్య స్నేహం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కమల్ కామరాజు, రంగస్థలం మహేష్, రఘుబాబు, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్‌గా చెప్పాలంటే
సాంకేతిక విభాగంలో నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఉత్కంఠను పెంచింది. కెమెరా పనితనం సినిమాకు సహజత్వాన్ని తెచ్చిపెట్టింది. ఓవర్ హైప్ లేని ఫైట్ సీక్వెన్స్‌లు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే రొటీన్ కమర్షియల్ అంశాలకు దూరంగా, సహజసిద్ధమైన కథనంతో సాగే దేశభక్తి స్పై థ్రిల్లర్లను కోరుకునేవారికి 'సీక్రెట్ సోల్జర్' మంచి అనుభూతిని ఇస్తుంది.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


