సినీ లోకంలో విషాదం- సీనియర్ నటి ఆశా సింగ్ జైస్వాల్ కన్నుమూత- మిమిక్రీ ఆర్టిస్టుగా అరుదైన రికార్డు- ఐరన్ లేడీకి నివాళి
Senior Actress Aasha Singh Jaiswal Passed Away: ప్రముఖ సీనియర్ నటి, మిమిక్రీ ఆర్టిస్ట్ ఆశా సింగ్ జైస్వాల్ ముంబైలో కన్నుమూశారు. బీఆర్ చోప్రా మహాభారత్ సీరియల్‌లో కృపి పాత్ర ద్వారా విశేష ఆదరణ పొందిన ఆమె మృతి పట్ల సినీ, బుల్లితెర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Senior Actress Aasha Singh Jaiswal Passed Away: సినీ లోకంలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. భారతీయ బుల్లితెర, సినీ రంగానికి చెందిన సీనియర్ నటి, ప్రముఖ మహిళా మిమిక్రీ ఆర్టిస్ట్ ఆశా సింగ్ జైస్వాల్ (Aasha Singh Jaiswal) ముంబైలో తుదిశ్వాస విడిచారు.

ఆశా సింగ్ జైస్వాల్ అంత్యక్రియలు
ఆగస్టు 22న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఆశా సింగ్ జైస్వాల్ కన్నుమూసినట్లు ఆమె కుమారుడు ఆకాష్ భరద్వాజ్ ధ్రువీకరించారు. మరుసటి రోజు ఉదయం ముంబై విలే పార్లే వెస్ట్‌లోని పవన్ హన్స్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆశా సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
'ఐరన్ లేడీ'కి కుమారుడి భావోద్వేగ నివాళి
అమ్మ మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన ఆకాష్ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా తల్లికి నివాళులర్పించారు. ఆమెను ఒక శక్తివంతమైన మహిళగా (Iron Lady) వర్ణిస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
నటన మాత్రమే సర్వస్వం
"మా అమ్మ నిరంతరం శ్రమించే ఒక 'ఐరన్ లేడీ'. ఆశా సింగ్ జైస్వాల్ ఆత్మశాంతి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఆశా సింగ్ జైస్వాల్ చేసిన అద్భుతమైన పాత్రలను, నటనను సోషల్ మీడియాలో చూస్తూ ఆమెను గుర్తుంచుకోండి. ఆత్మ ఎక్కడ ఉన్నా మీ అభిమానాన్ని చూసి సంతోషిస్తుంది. ఆమె జీవితంలో నటన, పని మాత్రమే సర్వస్వం" అని ఆకాష్ భరద్వాజ్ పేర్కొన్నారు.
ఆమె కళను గుర్తు చేసుకోవటమే అసలైన నివాళి
మరణం గురించి బాధపడటం కాకుండా, ఆమె అందించిన కళను గుర్తు చేసుకుంటూ ఆనందించడమే అమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆకాష్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు. తెలుగుతో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన బి.ఆర్. చోప్రా పౌరాణిక ధారావాహిక 'మహాభారత్' లో కృపాచార్యుడి సోదరి 'కృపి' పాత్రలో ఆశా సింగ్ జైస్వాల్ చూపిన అభినయం ఆకట్టుకుంది.
సీరియల్స్, సినిమాల్లో కీలక పాత్రలు
ఆ సీరియల్ తెచ్చిపెట్టిన గుర్తింపుతో ఆశా సింగ్‌కు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. షారుఖ్ ఖాన్ నటనకు మైలురాయిగా నిలిచిన 'బాజీగర్' చిత్రంతో పాటు బొబ్బి జాసూస్, దీవాంగి, ఆగ్, కాయదా కానూన్, ఆన్సూ బనే అంగారే, ఘర్ బాజార్ వంటి హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి తనదైన ముద్ర వేశారు.
మిమిక్రీ రంగంలో అరుదైన రికార్డు
కేవలం నటనకే పరిమితం కాకుండా, మహిళా మిమిక్రీ ఆర్టిస్టుగా ఆశా సింగ్ రికార్డు సృష్టించారు. ఆ రోజుల్లో పురుషులదే హవాగా ఉన్న మిమిక్రీ రంగంలోకి అడుగుపెట్టి, దిగ్గజ నటి మీనా కుమారి గొంతును యథాతథంగా అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేవారు.
సామాజిక సేవా కార్యక్రమాలు కూడా
వేదికలపై ఆశా సింగ్ జైస్వాల్ ఇచ్చిన ప్రత్యక్ష ప్రదర్శనలకు విశేష ఆదరణ లభించేది. కళాసేవతో పాటు 'ఆశా ఈవెంట్స్ అండ్ ఫిల్మ్స్' సంస్థను స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొనేవారు. ఆశా సింగ్ జైస్వాల్ మృతికి పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


