ఐమ్యాక్స్ ఆఫీసు ముందు ధర్నా చేస్తా.. అలా అయితే నా సినిమా 3 నిమిషాలు కూడా చూడరు.. అదే నాకు అసలైన సవాలు: వారణాసిపై రాజమౌళి
గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ ‘వారణాసి’ గురించి కీలక అప్‌డేట్స్ వచ్చాయి. ఈ సినిమా రన్‌టైమ్, సీక్వెల్ అవకాశాలపై స్వయంగా రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. బాహుబలిలా ఇది రెండు భాగాలుగా రాదని తేల్చి చెప్పాడు.
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ ఖరారైన విషయం తెలిసిందే. తాజాగా ‘స్క్రీన్ రాంట్ ప్లస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

మూడు గంటల సినిమా.. ప్రేక్షకులు చూస్తారా?
ఈ కాలంలో ప్రేక్షకుల ఏకాగ్రత సమయం తగ్గిపోతోందని.. రీల్స్, షార్ట్ వీడియోలకు అలవాటు పడుతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘వారణాసి’ రన్‌టైమ్ సుమారు 3 గంటలు ఉంటుందని రాజమౌళి వెల్లడించాడు.
దీనిపై అతడు స్పందిస్తూ.. "ప్రేక్షకులు మన పాత్రలతో, మనం సృష్టించిన ప్రపంచంతో కనెక్ట్ అవ్వకపోతే.. 3 గంటలు కాదు కదా, కనీసం 3 నిమిషాలు కూడా చూడరు. వాళ్లకు యూట్యూబ్ వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కాబట్టి సమస్య రన్‌టైమ్ కాదు.. వాళ్లను కథలో లీనం చేయగలగడమే అసలైన సవాలు. ఒక దర్శకుడిగా మనం అది చేయగలిగితే, నిడివి అనేది పెద్ద సమస్యే కాదు" అని తనదైన శైలిలో వివరించాడు. అతని గత సినిమా 'ఆర్ఆర్ఆర్' కూడా 3 గంటలకు పైగా ఉండి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
పార్ట్-2 ఉండదు.. ఒకే భాగం
‘బాహుబలి’ తరహాలో ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. దీనికి జక్కన్న ఫుల్ స్టాప్ పెట్టాడు. "మేము కొన్నాళ్ల పాటు రెండు భాగాలుగా చేద్దామా అని ఆలోచించాం. కానీ వెంటనే ఆ ఆలోచన విరమించుకున్నాం. 'వారణాసి' కేవలం ఒకే సినిమాగా వస్తుంది. దీనికి సీక్వెల్స్ ఉండవు" అని స్పష్టం చేశాడు.
మన రక్తంలోనే పురాణాలు..
ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇది భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతున్న గ్లోబ్-ట్రాటింగ్ (ప్రపంచవ్యాప్తంగా సాగే) అడ్వెంచర్. పురాణాలతో ఉన్న అనుబంధం గురించి రాజమౌళి మాట్లాడుతూ.. "ఈ కథలు మన గతం కాదు, మన రక్తంలోనే ప్రవహిస్తున్నాయి. అవి వేల ఏళ్ల నాటివి కావొచ్చు. కానీ నిరంతరం మనలోనే ఉంటాయి. అందుకే ఆ అంశాలను కథలో మిళితం చేయడం నాకు కష్టం కాదు. కానీ ఇటువంటి ఇతిహాసాలను టచ్ చేసినప్పుడు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమే నాకు పెద్ద సవాలు" అని చెప్పుకొచ్చాడు.
ఐమ్యాక్స్ ముందు ధర్నా చేస్తా..
ఇక ఈ వారణాసి మూవీ ఐమ్యాక్స్ ఫార్మాట్లో షూట్ చేస్తున్న విషయం తెలిసిందే. తన మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ సమయానికి ఇండియాలో 1.43:1 ఐమ్యాక్స్ ఫార్మాట్ ను తీసుకురావాలని, లేదంటే లాస్ ఏంజెల్స్ లోని ఐమ్యాక్స్ ఆఫీసు ముందు ధర్నా చేస్తానని ఇదే ఇంటర్వ్యూలో రాజమౌళి సరదాగా అన్నాడు.
వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఉగాది సందర్భంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఈ మధ్యే రాజమౌళి ఓ స్పెషల్ పోస్టర్ తో వెల్లడించాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


