SS Rajamouli: ఒక్క హాలీవుడ్ మూవీ అయినా చేస్తా.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా అందుకే చేయలేదు: రాజమౌళి

SS Rajamouli: బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఎస్.ఎస్. రాజమౌళి.. అక్కడ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ('లియాన్ కాకాఫ్' అవార్డు) అందుకున్నారు. 'RRR' విజయం తర్వాత హాలీవుడ్ నుంచి తనకు అనేక ఆఫర్లు వచ్చాయని, కానీ తాను ఎందుకు వెళ్లలేదో రాజమౌళి వెల్లడించారు.

Published on: Oct 23, 2026, 13:01:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

SS Rajamouli: తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాతో ఆస్కార్ వేదికపై భారతీయ జెండాను ఎగురవేసిన తర్వాత.. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? హాలీవుడ్‌లో సినిమా చేస్తారా? లేదా? అనే అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

SS Rajamouli: ఒక్క హాలీవుడ్ మూవీ అయినా చేస్తా.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా అందుకే చేయలేదు: రాజమౌళి
SS Rajamouli: ఒక్క హాలీవుడ్ మూవీ అయినా చేస్తా.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా అందుకే చేయలేదు: రాజమౌళి

తాజాగా బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన రాజమౌళి.. స్థానిక బ్రెజిలియన్ మీడియా ('ఒమెలెట్') కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో వస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi) షూటింగ్ కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉందని క్లారిటీ ఇచ్చారు.

"కనీసం ఒక హాలీవుడ్ సినిమా అయినా చేయాలనుంది!"

హాలీవుడ్ వర్కింగ్ కల్చర్, అక్కడ ఉండే నెట్‌వర్కింగ్, ప్రొడక్షన్ నిర్మాణం గురించి రాజమౌళి ఎంతో ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. "నాకు హాలీవుడ్‌లో కనీసం ఒక సినిమా అయినా చేయాలని ఉంది. అక్కడ ఉండే పక్కా వర్క్ ఎథిక్స్, వర్క్ స్ట్రక్చర్ నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. హాలీవుడ్ ప్రొడక్షన్‌లో పనిచేయడం నాకు ఎంతో ఇష్టం" అని రాజమౌళి తెలిపారు.

అయితే 'RRR' తర్వాత వచ్చిన అవకాశాలను ఎందుకు తాను పక్కన పెట్టాల్సి వచ్చిందో వివరిస్తూ.. "'RRR' గ్లోబల్ హిట్ అయ్యాక హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. అందులో కొన్ని ఆఫర్లు ఇప్పటికీ ఓపెన్‌గానే ఉన్నాయి. కానీ 'RRR' సమయానికే నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్ 'వారణాసి' (Varanasi) ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నాను. నా మైండ్ ఒకేసారి రెండు ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టలేదు. ఒక పని పూర్తయ్యాకే మరో పని గురించి ఆలోచించడం నా అలవాటు. 'వారణాసి' పూర్తయ్యాక హాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను" అని రాజమౌళి తెల్చిచెప్పారు.

కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే బాకీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి'. ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు జక్కన్న.

ఈ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్‌కు సంబంధించిన ప్రధాన షూటింగ్ దాదాపు పూర్తయిందని, కేవలం మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని రాజమౌళి ధృవీకరించారు. భారతీయ ఇతిహాసాలను తెరపై ఆవిష్కరించే క్రమంలో తాను గతంలో ఎప్పుడూ పూర్తి సంతృప్తి చెందలేదని, కానీ 'వారణాసి' రూపంలో విజన్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నానని వెల్లడించారు.

2027 ఏప్రిల్ 7న 'వారణాసి' వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్

విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కాంచిలతో కలిసి రాజమౌళి స్క్రీన్‌ప్లే సమకూర్చిన ఈ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

భారీ వీఎఫ్ఎక్స్ (VFX), అంతర్జాతీయ స్థాయి యాక్షన్ స్టంట్స్‌తో రూపొందుతున్న ఈ ఎపిక్ వరల్డ్-ట్రాటర్ ఫిల్మ్‌ను 2027 ఏప్రిల్ 7న (ఉగాది పండుగ కానుకగా) ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ తేదీని ఇప్పటికే అధికారికంగా ఖరారు చేశారు. 'వారణాసి' పూర్తయిన తర్వాతే రాజమౌళి డైరెక్ట్ హాలీవుడ్ ప్రాజెక్ట్ వైపు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More