అమెరికా జీడీపీకి 1.4 బిలియన్ డాలర్లు ఇచ్చిన Stranger Things! షాకింగ్ విషయాలు..
నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్ అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సైతం దోహదపడింది. ఉద్యోగాల నుంచి వ్యాపారాల వరకు ఈ సిరీస్ అమెరికా జీడీపీకి 1.4 బిలియన్ డాలర్లు ఇచ్చింది!
దాదాపు పదేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఉర్రూతలూగించిన సైన్స్ ఫిక్షన్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఒక సాంస్కృతిక సంచలనంగా మారిన ఈ సిరీస్.. ఇప్పటివరకు 120 కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. అంతేకాదు ఒక నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో 1.4 బిలియన్ డాలర్లను చేర్చడం విశేషం!

ఆర్థిక వ్యవస్థపై 'స్ట్రేంజర్' ప్రభావం..
కేవలం స్క్రీన్ మీద కనిపించే కథగానే కాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ భారీ ఊతాన్నిచ్చింది. 2016 నుంచి ఇప్పటివరకు ఈ షో సుమారు 8,000 ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా, అమెరికా జీడీపీకి 1.4 బిలియన్ డాలర్ల మేర దోహదపడింది! ముఖ్యంగా ఈ సిరీస్ చిత్రీకరణ జరిగిన జార్జియా రాష్ట్రంలో పర్యాటక రంగం కళకళలాడిపోయింది. స్ట్రేంజర్ థింగ్స్‌లో చూపించిన ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకులు ఎగబడ్డారు.
అక్కడ సుమారు 650 మిలియన్ డాలర్ల ఆదాయం ఈ షో ద్వారానే లభించడం విశేషం.
వ్యాపార సామ్రాజ్యంలో 'ఎగ్గోస్' మాయాజాలం..
అంతేకాదు ఈ ఒక్క నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అనేక వ్యాపారాల వృద్ధికి సైతం దోహదపడింది. స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్‌లోని ప్రధాన పాత్ర ‘ఎలెవెన్’కు 'ఎగ్గోస్' వాఫెల్స్ అంటే చాలా ఇష్టం. సీజన్ 1,2 లో ఈ విషయాన్ని చాలా బాగా చూపిస్తారు.
అప్పటి నుంచి ఈ వాఫెల్స్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా 2017లో కెల్లాగ్స్ కంపెనీ అమ్మకాల్లో 14 శాతం వృద్ధిని నమోదు చేసింది.
అలాగే, ఇందులో పిల్లలు ఆడే ‘డెంజియన్స్ అండ్ డ్రాగన్స్’ బోర్డ్ గేమ్ పట్ల ఆసక్తి 673 శాతం పెరగడంతో అమ్మకాలు భారీగానే జరిగాయి.
కేవలం సినిమాలకు పరిమితం కాకుండా, తినుబండారాల నుంచి గేమింగ్ వరకు ఈ సిరీస్ ఒక బ్రాండ్‌గా ఎదిగింది.
రికార్డులు తిరగరాసిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5..
స్ట్రేంజర్ థింగ్స్‌లో మొత్తం 5 సీజన్లు ఉంటాయి. సీజన్ 5 వాల్యుమ్ 1 నవంబర్‌లో విడుదలైంది. వాల్యూమ్ 2లోని 3 ఎపిసోడ్లు క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతాయి. ఫినాలే మాత్రం డిసెంబర్ 31న విడుదల అవుతుంది.
అయితే సీజన్ 5 వాల్యుమ్ 1 విడుదలైన కేవలం 25 రోజుల్లోనే 0.2 కోట్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం టాప్ 10 చార్ట్‌లో 9వ స్థానంలో ఉన్న ఈ సిరీస్, 2026 నాటికి నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశేషం ఏంటంటే, ఈ సిరీస్ ప్రసారమైన 93 దేశాల్లో 90 దేశాల్లో మొదటి స్థానంలో నిలిచి తన సత్తా చాటుకుంది.
సంగీత ప్రపంచంలోనూ ప్రకంపనలు..
80వ దశకంలో జరిగే ఈ స్ట్రేంజర్ థింగ్స్ అన్ని సీజన్స్‌లో పాత పాటలాను విపరీతంగా వాడారు. దీని ప్రభావం ఎంతలా ఉందంటే.. నాలుగు దశాబ్దాల క్రితం విడుదలైన పాటలు ఇప్పుడు మళ్లీ చార్ట్ బస్టర్స్‌గా నిలుస్తున్నాయి. కేట్ బుష్ పాడిన ‘రన్నింగ్ అప్ దట్ హిల్’ అనే పాట 40 ఏళ్ల తర్వాత అమెరికా టాప్-10 హిట్స్‌లో చేరింది. స్పాటిఫై నివేదిక ప్రకారం, ఈ సిరీస్ పుణ్యమా అని పాత పాటల స్ట్రీమింగ్ ఏకంగా 1,250 శాతం పెరిగింది.
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎపిసోడ్ 5 రిలీజ్ ఎప్పుడు..?
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చివరి మూడు ఎపిసోడ్‌ల నిడివి ఇలా ఉంది:
- ఎపిసోడ్ 5 “షాక్ జాక్”: 1 గంట 8 నిమిషాలు
- ఎపిసోడ్ 6 “ఎస్కేప్ ఫ్రమ్ కామజోట్జ్”: 1 గంట 15 నిమిషాలు
- ఎపిసోడ్ 7 “ద బ్రిడ్జ్”: 1 గంట 6 నిమిషాలు
భారత కాలమానం ప్రకారం ఇవి డిసెంబర్ 26, శుక్రవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ అవుతాయి.
ఇక 'ది రైట్‌సైడ్ అప్' పేరుతో రానున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నిడివి ఏకంగా రెండు గంటల ఎనిమిది నిమిషాలు ఉండనుంది. భారతీయ కాలమానం ప్రకారం జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 6:30 గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ అద్భుత దృశ్యకావ్యం అందుబాటులోకి రానుంది.
ఫినాలే కోసం అమెరికాలో గ్రాండ్‌గా ప్లాన్స్ చేశారు. 500కుపైగా థియేటర్లలో దీనిని ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


