OTT Review: సిరై ఓటీటీ రివ్యూ-గుండెను పిండేసే మూవీ- బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్-తెలుగులో ఉన్న తమిళ సినిమా
ఓటీటీలో తమిళ సినిమా సిరై దుమ్మురేపుతోంది. హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సిరై రివ్యూలో చూసేయండి.
సినిమా పేరు: సిరై

నటీనటులు: విక్రమ్ ప్రభు, ఎల్కే అక్షయ్ కుమార్, అనిష్మ అనిల్ కుమార్, ఆనంద తంబిరాజా తదితరులు
డైరెక్టర్: సురేష్ రాజకుమారి
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరణ్
ఓటీటీ: జీ5 ఓటీటీ
రిలీజ్ డేట్: జనవరి 23
తమిళ సినిమాలను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తూనే ఉంటారు. ఇక కంటెంట్ ఫ్రెష్ గా, హార్ట్ టచింగ్ గా ఉంటే మన ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే సిరై మూవీ కూడా అలాంటింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో థియేటర్లలోకి వచ్చి రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది.
విక్రమ్ ప్రభు లీడ్ రోల్ ప్లే చేసిన సిరై డిసెంబర్ 25, 2025న థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో తమిళంలో మాత్రమే ఆడింది. ఓటీటీలోకి జనవరి 23న వచ్చేసింది. కానీ తెలుగులో మాత్రం జనవరి 26న రిలీజైంది. జీ5 ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉంది. మరి ఈ కోర్టు రూమ్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందో సిరై రివ్యూలో చూసేయండి.
కథ
కదిరవన్ తెలుగులో శ్రీను (విక్రమ్ ప్రభు) ఓ పోలీస్ కానిస్టేబుల్. నిజాయతీగా తన పని తాను చేస్తాడు. అబ్దుల్ రౌఫ్ (అక్షయ్ కుమార్) ఓ మర్డర్ కేసులో విచారణ ఖైదీగా జైలుకు వస్తాడు. ఆ ఖైదీని జైలు నుంచి శివగంగై కోర్టుకు తరలించే బాధ్యత కదిరవన్ కు అప్పగిస్తారు. కదిరవన్ తో పాటు పాండు, మురళీ అనే మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు. మధ్యలో అబ్దుల్ తప్పించుకుంటాడు.
అబ్దుల్ గురించి దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇద్దామని కదిరవన్ వెళ్తే అబ్దుల్ అక్కడే ఉంటాడు. మరి అబ్దుల్ అక్కడికి ఎందుకు వెళ్లాడు? అతను కోర్టుకు ఎందుకు రావాల్సి వచ్చింది? అబ్దుల్ తప్పు చేయలేదని కదిరవన్ కు ఎలా తెలిసింది? అబ్దుల్, కలైయరసి (అనిష్మ) హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఏంటీ? అన్నది సిరై మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
ఇటీవల థియేటర్లలోకి, ఓటీటీలోకి చాలా కోర్టు రూమ్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్లు వస్తున్నాయి. కానీ సిరై కాస్త డిఫరెంట్. ఇందులో ఓ మనసును తాకే లవ్ స్టోరీ ఉంది. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే సందేశం ఉంది. నిర్దోషికి అండగా నిలిచే పోలీస్ కథ ఉంది. అందుకే థియేటర్లలో ఈ సినిమా చూసిన వాళ్లలో కొంతమంది కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మతాలు వేరని తమ ప్రేమను విడగొట్టే మనుషుల మధ్యలో అబ్దుల్, కలైయరసి లవ్ నిలబడిందా? అన్నది సినిమాకే కీలకం. తల్లి కోసం జైలుకు వెళ్లిన అబ్దుల్ తన ప్రేయసి కోసం బయటకు రావాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో వచ్చే సంఘర్షణ సినిమాను నిలబెట్టింది. స్వచ్ఛమైన ప్రేమ కథ, సహజమైన అనుబంధాలు కరవవుతున్న ఈ రోజుల్లో సిరై మూవీ ఓ పాఠంలో నిలిచేదే.
యాక్టింగ్
సిరై మూవీకి మరో ప్లస్ పాయింట్ నటీనటుల ప్రదర్శన. పోలీస్ కానిస్టేబుల్ గా విక్రమ్ ప్రభు అద్భుతంగా నటించాడు. అబ్దుల్ కోసం నిలబడే సన్నివేశాల్లో అతని యాక్టింగ్ అదరిపోయింది. ఇక తల్లి, ప్రేయసిపై ప్రేమను చూపించే అబ్దుల్ గా అక్షయ్ కుమార్ ఎప్పటికీ గుర్తుండిపోయే నటన ప్రదర్శించాడు. అబ్దుల్ ప్రేయసిగా అనిష్మ నటనకు వందకు వంద మార్కులు పడతాయి. ముఖ్యంగా అబ్దుల్ ను తీసుకెళ్లొద్దని బస్ చక్రాల కింద అనిష్మ పడుకునే సీన్ హైలైట్ గా నిలిచింది.
టెక్నికల్ పరంగా చూసుకుంటే డైెరెక్టర్ సురేష్ రాజకుమారి తన ఆలోచనను పక్కాగా స్క్రీన్ పైకి తీసుకొచ్చాడు. సినిమాతో పాటు ప్రేక్షకులు ప్రయాణించేలా చేయడంలో విజయవంతమయ్యాడు. స్టోరీని ప్రారంభించిన తీరు, కోర్టు సన్నివేశాలు, లవ్ స్టోరీ, మధ్యలో థ్రిల్.. ఇలా ప్రతీది ప్రేక్షకుడికి కనెక్ట్ అయింది. జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం కూడా సినిమాను నిలబెట్టింది.
ఫైనల్ గా
సస్పెన్స్, ట్విస్ట్, లవ్, హార్ట్ టచింగ్ డ్రామా.. ఇలాంటి అంశాలున్న మూవీ కావాలనుకుంటే కచ్చితంగా సిరై చూడాల్సిందే. ఈ మూవీ ఎంతలా కదిలించకపోతే థియేటర్లలో ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక ప్రేక్షకుల ఊహకు అందకుండా వచ్చే ట్విస్ట్ లు కూడా ఆశ్చర్యపరుస్తాయి. జీ5 ఓటీటీలో ఉన్న ఈ మూవీపై ఓ లుక్కేయండి మరి.
రేటింగ్: 3.75/5.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


