Telangana Exhibitors: జీవోలు ఇచ్చినా టికెట్ల రేట్లు పెంచం.. పర్సెంటేజీ కావాల్సిందే: తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్
Telangana Exhibitors: తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వం జీవోలు ఇచ్చినా టికెట్ల రేట్లు పెంచబోమని, థియేటర్లు మనుగడ సాగించాలంటే పర్సెంటేజీ విధానం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
Telangana Exhibitors: తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవిష్యత్తు, వాటి పునరుద్ధరణ కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ మంగళవారం (మే 12) కీలక సమావేశం నిర్వహించింది. ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాస్, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ తదితరులు ఈ భేటీలో పాల్గొని, థియేటర్ల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులపై చర్చించారు.

ఆరు నెలలుగా దారుణమైన పరిస్థితులు: చదలవాడ శ్రీనివాస్
సమావేశం అనంతరం నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "నిర్మాత తండ్రి అయితే.. ఎగ్జిబిటర్ బిడ్డ లాంటివాడు. గత 20 ఏళ్లుగా ఎగ్జిబిటర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 2025లో పరిస్థితి మరీ దిగజారింది. గత ఆరు నెలలుగా ఎగ్జిబిటర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. థియేటర్లు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఏకతాటిపైకి రావాలి" అని ఆయన పిలుపునిచ్చారు.
టికెట్ రేట్ల పెంపు ఉండదు: నిర్మాత శిరీష్
ఈ పోరాటం ఎగ్జిబిటర్ల ప్రయోజనాల కోసమే తప్ప, ఏ ఒక్క నిర్మాతను లేదా సినిమాను టార్గెట్ చేయడం కాదని నిర్మాత శిరీష్ స్పష్టం చేశారు.
"ఇతర రాష్ట్రాల్లో థియేటర్లు పర్సంటేజ్ ప్రాతిపదికన నడుస్తున్నాయి. కానీ ఇక్కడ అలా లేదు. ఎగ్జిబిటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రభుత్వం అనుమతించినా, సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలను పెంచే ఆలోచన మాకు లేదు. సామాన్య ప్రేక్షకుడిని దృష్టిలో ఉంచుకుని మేం ముందుకు వెళ్తాం" అని ఆయన వెల్లడించారు.
పర్సంటేజ్ సిస్టమ్ లేకుంటే థియేటర్లు బంద్
తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ మరింత ఘాటుగా స్పందించారు. 2008 నుంచి తాము 'పర్సంటేజ్ షేరింగ్' మోడల్ కోసం పోరాడుతున్నామని గుర్తు చేశారు.
"గీతా ఆర్ట్స్, ఎస్వీసీ (SVC), సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే పర్సంటేజ్ సిస్టమ్‌కు అంగీకరించాయి. మిగిలిన వారు కూడా దీనికి సహకరించాలి. ఎవరైతే ఈ పద్ధతికి అంగీకరిస్తారో వారి సినిమాలనే ప్రదర్శిస్తాం. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే, థియేటర్లను మూసివేయడం తప్ప మాకు మరో మార్గం లేదు" అని ఆయన హెచ్చరించారు.
మల్టీప్లెక్స్ రేంజ్ టెక్నాలజీ కావాలి: సునీల్ నారంగ్
నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ, సింగిల్ స్క్రీన్లలో వసతుల లేమి గురించి ప్రస్తావించారు. "ప్రస్తుతం నిర్మాతలు కూడా నష్టాల్లో ఉన్నారు. సింగిల్ స్క్రీన్లలో మల్టీప్లెక్స్ తరహా టెక్నాలజీని తీసుకురావాలి. డాల్బీ (Dolby) సౌండ్ సిస్టమ్ వంటివి అందుబాటులోకి వస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. సింగిల్ స్క్రీన్లు మూతపడితే అది డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా పెద్ద నష్టమే" అని ఆవేదన వ్యక్తం చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. తెలంగాణ ఎగ్జిబిటర్లు ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు?
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 'పర్సంటేజ్ షేరింగ్' మోడల్‌ను అమలు చేయాలని, అప్పుడే థియేటర్ల నిర్వహణ సాధ్యమవుతుందని వారు డిమాండ్ చేస్తున్నారు.
2. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు పెరుగుతాయా?
ప్రభుత్వం అనుమతించినా, సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలను పెంచే ఉద్దేశం లేదని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది.
3. ఏయే నిర్మాణ సంస్థలు పర్సంటేజ్ సిస్టమ్‌కు మద్దతు ఇచ్చాయి?
గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) వంటి ప్రముఖ సంస్థలు పర్సంటేజ్ షేరింగ్ మోడల్‌కు అంగీకరించినట్లు సమాచారం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


