Jana Nayagan: జన నాయగన్ మూవీ లీక్.. పూజా హెగ్డే ఎమోషనల్ పోస్ట్.. లెక్కలేనన్ని గంటల శ్రమ

Jana Nayagan: దళపతి విజయ్ ఆఖరి సినిమా 'జన నాయగన్' హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడంపై హీరోయిన్ పూజా హెగ్డే ఎమోషనల్ అయింది. పైరసీని ప్రోత్సహించవద్దంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసింది.

Published on: Apr 11, 2026, 16:01:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఆఖరి చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా కోసం కోట్లాది మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షం కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. జన నాయగన్ లీక్ పై హీరోయిన్ పూజా హెగ్డే ఎమోషనల్ అయింది.

జన నాయగన్ మూవీ లీక్ పై పూజ హెగ్డే రియాక్షన్
జన నాయగన్ మూవీ లీక్ పై పూజ హెగ్డే రియాక్షన్

జన నాయగన్ లీక్

సెన్సార్ వివాదంతో జన నాయగన్ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్లు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే ఈ ఘటనపై తన ఆవేదనను, నిరాశను వ్యక్తం చేసింది.

పూజా హెగ్డే స్టోరీ

శనివారం (ఏప్రిల్ 11) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పూజా హెగ్డే స్పందిస్తూ ఒక ఎమోషనల్ నోట్ పంచుకుంది. "నా ప్రియమైన ప్రేక్షకులారా.. ఒక సినిమా అనేది లెక్కలేనన్ని గంటల శ్రమ, సృజనాత్మకమైన రిస్క్, వ్యక్తిగత త్యాగాల ఫలితం. మీకు అత్యుత్తమ అనుభూతిని అందించాలని ప్రతిరోజూ కష్టపడే ఒక భారీ టీమ్ కృషి ఇందులో ఉంది. మా సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం నాకు మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో బాధ కలిగిస్తోంది" అని పూజా హెగ్డే బాధపడింది.

మన బాధ్యత

"ఇలా చట్టవిరుద్ధంగా సినిమా లీక్ అవ్వడం కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా, ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడు ఆశించే కనీస గౌరవాన్ని దెబ్బతీస్తోంది. విజయ్ సార్ చివరి సినిమాను అందరం కలిసి థియేటర్లలో పెద్ద తెరపై చూసి సెలబ్రేట్ చేసుకోవడం మన బాధ్యత కదా? కాబట్టి దయచేసి సినిమాను సరైన మార్గంలోనే చూడండి. కాస్త వేచి ఉండండి, అది సరైన సమయంలో విడుదలవుతుంది. పైరసీని ప్రోత్సహించకండి. అప్పుడే సినిమా, కళ బతుకుతాయి," అని పూజా హెగ్డే తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

పూజా హెగ్డే ఇన్ స్టా స్టోరీ
పూజా హెగ్డే ఇన్ స్టా స్టోరీ

సెన్సార్ చిక్కులు

నిజానికి 'జన నాయగన్' సినిమాను జనవరిలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో విడుదల వాయిదా పడింది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండటంతో సినిమా విడుదల నిలిచిపోయింది.

సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో సినిమా లీక్ కావడం చిత్ర యూనిట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఘటనపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, దీనికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విశ్వనటుడు కమల్ హాసన్ సైతం ఇది "కళపై జరిగిన దాడి" అని అభివర్ణించారు.

రాజకీయ ప్రకంపనలు

హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'జన నాయగన్' ఒక పక్కా పొలిటికల్ డ్రామా. దళపతి విజయ్ తన సొంత పార్టీ 'తమిళ వెట్రి కజగం' (TVK) ద్వారా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు నటించిన చివరి సినిమా ఇదే. ఇందులో పూజా హెగ్డేతో పాటు బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.

ఇది విజయ్‌కు 69వ సినిమా కాగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న విజయ్, తన రాజకీయ ప్రత్యర్థుల ఒత్తిడి వల్లే సినిమా విడుదలలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More