ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ నుంచి సుశాంత్ ఔట్.. కాల్ చేస్తే ఏమన్నాడంటే.. చాలా కోపం వచ్చిందంటూ తరుణ్ భాస్కర్ కామెంట్లు
తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది? మూవీ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ వస్తుంది. అయితే సీక్వెల్ లో సాయి సుశాంత్ రెడ్డి నటించడం లేదు. ఈ విషయం తెలిసి చాలా కోపం వచ్చిందని తరుణ్ భాస్కర్ తెలిపాడు.
తెలుగు సినీ లవర్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్ లో ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ ఒకటి. 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ డైరెక్టర్. అయితే పార్ట్ 1లో కార్తీక్ క్యారెక్టర్ ప్లే చేసిన సాయి సుశాంత్ రెడ్డి ఇప్పుడు ఈఎన్ఈ పార్ట్ 2లో నటించడం లేదు.

తరుణ్ భాస్కర్ కామెంట్లు
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది సినిమాలో విష్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించారు. కానీ ఇప్పుడు దీని సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ లో మాత్రం సాయి సుశాంత్ నటించడం లేదు. దీనిపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెంట్లు వైరల్ గా మారాయి.
చాలా కోపం
రీసెంట్ గా ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న తరుణ్ భాస్కర్.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ లో సాయి సుశాంత్ రెడ్డి నటించకపోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
"ఫోన్ కాల్ లో సుశీ (సాయి సుశాంత్) నటించనని చెప్పగానే కుప్పకూలిపోయా. నాకు చాలా కోపం వచ్చింది. అతను తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. అందుకే బిజినెస్ లో ఒక అడుగు, సినిమాల్లో మరో అడుగు వేయొద్దని అనుకున్నాడు. అందుకే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కు దూరమయ్యాడు’’ అని తరుణ్ భాస్కర్ వెల్లడించాడు.
నిర్ణయాన్ని గౌరవించా
‘‘సుశాంత్ నిర్ణయాన్ని నేను గౌరవించా. ప్రతి వ్యక్తికి వాళ్ల సొంత జర్నీ అనేది ఒకటి ఉంటుంది. నేను అతనికి అవకాశం ఇచ్చాను. కానీ అతను గౌరవప్రదంగా తిరస్కరించాడు" అని దర్శకుడు తరుణ్ భాస్కర్ వివరించాడు. 2025 జూన్ లో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ను ప్రకటించారు.
కార్తీక్ క్యారెక్టర్
ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ లో కార్తీక్ క్యారెక్టర్ ను హిట్, యానిమల్ సినిమాల్లో నటించిన శ్రీకాంత్ మాగంటి చేయనున్నాడు. ‘‘నాకు చెప్పడానికి ఒక కథ ఉంది. నేను ఆగిపోను. సుశాంత్ మారొచ్చు కానీ కార్తీక్ అలాగే ఉంటాడు. నేను ప్రస్తుతం ఫుటేజీని చూస్తున్నప్పుడు కూడా కార్తీక్ ను అలాగే చూస్తున్నా. అదే సినిమా మ్యాజిక్. నేను మీకు కార్తీక్‌ను మాత్రమే చూపిస్తాను. మిమ్మల్ని నిరాశపరచను" అని తరుణ్ చెప్పాడు.
ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఫిల్మ్‌మేకర్ వివేక్‌గా విష్వక్ సేన్, నైట్ క్లబ్ మేనేజర్ కార్తీక్ గా సుశాంత్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కౌశిక్ గా అభినవ్, వీడియో ఎడిటర్ ఉప్పిగా వెంకటేష్ నటించారు.

E-Paper












