Ticket Rates: దయచేసి టికెట్ల రేట్లు పెంచకండి.. అదే ప్రభుత్వం చేసే మంచి.. ఇండస్ట్రీలో ఎవరూ నిజం చెప్పరు: నిర్మాత ధీరజ్
Ticket Rates: టాలీవుడ్ లో ప్రతి పెద్ద సినిమాకు టికెట్ల రేట్లు పెంపు, సినిమా రిలీజ్ లు వాయిదా పడుతుండటంపై నిర్మాత ధీరజ్ మొగిలినేని సంచలన కామెంట్స్ చేశారు. దయచేసి టికెట్ల రేట్లు పెంచొద్దని, అలాగే పెద్ద సినిమాలు ఒకసారి అనౌన్స్ చేసి వాయిదా వేయొద్దని కోరారు.
Ticket Rates: తెలుగు సినిమాల ఇండస్ట్రీలో చిన్న నిర్మాతల గోడు ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు, ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నవే. తాజాగా టికెట్ల రేట్ల పెంపు, సినిమా రిలీజ్ ల వాయిదాపై నిర్మాత ధీరజ్ మొగిలినేని చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. టికెట్ రేట్లు పెంచకపోవడమే ఇండస్ట్రీకి ప్రభుత్వం చేసే మంచి అని ఆయన అనడం గమనార్హం.

మీరు మాకు చేసే మంచి అదే..
సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మూవీ నిర్మాత ధీరజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచడంపై స్పందించారు.
“దయచేసి టికెట్ల రేట్లు పెంచొద్దు. రాజమౌళిగారి వారణాసిలాంటి ఒకటో రెండో సినిమాలు అయితే ఓకే కానీ ప్రతి సినిమాకు పెంచొద్దు. దీనివల్ల మాలాంటి చిన్న సినిమాల వారికి తీవ్ర నష్టం కలుగుతోంది. ప్రతి థియేటర్ పెద్ద సినిమానే వేస్తున్నారు. టికెట్ల రేట్ల పెంపు వల్ల వాళ్లకు అందులో ఎక్కువ లాభం వస్తోంది. చిన్న సినిమాలు వేస్తే ఏం రాదంటూ వాళ్లు థియేటర్లు, షోలు ఇవ్వడం లేదు. అందుకే ప్రభుత్వం దయచేసి టికెట్ల రేట్లు పెంచొద్దు. దీనివల్ల ఎవ్వడికీ లాభం లేదు. మీరు ఇండస్ట్రీకి టికెట్ రేట్లు పెంచకపోవడమే చేసే అతిపెద్ద మంచి” అని ధీరజ్ అనడం గమనార్హం.
4 రోజుల ముందు వచ్చినా చూస్తారు.. మరి మేమేం కావాలి?
ఇక ఆదర్శ కుటుంబంలాంటి పెద్ద సినిమాల రిలీజ్ లు వాయిదా పడటంపై ధీరజ్ ఘాటు కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోయినా.. ఎవరూ నిజం చెప్పరని అనడం గమనార్హం.
"వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటే ఒక బ్రాండ్. 'ఆదర్శ కుటుంబం' లాంటి సినిమా విడుదల తేదీకి కేవలం 4 రోజుల ముందు ప్రమోషన్లు మొదలుపెట్టినా థియేటర్లకు జనాలు భారీగా వస్తారు. కానీ చిన్న సినిమాలకు ఆ సౌలభ్యం ఉండదు. మేము అక్టోబర్ 30 విడుదల కోసం పబ్లిసిటీకి, డిస్ట్రిబ్యూటర్లతో అగ్రిమెంట్లకు ఇప్పటికే లక్షల్లో ఖర్చు చేశాం" అని ధీరజ్ పేర్కొన్నారు.
"ఇప్పుడు హఠాత్తుగా ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30కి రావడంతో, వేరే దారి లేక మా సమ్మర్ హాలిడేస్ సినిమాను నవంబర్ 6కి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మళ్లీ నవంబర్ 6 కోసం ప్రమోషన్లు చేయాలంటే కొత్తగా వడ్డీలకు అప్పులు తెచ్చి ఖర్చు పెట్టాలి. పెద్ద సినిమాల రూ. 50 లక్షల హెచ్చుతగ్గులు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు కానీ, చిన్న నిర్మాతలకు ఇది ప్రాణసంకటంగా మారుతుంది" అని స్పష్టం చేశారు.
తమిళ ఇండస్ట్రీ నుంచి నేర్చుకోవాలి
ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో జరిగిన ఒక ఉదాహరణను ధీరజ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. "తమిళంలో ధనుష్ తన సినిమాను నెల్సన్-రజనీకాంత్ ల 'జైలర్ 2' కోసం వాయిదా వేసుకుంటూనే, సూర్య సినిమా ప్రొడ్యూసర్లు ముందే డేట్ ఫిక్స్ చేసుకున్నందున వారికీ ఇబ్బంది కలగని విధంగా సరికొత్త తేదీని ఎంచుకున్నారు. అక్కడ పెద్ద హీరోలు, నిర్మాతలు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు" అని విశ్లేషించారు.
"టాలీవుడ్లో పెద్ద నిర్మాతలు కేవలం ఇతర పెద్ద సినిమాల మేకర్స్‌తో మాత్రమే కమ్యూనికేట్ అవుతున్నారు. చిన్న సినిమాల నిర్మాతల షెడ్యూళ్లను, వారి కష్టాలను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమకు ఇది ఆరోగ్యకరం కాదు
గతంలో కూడా 'లెనిన్' వంటి పలు చిత్రాల సమయంలో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల చిన్న నిర్మాతలు ఇబ్బంది పడ్డారు. గతంలో కింగ్ నాగార్జున కూడా బహిరంగంగానే పెద్ద సినిమాల మేకర్స్‌కు హితవు పలికారు.
"సినిమాలను సరైన సమయానికి పూర్తి చేసి పక్కా ప్లానింగ్‌తో రావాలి తప్ప, వాయిదాల పేరిట పరిశ్రమను ఇబ్బంది పెట్టకూడదు" అని సూచించారు.
ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతినడమే కాకుండా, బాక్సాఫీస్ కలెక్షన్లపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలను కూడా ఆదుకునేలా రీలీజ్ క్యాలెండర్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


