Bharat Kapoor Death: వెండితెరపై విలనిజానికి కేరాఫ్ అడ్రస్.. ప్రముఖ నటుడు భరత్ కపూర్ కన్నుమూత.. ధురంధర్ నటుడి నివాళి!
Bollywood Actor Bharat Kapoor Passed Away: బాలీవుడ్ ప్రముఖ నటుడు భరత్ కపూర్ (80) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విలన్ పాత్రలతో మెప్పించిన ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. సోమవారం జరిగిన అంత్యక్రియలకు హాజరైన ధురంధర్ నటుడు రాకేష్ బేడీ నివాళులు అర్పించారు.
Veteran Actor Bharat Kapoor Death: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు భరత్ కపూర్ సోమవారం (ఏప్రిల్ 27) సాయంత్రం ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మరణవార్తను సన్నిహితుడు, నటుడు అవతార్ గిల్ ధ్రువీకరించారు.

గుండెపోటు రావడంతో
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో వెటరన్ యాక్టర్ భరత్ కపూర్ మరణించినట్లు ఆయన కుమారుడు రాహుల్ వెల్లడించారు. గడిచిన మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
విలనిజానికి సరికొత్త భాష్యం
80, 90వ దశకాల్లో భరత్ కపూర్ అంటే విలన్ పాత్రలకు పెట్టింది పేరు. అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
'ఆఖ్రీ రాస్తా', 'బర్సాత్', 'నూరీ', 'రామ్ బలరామ్', 'ఇంకార్' వంటి చిత్రాల్లో భరత్ కపూర్ చూపిన నటన మరపురానిది. కేవలం విలన్ గానే కాకుండా 'హిందూస్థాన్ కీ కసమ్', 'సోనే పే సుహాగా', 'బలిదాన్' వంటి సినిమాల్లో సహాయ నటుడిగానూ రాణించారు భరత్ కపూర్.
నాకు అన్నలాంటి వాడు: అవతార్ గిల్ భావోద్వేగం
"భరత్ జీతో నాకు 50 ఏళ్లకు పైగా పరిచయం ఉంది. మేము కలిసి ఎన్నో నాటకాలు, సినిమాలు చేశాం. ఆయన నాకు ఒక మార్గదర్శి, అన్నయ్య లాంటి వారు. వారం రోజులుగా ఆయనతో మాట్లాడలేకపోయాను, ఈ లోపే ఇలా జరిగిపోవడం తీరని లోటు" అని తన స్నేహితుడు అవతార్ గిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం సాయంత్రం 6 గంటలకు సియాన్ హాస్పిటల్ సమీపంలోని శ్మశాన వాటికలో భరత్ కపూర్ అంత్యక్రియలు జరిగాయి. ధురంధర్ నటుడు రాకేష్ బేడీ, రమేష్ తల్వార్ వంటి ప్రముఖులు హాజరై నివాళులర్పించారు.
చౌతా కార్యక్రమం
కాగా, భరత్ కపూర్‌కు భార్య లోప, కుమారులు రాహుల్, సాగర్ ఉన్నారు. ఆయన కుమార్తె కవిత కొన్నేళ్ల క్రితమే మరణించారు. ఏప్రిల్ 30న నార్త్ బాంబే అసోసియేషన్‌లో భరత్ కపూర్ 'చౌతా' (శాంతి సభ) కార్యక్రమం నిర్వహించనున్నారు. దానికి 3 రోజుల ముందే ఇలా మరణించడం కలచివేస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. నటుడు భరత్ కపూర్ మరణానికి కారణం ఏమిటి?
భరత్ కపూర్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, సోమవారం సాయంత్రం గుండెపోటు (Cardiac Arrest) రావడంతో మరణించారు.
2. భరత్ కపూర్ ఏ సినిమాల్లో నటించారు?
ఆయన 'ఆఖ్రీ రాస్తా', 'రామ్ బలరామ్', 'నూరీ', 'బర్సాత్' వంటి హిట్ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు. తెలుగులో కూడా అనువాదమైన ఎన్నో హిందీ సినిమాల ద్వారా ఆయన సుపరిచితులు.
3. ఆయన అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి?
ముంబైలోని సియాన్ హాస్పిటల్ సమీపంలో ఉన్న స్మశాన వాటికలో సోమవారం సాయంత్రమే అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


