4 జాతీయ అవార్డులు, అయినా అమితాబ్ బచ్చన్ మనసులో వెలితి- శక్తి, ఉత్సాహం తగ్గుతున్నాయంటూ మెగాస్టార్ ఎమోషనల్
భారతీయ చలనచిత్ర దిగ్గజం, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన పని విషయంలో ఒక చిన్నపాటి విచారాన్ని వ్యక్తం చేశారు. ఉత్తమ నటుడిగా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్న బిగ్ బి అమితా బచ్చన్ మనసులో ఒక చిన్న వెలితి ఉండిపోయిందని తాజాగా ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలపై లుక్కేద్దాం.
భారతీయ సినీ యవనికపై నాలుగు దశాబ్దాలకు పైగా చెరగని ముద్ర వేసిన నటుడు అమితాబ్ బచ్చన్. 83 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిచ్చే ఎనర్జీతో వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.

అమితాబ్ మనసులో వెలితి
ఉత్తమ నటుడిగా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్న ఏకైక రికార్డ్ బిగ్ బి అమితాబ్ సొంతం. అయితే, ఇంతటి అనుభవం ఉన్న ఈ నట దిగ్గజం మనసులో ఒక చిన్నపాటి వెలితి ఉందట. ఆ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగ్ ద్వారా ఎమోషనల్ అవుతూ పంచుకున్నారు.
వయసు అడ్డంకిగా మారుతోంది..
ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటానని చెప్పే బిగ్ బి అమితాబ్ ఈసారి మాత్రం కాస్తంత నిరాశను వ్యక్తం చేశారు. "ప్రతి రోజూ ఒక కొత్త పాఠమే. కానీ, ఇప్పుడు నేర్చుకుంటున్న విషయాలను చాలా ఏళ్ల క్రితమే నేర్చుకోవాల్సింది అనే చిన్న వెలితి ఉండిపోయింది. అప్పుడు ఈ సాంకేతికత లేదు, ఇప్పుడు నేర్చుకుందామంటే వయసుతో పాటు నాలోని శక్తి, ఉత్సాహం తగ్గుతున్నాయి" అని అమితాబ్ బచ్చన్ విచారం వ్యక్తం చేశారు.
నేర్చుకునే లోపే మరోటి
మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ వేగం కూడా పెరిగిందని అమితాబ్ బచ్చన్ అభిప్రాయపడ్డారు. మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే లోపే మరో సరికొత్త విధానం వచ్చేస్తోందని ఆయన అన్నారు.
తెలియకపోతే వదిలేసేవాళ్లం.. కానీ!
"ఈ రోజుల్లో ఏదైనా పని మనకు తెలియకపోయినా పర్వాలేదు. బేసిక్స్ అర్థం చేసుకుని, ఆ పనిలో ఆరితేరిన నిపుణులను నియమించుకుంటే చాలు పని పూర్తవుతుంది. మా కాలంలో ఏదైనా పని తెలియకపోతే విచారిస్తూ కూర్చునేవాళ్లం లేదా ఆ పనిని వదిలేసేవాళ్లం. కానీ, ఇప్పుడు 'అవుట్‌సోర్సింగ్' ద్వారా పనిని సులభంగా పూర్తి చేయవచ్చు. ఈ పదాన్ని నేను కరెక్ట్‌గా వాడానని అనుకుంటున్నాను" అంటూ అమితాబ్ బచ్చన్ చమత్కరించారు.
కేబీసీ 17 సీజన్ పూర్తి
ఇదిలా ఉంటే, అమితాబ్ బచ్చన్ ఇటీవల ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) 17వ సీజన్ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. వెండితెరపై ఆయన చివరిగా ‘వెట్టయన్’ అనే తమిళ యాక్షన్ డ్రామా మూవీలో కనిపించారు.
రజనీకాంత్‌తో కలిసి
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి అమితాబ్ బచ్చన్ నటించిన ఈ వెట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, రితికా సింగ్, దుషార విజయన్, మంజు వారియర్, అభిరామి వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












