...
...
Next Story

Vijay Politics : సినిమాల్లోనూ రాజకీయ, సామాజిక కోణం...! విజయ్ ప్రస్థానం వెనక ఆసక్తికర విషయాలు

Vijay Cinema Politics : 'దళపతి' విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేవలం గ్లామర్‌తో కాకుండా…. దశాబ్దాల తరబడి సినిమాల ద్వారా నిర్మించుకున్న సోషల్ ఇమేజ్‌ను ఓట్లుగా మల్చుకోవటంలోనూ విజయ్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.

Published on: May 4, 2026, 11:38:40 IST
Advertisement

Vijay Cinema Politics : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ స్థాపించిన టీవీకె దుమ్ము రేపుతోంది. ఎర్లీ ట్రెండ్స్ నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను దాటుకొని…. మెజార్టీ సీట్లు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే విజయ్….తిరుగులేని నాయకుడిగా తమిళనాడు ప్రజల మనసులను గెలుచుకున్నట్లు అయింది.

టీవీకే పార్టీ అధినేత విజయ్ (PTI)
టీవీకే పార్టీ అధినేత విజయ్ (PTI)

తన రెండేళ్ల నాటి పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) కోసం ప్రచారం చేస్తూ…. హీరో విజయ్ ఒక భావోద్వేగపూరితమైన పిలుపునిచ్చారు. "మీరు మీ విజయ్‌ను 100 శాతం నమ్మవచ్చు," అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రచార సమయంలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 68 చిత్రాల్లో కథానాయకుడిగా నటించి…. లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్లను అందుకన్న జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, ఇప్పుడు వెండితెర వెలుగుల నుంచి అసెంబ్లీ సింహాసనం వైపు అడుగులు వేస్తున్నారు.

తమిళ రాజకీయాల్లో సినిమాకు, సింహాసనానికి విడదీయలేని అనుబంధం ఉంది. నాడు ఎం.జి. రామచంద్రన్ (MGR) తన సినిమాల ద్వారా ప్రజలతో ఒక భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకుని రాజకీయాల్లో విజయం సాధించారు. అదే బాటలో కరుణానిధి తన పదునైన సంభాషణల ద్వారా ద్రావిడ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక జయలలిత తన స్క్రీన్ అథారిటీని రాజ్యాధికారంగా మార్చుకున్నారు. ఇప్పుడు విజయ్ సైతం అదే తరహా 'పొలిటికల్ మేజిక్'ను పునరావృతం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

విజయ్ రాజకీయ రంగప్రవేశం అనేది అకస్మాత్తుగా జరిగిన మార్పు కాదు. దీని వెనుక 30 ఏళ్ల పక్కా ప్లాన్ ఉందని ఆయన సినీ ప్రస్థానాన్ని గమనిస్తే అర్థమవుతుంది. 90వ దశకంలో విజయ్ …. 'కాదలుక్కు మరియాదై', 'తుళ్లత మనముమ్ తుళ్లుమ్' వంటి సినిమాలతో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాల్లో రాజకీయాలు లేకపోయినా….. ప్రజల్లో ఒక బలమైన "నమ్మకాన్ని" (Trust) ఆయన ఏర్పరచుకోగలిగారు.

2011 తర్వాత విజయ్ సినిమాల్లో రాజకీయ సామాజిక కోణం స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'కత్తి' (2014) సినిమాలో వ్యవసాయ సంక్షోభం, కార్పొరేట్ శక్తుల దోపిడీపై విజయ్ గళం విప్పారు. ముఖ్యంగా ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. "మన కడుపు నిండిన తర్వాత తినే అదనపు ఇడ్లీ, మరొకరికి చెందాల్సిన ఆకలి" అని ఆయన చెప్పిన మాటలు మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలా వివరించాయి.

ఆ తర్వాత….. 'మెర్సల్' సినిమాలో వైద్య రంగంలోని వ్యాపార ధోరణిని ఎండగట్టారు. 'సర్కార్' సినిమాలో ఓటు హక్కు ప్రాధాన్యతను, ఎన్నికల అక్రమాలను ఎత్తిచూపారు. "ఒక్క వేలితో విప్లవం" (Oru viral puratchi) అనే నినాదం సినిమా పాటగానే కాకుండా ఒక రాజకీయ నినాదంగా మారిపోయింది. ఇలా సినిమాల ద్వారా విజయ్ ప్రజల హక్కులు, విధులు, అవినీతి రహిత పాలన గురించి నిరంతరం చర్చిస్తూ వచ్చారు.

విజయ్ టాప్ 20 సినిమాల IMDb రేటింగ్‌లను విశ్లేషిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆయన అత్యుత్తమ రేటింగ్ పొందిన సినిమాల్లో దాదాపు 70 శాతం (14 సినిమాలు) 1990, 2000 ప్రారంభ కాలానికి చెందినవి. ఇవన్నీ ఎక్కువగా రొమాంటిక్ లేదా ఫ్యామిలీ డ్రామాలు. రాజకీయ నేపథ్యం ఉన్న 'కత్తి', 'మెర్సల్' వంటి సినిమాలు కేవలం 15 శాతం మాత్రమే. దీనిని బట్టి విజయ్ పొలిటికల్ క్యాపిటల్…. కేవలం సిద్ధాంతాల మీద మాత్రమే కాకుండా, దశాబ్దాలుగా ఆయన సంపాదించుకున్న అభిమానం, భావోద్వేగాల మీద ఆధారపడి ఉందని స్పష్టమవుతోంది.

సినిమాల్లో హీరో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు. కానీ నిజజీవితంలో పాలన అనేది సంక్లిష్టమైనది. విజయ్ సినిమాల్లో తరచుగా కనిపించే 'మంచి vs చెడు' అనే బైనరీ లాజిక్ వాస్తవ రాజకీయాల్లో వర్తించదు. అధికార వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం అంటే కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదు, అది సంస్థాగతమైన మార్పు. విజయ్ ఇటీవల నటించినట్లుగా చెప్పబడుతున్న 'జన నాయకన్' (ప్రస్తుతం వివాదాల్లో ఉంది) వంటి సినిమాల్లో సైతం పొలిటికల్ క్లాస్‌ను విలన్లుగా చూపిస్తూ….. ఒక నిబద్ధత గల అధికారిని రక్షకుడిగా చూపడం గమనార్హం…

అయితే సినిమాల్లో రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం….. విజయం సాధించడం సులభం, కానీ ప్రజాక్షేత్రంలో ఓటర్ల తీర్పు అనేది అంత సులభం కాదు. కానీ తమిళనాడు ఎన్నికల ఫలితాలను చూస్తుంటే… ఈ విషయంలో కూడా విజయ్ సక్సెస్ కొట్టినట్లే కనిపిస్తోంది…!

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe